శనివారం 30 మే 2020
Hyderabad - Apr 14, 2020 , 00:25:56

ఎవరూ ఆకలితో అలమటించొద్దు

ఎవరూ ఆకలితో అలమటించొద్దు

  • 35 వేల మంది వలస కూలీలకు బియ్యం, ఆర్థిక సాయం 
  • ఇంకా లక్షా 38 వేల మందికి అందించేలా ఏర్పాట్లు 
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ కారణంగా ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించవద్దనేది ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం మాసాబ్‌ట్యాంకులోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లతో కలిసి వలస కూలీలకు,తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యం పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్‌ శ్వేతా మహంతి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌లతో కలిసి మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 35 వేల మంది వలస కూలీలకు బియ్యం, ఆర్థిక సహాయం పంపిణీ చేశామని,ఇంకా లక్షా 38 వేల మంది వలస కూలీలకు బియ్యం అందాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తలసాని వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గుర్తించబడిన కంటైన్మెంట్‌ ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి సూచించారు. నిత్యావసర వస్తువులు, మందులు తదితర అవసరాలు తీర్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ విషయంపై మంగళవారం హోంమంత్రి మహమూద్‌ అలీ, మేయర్‌ రామ్మోహన్‌లతో కలిసి తన కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.


logo