గురువారం 28 మే 2020
Hyderabad - Apr 14, 2020 , 00:34:15

ప్రాణాలు తీసిన గొడవ

ప్రాణాలు తీసిన గొడవ

  • మాజాలో హర్పిక్‌, ఆల్‌ఔట్‌ కలిపి కూతురు హత్య...
  • ఆపై స్నేహితురాలితో కలిసి ఆత్మహత్య
  • మృతులంతా కరీంనగర్‌కు చెందిన వారే..

జవహర్‌నగర్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చిన్న గొడ రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. క్షణికావేశం కారణంగా       ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల  కథనం ప్రకారం... కరీంనగర్‌ టౌన్‌ ప్రాంతానికి  చెందిన అనూష (26) తన కూతురు ఉమామహేశ్వరి(8), అనూష స్నేహితురాలు సుమతి(28)లు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈనెల 9న గురువారం ఓ జాతీయ పార్టీ తరఫున కరీంనగర్‌లో స్థానిక రాజకీయ నాయకులతో కలిసి పేదలకు నిత్యావసర సరకులు పంచారు. సాయంత్రానికి వారివారి ఇండ్లకు చేరుకున్నారు. 

దీంతో అనూష భర్త నాగరాజుతో పాటు సుమతి భర్త, పిల్లలకు అన్నం వండకుండా ఎక్కడి వెళ్లారంటూ వారిపై చేయి చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన అనూష, కూతురు ఉమామహేశ్వరి, స్నేహితురాలు సుమతితో కలిసి శుక్రవారం మధ్యాహ్నానికి హైదరాబాద్‌ చేరుకుంది. అనూష గతంలో ఓ కంపెనీలో పని చేసినప్పడు పరిచయం ఉన్న కీసర బండ్లగూడలో నివసించే పాస్టర్‌ రత్నం కుమారుడు లారెన్‌కు ఫోన్‌ చేసింది. లాక్‌డౌన్‌లో ఇంతదూరం ఎందుకొచ్చారని మందలించిన లారెన్‌ వారిని తన వాహనంలో జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేట్‌లోని చర్చి పక్కన ఉన్న గదికి తీసుకెళ్లి వారికి నిత్యావసర సరుకులను ఇచ్చి వెళ్లిపోయాడు. శనివారం అదే గదిలో ఉన్న వారు.. ఆదివారం రాత్రి 11.15 నిమిషాలకు చర్చి పక్కన గది నుంచి బయటికి వచ్చి కొద్ది దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ మొదట అనూష తన కూతురుకు మాజాలో హార్పిక్‌, ఆల్‌ఔట్‌ లిక్విడ్‌ కలిపి తాగించింది. 

ఆ తర్వాత అనూష, సుమతి వేర్వేరు చెట్లకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం పొలాలకు వెళ్తున్న స్థానికులు ఈ దృశ్యం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అనూష, సుమతి భర్తలను పిలిపించి విచారించారు. విచారణలో గొడవ పడిన విషయంతో పాటు వారిని మందలించిన విషయాన్ని ఒప్పుకున్నారు. వీరిద్దరివీ ఆత్మహత్యలేనని పోలీసులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్‌ అధికారుల నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి రెండు మొబైల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కూడా సూసైడ్‌కు సంబంధించిన అంశాలు ఏమీ దొరకలేదని పోలీసు వివరించారు. 

చిన్న మనస్పర్థలే వారిని మానసిక ఒత్తిడికి గురి చేశాయని అనుమానిస్తున్నారు. అయితే వారంతా కరీంనగర్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు ఎలా ప్రయాణించారు ? అన్న కోణంలో విచారిస్తూ ఆ వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు. అంతే కాకుండా శామీర్‌పేట్‌ నుంచి గబ్బిలాలపేట్‌ వరకు తీసుకువచ్చిన లారెన్‌ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మాజా, హార్పిక్‌, ఆల్‌ఔట్‌ లిక్విడ్‌ కొనుగోలు చేసిన దుకాణదారులను ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు జవహర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.


logo