శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 11, 2020 , 23:52:45

ఇళ్ల వద్దకే సరఫరా..

ఇళ్ల వద్దకే సరఫరా..

 • ఎవరూ బయటకు రావొద్దు..!
 • 28 వరకు నియంత్రిత ప్రాంతాల్లో.. ఇంటింటికీ కూరగాయలు, నిత్యావసర వస్తువులు 
 • రోజుకు రెండుసార్లు రసాయనాల పిచికారి, పారిశుధ్య పనులు
 • వారి ఆరోగ్యంపై నిరంతర నిఘా 
 • నెలాఖరు వరకు కరోనాను పూర్తిగా కట్టడి చేయడమే లక్ష్యం

కరోనాను కట్టడి చేయడమే లక్ష్యంగా నియంత్రిత ప్రాంతా(కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు)లపై పకడ్బందీ నిఘా ఏర్పాటుచేసిన అధికార యంత్రాంగం, ఎవ్వరినీ బయటకు రాకుండా, బయటివారిని లోనికి ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నది. జీహెచ్‌ఎంసీ, వైద్య-ఆరోగ్యశాఖ, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో కూడిన బృందాలు రోజుకు రెండుసార్లు ఇంటింటికీ వెళ్తూ అక్కడివారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించడంతోపాటు వారికి కావాల్సిన వస్తువులను సరఫరా చేస్తున్నాయి. అంతేకాక ఇంటింటికీ క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారి చేస్తూ పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఈనెల 28వ తేదీవరకు నియంత్రిత ప్రాంతాలు యథావిధిగా కొనసాగనున్నాయి. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విదేశాలనుంచి వచ్చినవారు, ఢిల్లీ మర్కజ్‌ యాత్రికులతోపాటు కరోనా వ్యాధి లక్షణాలున్నవారు, అనుమానితులను హోమ్‌ క్వారంటైన్‌లు, ప్రభుత్వ కార్వంటైన్లలో ఉంచగా, ఐదారు రోజుల కిందటే వారికి 14 రోజుల గడువు పూర్తయింది. దీంతో వారికి క్వారంటైన్‌లనుంచి విముక్తి లభించింది. దీంతో చాలావరకు కరోనా ముప్పు తప్పినప్పటికీ ఢిల్లీ మర్కజ్‌ యాత్రికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి క్వారంటైన్‌లో ఉండనందున సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈనెల చివరికల్లా నగరంలో కొత్త కరోనా కేసులు రాకుండా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నియంత్రిత ప్రాంతాలను ఏర్పాటుచేసి అనుమానితులను పూర్తిగా కట్టడి చేసింది. కాగా, ఇంకా కొందరు ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారు, వారితో కలిసినవారు, సంబంధిత రైళ్లు, బస్సుల్లో ప్రయాణించినవారిని గుర్తించి వారున్న ప్రాంతాలను నియంత్రిత ప్రాంతాలుగా ఏర్పాటుచేశారు. గ్రేటర్‌ పరిధిలో దాదాపు 123 చోట్ల ఇటువంటి నియంత్రిత ప్రాంతాలున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 28వ తేదీవరకు ఇవి యథావిధిగా కొనసాగుతాయని, కొత్తగా పాజిటివ్‌ కేసులు రాకుండా చూడడమే లక్ష్యంగా ఈ విధమైన కట్టడిని ఏర్పాటుచేసినట్లు వారు పేర్కొన్నారు. 

కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు

రాంగోపాల్‌పేట్‌లోని జీరా, బడీ మసీద్‌, రెడ్‌హిల్స్‌గ్రాండ్‌ మొఘల్‌ మాన్సన్స్‌,  బజార్‌ఘాట్‌, శ్యామ్‌నగర్‌, చాంద్రాయణగుట్ట-బార్కాస్‌, హఫీజాబాద్‌నగర్‌(బ్లాక్‌-ఏ), నసీబ్‌నగర్‌, మూసాపేట్‌- పద్మావతినగర్‌, సఫ్దర్‌నగర్‌, రామారావునగర్‌, భవానీనగర్‌,  జనతానగర్‌, ఆంజనేయనగర్‌, ప్రగతినగర్‌, కుత్బుల్లాపూర్‌ -గాజులరామారం(చంద్రగిరినగర్‌), రోడామెస్త్రీనగర్‌, శ్రీనివాసనగర్‌, జేసింథ విల్లాస్‌ గేటెడ్‌ కమ్యూనిటీ, యూసుఫ్‌గూడ - వెంకటగిరి, కార్మికనగర్‌, బోరబండ, రహ్మత్‌నగర్‌, షేక్‌పేట్‌, మలక్‌పేట్‌ - ఓల్డ్‌ మలక్‌పేట్‌(సాద్‌ మస్జిద్‌ ఏరియా), అల్వాల్‌ - ఖానాజిగూడ(రాజీవ్‌గాంధీ నగర్‌),  మచ్చబొల్లారం, చంద్రపురి కాలనీ, జానకీనగర్‌, రాజీవ్‌ వీకర్‌ సెక్షన్‌ బస్తీ, కూకట్‌పల్లి - హస్మత్‌పేట్‌, ఆర్సీపురం(మయూరీనగర్‌)- శ్రీసాయినగర్‌, కాకతీయనగర్‌, మల్లికార్జుననగర్‌, చందానగర్‌ - హఫీజ్‌పేట్‌

ప్రాంతాలవారిగా వాట్సాప్‌ గ్రూపులు..

నియంత్రిత ప్రాంతాల్లో ఉన్నవారు కొందరు వాట్సాప్‌ గ్రూపులు తయారుచేసుకొని వారికి కావాల్సిన వస్తువులు, ఏమైనా ఫిర్యాదులుంటే వాటిని వెంటనే ఆ గ్రూపుల్లో పోస్ట్‌ చేస్తున్నారు. అందులో అధికారులు, నోడల్‌ అధికారిని కూడా చేర్చడంవల్ల ఎవరికి, ఏ ఇబ్బంది వచ్చినా, లేక ఎవరికేమైనా కావాల్సివచ్చినా వెంటనే సంబంధిత సిబ్బంది స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఒకేసారి అందరూ తమకు కావాల్సిన వస్తువుల వివరాలు గ్రూప్‌లో పోస్ట్‌చేస్తే ఒకేసారి అందరికీ వ్యాన్‌లో సమాన్లను సమకూరుస్తున్నారు.

నియంత్రిత ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలు..

 • ఇళ్లలోని వారు బయట కాలుపెట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు, పోలీసుల నిఘా
 • ఆ ప్రాంతంలోకి బయటి వ్యక్తులు ప్రవేశించకుండా బారికేడ్ల ఏర్పాటు, సీసీ కెమెరాలతో నిఘా
 • జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ ఉదయం, సాయంత్రం సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రేయింగ్‌
 • తప్పనిసరిగా రోజూ సాయంత్రం ఫాగింగ్‌
 • క్రమం తప్పకుండా స్వీపింగ్‌, చెత్త తొలగింపు
 • సరుకులు కావాల్సినవారికి ఇంటి వద్దకే సరఫరా
 • అన్ని ఇళ్లకు సమాన్లు సమకూర్చేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది కాంటాక్ట్‌ నంబర్లు ఇచ్చారు. సమీపంలోని సూపర్‌ మార్కెట్‌ కాంటాక్ట్‌ నంబర్లు ఆయా ఇళ్ల యజమానులకు ఇచ్చారు.
 • సరుకులు కావాల్సినవారు సూపర్‌ మార్కెట్‌కు ఫోన్‌చేస్తే వారే ప్యాక్‌చేసి పంపిస్తారు. గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా బిల్లు చెల్లించాలి. నగదు రూపంలో బిల్లు చెల్లించాల్సివస్తే, ముందుగా వాటిని శానిటైజ్‌ చేస్తారు.
 • సామాన్లు సమకూర్చే వ్యాన్‌ను వెంటవెంటనే శానిటైజ్‌ చేసిన తరువాతే బయటకు పంపిస్తారు
 • ఎవరికైనా, ఏమైనా సమస్య తలెత్తితే వెంటనే సంబంధిత నోడల్‌ అధికారికి ఫోన్‌ చేయాలి. నోడల్‌ అధికారి ఫోన్‌ నంబరు ఇచ్చారు.
 • వైద్య సిబ్బంది రోజుకు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరికైనా జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తారు
 • ప్రజల చెంతకే తాజా పండ్లు 

లాక్‌డౌన్‌ వేళ అన్నదాతకు మేం ఉన్నామంటూ వాక్‌ ఫర్‌ వాటర్‌ సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. పండ్ల సేకరణలో రైతులకు ఉపశమనం కల్పించడంతో పాటు ఇంటి ముంగిటకే సహజమైన పండ్లను తీసుకువచ్చి అందించే కీలక బాధ్యతను తీసుకున్నది. ‘సహజ పండ్లతో ఆరోగ్యం పొందుదాం-ఇంట్లోనే ఉండి కరోనాను నిలువరిద్దాం’ అంటూ హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాలకు వాహనాల ద్వారా పండ్లు సరఫరా చేయనున్నది. నలుగురు సభ్యులు కలిగిన కుటుంబానికి వారానికి సరిపోయే మామిడి, బొప్పాయి, పుచ్చ, బత్తాయి, సపోట, నిమ్మ తదితర పండ్లను ప్యాకేజీ రూపంలో అందించనున్నది. కనీసం 30 ప్యాక్‌లు తీసుకునే గ్రూపులు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీ సంఘాలకి ఉచితంగా డెలివరీ చేయనున్నామని వాక్‌ ఫర్‌ వాటర్‌ సంస్థ ప్రతినిధి ఎం.కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్‌, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌ రావు, ఎల్బీనగర్‌ మార్కెట్‌ సెక్రటరీ నర్సింహా రెడ్డిలు వాహనానికి జెండా ఊపి  ప్రారంభించారు.  మరిన్ని వివరాలకు వాట్సాప్‌ 98494 33311లలో సంప్రదించవచ్చు.

కాల్‌ చేస్తే.. సేవకు సిద్ధం..!!

 • మెడిసిన్‌ నుంచి నిత్యావసర సరుకుల వరకు సరఫరా

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ సమయంలో సేవా మూర్తులు అండగా నిలుస్తున్నారు. కొంతమంది విరాళాలు, అన్నదానాలతో అభాగ్యులకు చేయూతనిస్తుంటే.. మరికొందరు సేవ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. విపత్కర సమయంలో ఒకరికొకరూ తోడుగా ఉండాలనే స్ఫూర్తిని కల్పిస్తూ.. భరోసానిస్తున్నారు. ఉన్నంతలో సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుత ఆపద సమయంలో ఎక్కువగా నిత్యావసరాలు, మెడిసిన్స్‌ సేవలను అందించడం కీలకం. ఏ సమయంలోనైనా సహాయం చేస్తామంటూ కొంతమంది యువకులు, సంస్థలు అభయమిస్తున్నాయి. వీరి సేవలకు ప్రశంసలు లభిస్తున్నాయి. 

ఇదిగో నంబర్లు..!!

 • కరోనా భయంతో హడలిపోతున్న వారికి మనో ధైర్యాన్ని నింపేందుకు కొందరు యువతీ, యువకులు కలిసి బృందంగా ఏర్పడి సేవలందిస్తున్నారు.  7702500928కు ఫోన్‌ చేస్తే అవగాహన కల్పిస్తున్నారు. 
 • లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బందిపడుతున్న మద్యం బాధితులకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. (8801888805)
 • ‘వన్‌ బిగ్‌ ఫ్యామిలీ’ యాప్‌ సరుకులు, మెడిసిన్స్‌ ఉచిత డెలివరీకి శ్రీకారం చుట్టింది. (18005725200) 
 • అత్యవసరంగా మెడిసిన్‌ను అందించేందుకు యాక్‌ సంస్థ సేవలందిస్తున్నది.  9550000100 కాల్‌ చేసి విషయం తెలియజేస్తే చాలు అవసరమైన మెడిసిన్స్‌ను ఇంటికి తెచ్చిస్తారు. 


logo