బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 14, 2020 , 00:35:27

నియంత్రితాలపై నిఘా

నియంత్రితాలపై  నిఘా

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన 126 నియంత్రిత ప్రదేశాల(కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు)పై నిరంతర నిఘా కొనసాగించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం నుంచి ఆ ఇండ్లలో ఇంటింటి సర్వే నిర్వహించి కరోనా వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించాలని కోరారు. మున్సిపల్‌, వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులతో కలిసి సోమవారం ఆయన జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు, వైద్యఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో  సెల్‌ కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలు, వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న చికిత్స తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా నియంత్రిత ప్రదేశాలపై నిఘాపెట్టి రోజూ వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఒక్కరికి పాజిటివ్‌ వచ్చిన ప్రదేశం చుట్టూ కనీసం వంద ఇండ్లను కట్టడిచేయాలని ఆదేశించారు. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను ఇళ్లకే సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని, ఒక్కో ప్రాంతంలో ఒక నోడల్‌ అధికారిని నియమించి వారికి ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  గ్రేటర్‌ పరిధిలోనే ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో రెండు వారాల్లోగా పరిస్థితి నియంత్రణలోకి వచ్చే విధంగా జోనల్‌ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు.

ప్రిన్సిపల్‌ సెక్రటరీ తనిఖీ 

హబ్సిగూడ కాకతీయనగర్‌లోని నియంత్రిత ప్రాంతాన్ని సోమవారం ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) విశ్వజీత్‌ తనిఖీ చేశారు. ఈమేరకు ఆయా ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, వారికి కావాల్సిన సరుకులు అందించేలా చూడాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. అలాగే ఉప్పల్‌లోని వాహనాల చెక్‌పోస్టు ప్రాంతాన్ని అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌రావు పరిశీలించారు. ఈమేరకు సిబ్బంది ఆరో గ్యం, విధి నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. 

కఠినంగా వ్యవహరించాలి

సికింద్రాబాద్‌,నమస్తేతెలంగాణ: నియోజకవర్గం పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి తిరిగే వారిపై కఠినంగా వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని వివిధ పోలీస్‌స్టేషన్‌ల అధికారులతో సోమవారం  టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పోలీసులు ప్రధానరోడ్లపైనే కాకుండా గల్లీల్లో కూడా జనాలు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ప్రత్యేక అధికారులు

కొవిడ్‌-19 నివారణ చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో చేపడుతున్న కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ సోమవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

సర్కిళ్లవారీగా...

రాహుల్‌రాజ్‌-మూసాపేట్‌, కూకట్‌పల్లి, ప్రియాంక అల- ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, డి. జయరాజ్‌ కెనడీ- కాప్రా, మల్కాజిగిరి, శంకరయ్య- కుత్బుల్లాపూర్‌, అల్వాల్‌, విజయలక్ష్మి- రాజేంద్రనగర్‌, యాదగిరిరావు- ఉప్పల్‌, ఎల్బీనగర్‌, వి.కృష్ణ- ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌, సరోజ- సికింద్రాబాద్‌, బేగంపేట్‌, పంకజ- హయాత్‌నగర్‌, సరూర్‌నగర్‌, సంధ్య- మెహిదీపట్నం, గోషామహల్‌, ఎన్‌.వాణిశ్రీ- యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, విక్టర్‌- మలక్‌పేట్‌, సంతోష్‌నగర్‌, వెంకటేశ్వర్లు- చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, రవీందర్‌రాజు- కార్వాన్‌, కిషన్‌- గాజులరామారం, శ్రీనివాస్‌- చందానగర్‌, పటాన్‌చెరు, శ్రీలక్ష్మి-ఫలక్‌నుమా.


logo