మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 14, 2020 , 00:33:05

పోలీసు సారు.. పాటలతో పోరు!

పోలీసు సారు.. పాటలతో పోరు!

  • కరోనాపై నేరేడ్‌మెట్‌ సీఐ వినూత్న ప్రచారం

నేరేడ్‌మెట్‌: ఆయన ఓ పోలీస్‌ అధికారి లాక్‌డౌన్‌ అమలు ఉన్నందున ఆయన విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఒక పౌరుడిగా  కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నడుంబిగించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా పాట పాడి ప్రజలకు వాట్సాప్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. నేరేడ్‌మెట్‌ ఇన్‌స్పెక్టర్‌ అవ్వారి నర్సింహస్వామి. కరోనా కట్టడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లాక్‌డౌన్‌ను నిబంధనలు ఉల్లంఘించకుండా ఎలా వ్యవహరించాలి తదితర అంశాలపై తాను స్వయంగా పాడిన పాటను వీడియో రూపంలో వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా  నీలి నీలి అంబర్‌ పర్‌ చాంద్‌ జబ్‌ ఆయో..అనే హిందీ పాటను పేరడిగా మార్చి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సీఐ స్వయంగా పాట పాడి  సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. అందరం కలిసి కట్టుగా నిబంధనలు పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతలు పాటిస్తే కరోనాను నివారించవచ్చని పాట రూపంలో ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.  సీఐను రాచ కొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌తో పాటు డీసీపీ రక్షత కృష్ణమూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌ ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.అలాగే పాటల రూపంలో అవగాహన కల్పిస్తూనే సీఐ మరోవైపు వలస కార్మికులు, కూలీలు, పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా దాతల ద్వారా సేకరించిన సరుకులను కూడా ఆయన బస్తీల్లో పేదలకు పంచుతున్నారు. logo