శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 12, 2020 , 23:15:59

ప్రజారోగ్యమే పరమావధి..

ప్రజారోగ్యమే పరమావధి..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పారిశుధ్య కార్మికులు ఎండనక నీడనగా.. దుర్వాసనను భరిస్తూ.. వ్యర్థాలను తొలగిస్తూ అలుపెరుగని పోరుచేస్తున్నారు.  ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మరింత పకడ్బందీగా సేవలందిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో సీవరేజీ కార్మికులు వీరోచితంగా పోరాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. క్లిష్ట సమయాల్లో ఎక్కడా మురుగునీరు రోడ్లపై పారకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే క్షణాల్లో  చేరుకుని ముందుగా సంబంధిత మ్యాన్‌హోల్‌ చుట్టూ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. తొలగించిన వ్యర్థాలను వెంటనే తరలించి మరోసారి సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రే చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయే వరకూ సేవలందిస్తున్నారు..రోజుకు ఒక్కో  (మినీ ఎయిర్‌టెక్‌) బృందం 10 నుంచి 15 ప్రాంతాల్లో సమస్యకు పరిష్కారం చూపుతున్నది.

పరిశుభ్రతకు ప్రాధాన్యం..

ఔటర్‌ రింగు రోడ్డు లోపలి గ్రామాల వరకు జలమండలి                                సీవరేజీ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నది.  584 మంది పారిశుధ్య సిబ్బందితో పాటు 66 మినీ ఎయిర్‌టెక్‌ యంత్రాలు, శివారు ప్రాంతాల్లో అదనంగా 28 ఎయిర్‌ టెక్‌ యంత్రాలను వినియోగిస్తున్నారు. కార్మికుల రక్షణకు గమ్‌బూట్లు, గ్లౌజులు, సెఫ్టీ బెల్టులు, గ్యాస్‌ మాస్కులు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌, హెల్మెట్‌, యూనిఫాంలను సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ప్రధానంగా కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సివరేజీ సమస్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజుకు 2 వేల ఫిర్యాదులు వస్తున్నా.. సకాలంలో పరిష్కారం చూపుతున్నామని అధికారులు, కార్మికులు పేర్కొంటున్నారు.  మురుగునీటి సమస్య తలెత్తినప్పుడు 155313కు ఫోన్‌ చేస్తే వెంటనే సేవలందిస్తామంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరంగా స్పందించేందుకు 4 టాస్క్‌ఫోర్స్‌ బృందాలను అందుబాటులో ఉంచామని, ఏ సమస్యకైనా తక్షణం పరిష్కారం చూపుతామని అధికారులు తెలిపారు. 


నిమిషాల్లో పరిష్కారం.

మ్యాన్‌హోల్‌ క్లీనింగ్‌లో తొలుత బార్‌కోడ్‌ ఏర్పాటు చేస్తున్నారు.. ఉప్పొంగే మ్యాన్‌హోల్‌ మూతను తెరచి 10 నిమిషాల తర్వాత జెట్టింగ్‌ యంత్రం పైపులైన్‌తో ఫ్రెష్‌ వాటర్‌తో పిచికారీ చేస్తున్నారు.. మ్యాన్‌హోల్‌లోకి సిల్ట్‌ గిరాబార్‌ దింపి పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నారు. ప్రతి మినీ ఎయిర్‌టెక్‌ వాహనానికి డ్రైవర్‌తో పాటు ఇద్దరు సహాయకులు సేవలందిస్తారు. ఈ యంత్రంలో మురుగునీటిని తోడేందుకు మోటారు, స్టోర్‌ ట్యాంకు, హోస్‌పైపు వంటి ఉపకరణాలుంటాయి. ఇరుకైన వీధుల్లోనూ ఈ యంత్రాన్ని వినియోగించవచ్చు. సీవరేజీ క్లినింగ్‌లో సిబ్బంది తప్పనిసరిగా రక్షణ దుస్తులు ధరిస్తారు. ఇవి బ్యాక్టీరియాలను ధరిచేరనీయవు. 


logo