బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 14, 2020 , 00:27:44

27వేల బండ్లు సీజ్‌

27వేల బండ్లు సీజ్‌

  • లాక్‌డౌన్‌లోనూ ట్రాఫిక్‌ ఉల్లంఘనలు
  • గుట్కాలు, మద్యం కోసమే యువత చక్కర్లు..
  • కఠిన చర్యలు.. పకడ్బందీగా చార్జిషీట్లు..
  • 2.52 లక్షల కేసులు.. 4లక్షల ఈ-చలాన్లు జారీ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇక్కడ వరుసగా కనపడుతున్న వాహనాలు ఏదో కార్యక్రమానికి వచ్చి పార్కింగ్‌ చేసినవని అనుకుంటున్నారా.. అసలే కావు.. ప్రభుత్వం కరోనా నుంచి ప్రాణాలను కాపాడేందుకు విధించిన నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారివి. పోలీసులకు ఏదో కుంటి సాకు చెప్పి ద్విచక్ర వాహనంపై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సిన రూల్స్‌ బేఖాతరు చేసిన వారివి ఈ వాహనాలు. అయితే ఇందులో చాలా మంది ఏదో ఒక్క మందుల చిట్టిని అడ్డంగా పెట్టుకుని ఈ మందులు కేవలం సికింద్రాబాద్‌ ప్రాంతంలోనే దొరుకుతాయని, మా డాక్టర్‌ అక్కడ ఉంటాడని, నా ఫ్రెండ్‌ దవాఖానలో ఉన్నాడని, మా బంధువులు చాలా సీరియస్‌గా ఉన్నారని ఇలా చెప్పి పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగిన వారే. ఇలా చెప్పి చాలా మంది యువకులు గుట్కాలు, మద్యం కోసం చక్కర్లు కొట్టారు. చివరకు పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీస్తే దొరికిపోయారు. 22 రోజుల పాటు పరిశీలిస్తే.. నిబంధనలు పాటించని వారిపై వేసిన చలాన్‌లు లక్షలు దాటిపోయాయి. 

హైదరాబాద్‌ పరిధిలో..

లాక్‌డౌన్‌ నిబంధనలతోపాటు సడలింపు ఉన్న వారు బయటకు వచ్చినప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి, పాటించని వారిపై ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు వేస్తున్నారు. ఇందులో సాధారణ ఉల్లంఘనలతోపాటు లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారు ఉంటున్నారు. దీంతో వారి వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా శాంతి భద్రతల పోలీసులు 11వ తేదీ వరకు 27,198 పెట్టీ కేసులు, 785 ఎఫ్‌ఐఆర్‌లు, లాక్‌డౌన్‌లో నిబంధనలు పాటించనివారు  59,828 మంది, 18,658 వాహనాలు సీజ్‌ చేశారు. మొత్తం మొత్తం 2,52,027 కేసులు నమోదయ్యాయి.

సైబరాబాద్‌ పరిధిలో..

లాక్‌డౌన్‌లో ఉల్లంఘించి పోలీసులకు పట్టుబడ్డ వారు మొత్తం 5,370. ఇందులో ద్విచక్ర వాహనాలు 3,736, ఆటోలు 747, కార్లు 777, ఇతర వాహనాలు 110, మొత్తం 5,370 వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలను పాటించని విషయానికి వస్తే 22 రోజుల్లో 3,45,155 చలాన్లు జారీ చేశారు. 

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో..: లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన ద్విచక్ర వాహనదారులు 2824, కార్లు 406, ఆటోలు 138, లారీలు  13, ట్రక్కులు 5, మొత్తం 3306 వాహనాలను జప్తు చేశారు. ఇక ట్రాఫిక్‌ ఈ-చలాన్‌ల జారీలను చూస్తే 54,656 మంది ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా తిరిగారు. వీరందరికీ ఈ- చలాన్లు జారీ చేశారు. లాక్‌డౌన్‌ తర్వాత నిబంధనలను పాటించని వాహనదారులపై చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. విచారణలో కోర్టు తీసుకునే చర్యలతో వాహనదారులకు జైలు శిక్షపడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌లో అతివేగం.. ఇప్పటివరకు 10 మంది మృతి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారడంతో పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వాహనదారులకు రోడ్లపై వేగంగా తిరగడం ఎంత జోష్‌ను ఇస్తుందో అంతే విషాదాన్ని మిగిల్చింది. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పోలీసు రికార్డులోకి ఎక్కిన వివరాలను చూస్తే అతి వేగంగా ప్రయాణించి మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మొత్తం 10 మంది మ్యత్యువాతపడ్డారు. ఈ ప్రమాదాలన్నింటిలో వాహనదారులు వేగాన్నే చూశారు తప్పా.. ముంచుకొచ్చే ప్రమాదాన్ని చూడలేదు. దీంతో ప్రమాదం బారినపడి ప్రాణాలను పోగొట్టుకుని ఆ కుటుంబాలను విషాదంలో ముంచేశారు. లాక్‌డౌన్‌ సమయాల్లో మొత్తం 35 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 10 మంది మరణించారు. మార్చిలో 22, ఏప్రిల్‌లో 13 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో మితిమీరిన వేగంతో ప్రయాణించి ఆ వేగాన్ని కంట్రోల్‌ చేయలేకపోవడంతో ఓ స్కీడ్‌ వీరి జీవితానికి డెత్‌ స్పాట్‌ పెట్టిందని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో వారు కూడా లాక్‌డౌన్‌ సమయంలో యువకులకు, విద్యార్థులకు వాహనాలు ఇచ్చి రోడ్లపై పంపొద్దని పోలీసులు కోరుతున్నారు.


logo