శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 14, 2020 , 00:25:56

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

  • ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు రావద్దనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్‌ రైతుల సొంత ఊరిలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు  శ్రీకారం చుట్టారని అన్నారు. సోమవారం మేడ్చల్‌ జిల్లా పరిధిలోని శామీర్‌పేట్‌, పూడూరు, మేడ్చల్‌ ప్రాంతాల్లో జడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి, కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో రైతుల నుంచి పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతులు ప్రభుత్వ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని,దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. అనంతరం కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్రాల్లో ప్రత్యేకంగా శానిటైజర్లను, తాగునీటి వసతిని కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సమన్వయకర్త నందారెడ్డి, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ భాస్కర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo