ఆదివారం 31 మే 2020
Hyderabad - Apr 11, 2020 , 23:44:24

ఆపద వేళ.. ఆకలి తీర్చి..

ఆపద వేళ.. ఆకలి తీర్చి..

  • నిత్యం అన్నదానం చేస్తున్న పలు సంస్థలు, నాయకులు
  • లాక్‌డౌన్‌లో పేదలకు కడుపునిండా భోజనం
  • దాతృత్వం చాటుకుంటున్న నగరవాసులు
  • అన్నదానాలతో ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు
  • జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 60 వేలు.. 
  • ఇతరుల ద్వారా 1.05 లక్షల మందికి భోజనం
  • ఆపద వేళ.. అన్నార్తుల ఆకలితీర్చుతున్నారు.. లాక్‌డౌన్‌తో ఇబ్బంది 

పడకుండా వలస కూలీలు, పేదలు, యాచకులకు అన్నదానం చేస్తున్నారు. ఆపత్కాలంలో అండగా నిలిచి దాతృత్వం చాటుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని అన్నపూర్ణ కేంద్రాలతో నిత్యం 60 వేల మందికి, ఇతర సంస్థలు, దాతల సహకారంతో 1.05 లక్షల మందికి నిత్యం అన్నదానం చేస్తున్నారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ  :  అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే  అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అంటారు. లాక్‌డౌన్‌ నేపథ్యంతో ఆకలితో అలమటిస్తున్న కూలీలు, పేదలకు దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు.  గ్రేటర్‌లో నిత్యం 1.05 లక్షల మందికి ఆహారం అందించి దాతృత్వం చాటుకుంటున్నారు. ప్రభుత్వం సైతం అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉదయం 40 వేల మంది, రాత్రి 20 వేల మంది చొప్పున మొత్తం 60 వేల మందికి భోజనం అందిస్తున్నది. మొత్తంగా గ్రేటర్‌లో ఆపద వేళ  సుమారు 1,65,000 మందికి అన్నవితరణ జరుగుతున్నది.

ఉప్పల్‌లో 1210 మందికి.. 

ఉప్పల్‌: ఉప్పల్‌లో స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిత్యం 1210 మందికి అన్నదానం అందజేస్తున్నారు. ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కుమారుడు బీఎస్‌ఆర్‌ టీం వ్యవస్థాపకుడు బేతి సుమంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య సిబ్బంది, పోలీసులు 200 మందికి ఆహార ప్యాకెట్లు అందజేశారు. నాచారంలో మూడు రోజులుగా కార్పొరేటర్‌ శాంతిసాయిజెన్‌ శేఖర్‌ 100 మందికి ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. వీ కెన్‌ మేక్‌ ఏ చేంజ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో  చర్లపల్లి, కాప్రా ప్రాంతాల్లో 300 మంది పేదలకు అన్నదానం చేస్తున్నారు.

ఎల్బీనగర్‌ పరిధిలో 8,695 మందికి.. 

ఎల్బీనగర్‌:  ఎల్బీనగర్‌ నియోజకవర్గ పరిధిలో సుమారు 8,695 మందికి నిత్యం అన్నదానం చేస్తున్నారు.  షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 500 మందికి,  టీఆర్‌ఎస్‌ నాయకుడు నర్సింహ ఆధ్వర్యంలో 300 మందికి,  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ వై. సతీశ్‌రెడ్డి  సుమారు 300 మందికి, చైతన్య పురికి చెందిన జాఫర్‌ 100 మందికి, కొత్తపేట కార్పొరేటర్‌ జీవీ సాగర్‌రెడ్డి 500 మందికి,  కన్నాగౌడ్‌  300 మందికి,  కార్పొరేటర్‌ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు  300 మందికి, అమ్మ, నాన్న ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో  300 మందికి, ఓకాస్‌ ఫుడ్‌ ఆధ్వర్యంలో 300 మందికి అన్నదానం చేస్తున్నారు.

ఖైరతాబాద్‌లో 12 వేల మందికి.. 

బంజారాహిల్స్‌ :  ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో నిత్యం 12 వేల మందికి అన్నదానం చేస్తున్నారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో 3000, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి  2500 మందికి అన్నదానం చేస్తున్నారు. బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి పేదలకు అన్నదానం చేస్తున్నారు.  టీపీసీసీ కార్యదర్శి డా.సి.రోహిన్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ నేత వెల్దండ వెంకటేశ్‌ ఆధ్వర్యంలో సుమారు 2000 మందికి అన్నదానం చేస్తున్నారు.

కుత్బుల్లాపూర్‌లో 7500 మందికి.. 

దుండిగల్‌ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలో నిత్యం 7500 మందికి అన్నదానం చేస్తున్నారు.  నిజాంపేట కార్పొరేషన్‌ పరిధిలో  1500 మందికి మున్సిపల్‌ అధికారులు, బోయిన్‌పల్లికి చెందిన డీఆర్‌ఎస్‌ స్కూల్‌ సహకారంతో అన్నదానం చేస్తున్నారు.  జర్నలిస్ట్‌కాలనీలో డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ సహకారంతో 300 మందికి, కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో మున్సిపల్‌ అధికారులు 1400 మందికి అన్నదానం చేస్తున్నారు. జీడిమెట్ల మెట్రోకెమ్‌ యాజమాన్యం  500 మందికి అన్నదానం చేస్తుంది.

అంబర్‌పేటలో 11,750 మందికి.. 

అంబర్‌పేట జోన్‌బృందం: అంబర్‌పేట నియోజకవర్గంలో 11,750 మందికి అన్నదానం చేస్తున్నారు. నల్లకుంటకు చెందిన గో భారతి ఫౌండేషన్‌, శ్రీఅన్నపూర్ణ క్యాటరర్స్‌ సంయుక్తాధ్వర్యంలో రోజు 8 వేల మందికి,  బాగ్‌అంబర్‌పేటలో హనుమాన్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 300 మందికి, భగత్‌సింగ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 250 మందికి,  నల్లకుంటకు చెందిన బిల్డర్‌ ప్రవీణ్‌ యువసేన నేతృత్వంలో 400 మందికి అన్నదానం చేస్తున్నారు. కాచిగూడలో  విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో 1200 మందికి,  కూచికుళ్ల విమలాసుధాకర్‌రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం చేస్తున్నారు.

శేరిలింగంపల్లిలో 15,300 మందికి..

శేరిలింగంపల్లి: నియోజకవర్గంలో నిత్యం 15,300 మందికి అన్నదానం చేస్తున్నారు. మాదాపూర్‌ చార్‌కోల్‌ రెస్టారెంట్‌ ఓనర్‌ నటుడు జీవన్‌ 2000 మందికి, కల్వరీ టెంపుల్‌ 2000, టీఆర్‌ఎస్‌ నాయకుడు మోహన్‌ ముదిరాజ్‌ 2000, గోకుల్‌ ఫ్లాట్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ 800, చందానగర్‌ ఫ్రెండ్స్‌ యూత్‌ 500, మాదాపూర్‌ కార్పొరేటర్‌ జగదీశ్‌గౌడ్‌ 500,  కొండాపూర్‌ కార్పొరేటర్‌ హమీద్‌పటేల్‌ 500, శ్రీరాం నగర్‌ అసోసియేషన్‌ 500, కందాళ శ్రీనివాస్‌ క్యాటరర్స్‌ 500, వార్డుమెంబర్లు రూప, గిరీగౌడ్‌, ప్రేమ్‌నగర్‌ వాసులు 400, టీఆర్‌ఎస్‌ నాయకుడు బీఎస్‌ఎన్‌ కిరణ్‌ యాదవ్‌ 400 మందికి అన్నదానం చేస్తున్నారు. 

సికింద్రాబాద్‌లో 510 మందికి

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ నియోజకవర్గం పరిధిలో నిత్యం 510 మందికి అన్నదానం  చేస్తున్నారు.   పార్సిగుట్టలో టీఆర్‌ఎస్‌ నేత అశోక్‌ ఆధ్వర్యంలో 200,  రాసూరి సునీత ఆధ్వర్యంలో 120 మందికి అన్నదానం చేస్తున్నారు. 

రాజేంద్రనగర్‌లో 3950 మందికి 

రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో 3950 మందికి అన్నదానం చేస్తున్నారు. మణికొండలో విజయ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆధ్వర్యంలో 100,  నెక్నాంపూర్‌లో ధుృవాన్షు సంస్థ ఆధ్వర్యంలో 250, నార్సింగి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రేఖ ఆధ్వర్యంలో 100, నార్సింగిలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో 300,  ముచ్చింతల్‌ శ్రీరామనగరం, చినజీయర్‌స్వామి ఆశ్రమం ఆధ్వర్యంలో 1400, స్వర్ణభారతి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 250, శంషాబాద్‌ మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌ బండి గోపాల్‌ ఆధ్వర్యంలో 300 మందికి అన్నదానం చేస్తున్నారు. 

రాజస్థానీ సమాజ్‌ ఆధ్వర్యంలో.. 

అబిడ్స్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ నిత్యం 2000 మందికి, రాజస్థానీ ప్రగతి సమాజ్‌ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి గోవింద్‌ నిత్య 250, గడ్డం గంగాధర్‌ యాదవ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 200, బేగంబజార్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు రమేశ్‌లాల్‌యాదవ్‌ 100, గన్‌ఫౌండ్రి కార్పొరేటర్‌ మమతాసంతోష్‌గుప్తా 200, మంగళ్‌హాట్‌ కార్పొరేటర్‌ పరమేశ్వరిసింగ్‌ 250 మందికి నిత్యం అన్నదానం          చేస్తున్నారు.

ఆకలి తీర్చే యజ్ఞం..

 లాక్‌డౌన్‌ నేపథ్యంలో  పనులు లేక ఇబ్బంది పడుతున్న యాచకులు, వలస కూలీలను ఆదుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుతో గ్రేటర్‌లో విరివిగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్నదానాలతో వారి ఆకలితీర్చుతున్నారు. పలువురు దాతలు, సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నారు.

సనత్‌నగర్‌లో 9,500 మందికి..

అమీర్‌పేట్‌ :  సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలో సుమారు 9,500 మందికి భోజన ప్యాకెట్లు అందిస్తున్నారు. రాంగోపాల్‌పేటలో గుజరాతీ సమాజం ఆధ్వర్యంలో  5వేల భోజన ప్యాకెట్లు  జీహెచ్‌ఎంసీకి అందిస్తున్నారు.  సనత్‌నగర్‌ మోడల్‌కాలనీకి చెందిన మానవ సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 300 మందికి అన్నదానం చేస్తున్నారు. బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌లోని కార్మికులకు కార్పొరేటర్‌ హేమలత దంపతులు అన్నదానం చేస్తున్నారు. 

కూకట్‌పల్లిలో10 వేల మందికి.. 

కూకట్‌పల్లి జోన్‌ బృందం: కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో 10 వేల మందికి అన్నదానం చేస్తున్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో నిత్యం అన్నదానం చేస్తున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలోని మాతా అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్‌ 1000 మందికి, మావుళ్ల చికెన్‌ పకోడి సెంటర్‌ ఆధ్వర్యంలో 300 మందికి,  టీఆర్‌ఎస్‌ నాయకుడు గోపి ఆధ్వర్యంలో 300  మందికి ,  కేపీహెచ్‌బీకాలనీ కార్పొరేటర్‌ మందాడి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం చేస్తున్నారు. 

కంటోన్మెంట్‌లో 2,200 మందికి

కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో 2,200 మందికి అన్నదానం చేస్తున్నారు. సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్స్‌లో రాహుల్‌ క్యాటరర్స్‌ అధినేత శ్యాంసన్‌రాజు 1000 మందికి,  కార్ఖానా ఇన్‌స్పెక్టర్‌ మధుకర్‌స్వామి 600 ఆహార ప్యాకెట్లు, చినజీయర్‌ స్వామి సేవా సమితి ప్రతినిధులు  300 మందికి నిత్యం అన్నదానం చేస్తున్నారు. 

చాంద్రాయణగుట్టలో 500 మందికి

చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ డివిజన్‌ శివాజీనగర్‌బస్తీలో సిమెంట్‌ వ్యాపారి తాడెం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం చేస్తున్నారు. 

మహేశ్వరంలో 3100 మందికి ..

మహేశ్వరం నియోజక వర్గంలో 3100 మందికి అన్నదానం చేస్తున్నారు. బడంగ్‌పేట పరిధిలోని అశోక్‌రెడ్డి కాలనీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో  400 మందికి ,  గుర్రంగూడలో ఈవీఎల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 100, సీపీఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ చిగిరింత నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో 150,  సరూర్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి  800 మందికి  అన్నదానం చేస్తున్నారు.

మల్కాజిగిరిలో 4500 మందికి.. 

మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గంలో 4500 మందికి అన్నదానం చేస్తున్నారు. ఆనంద్‌బాగ్‌ హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 400 మందికి,  టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి జీవీఎన్‌ సతీశ్‌ 300,  గౌరిశంకర్‌యాదవ్‌ 50 మంది, అల్వాల్‌లో యాక్షన్‌ ఎయిడ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో  3000, అల్వాల్‌ సొసైటీ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి 400, బీజేపీ నాయకుడు దుండగుల వెంకటేశ్‌ 400 మందికి రోజు అన్నదానం             చేస్తున్నారు.

ముషీరాబాద్‌లో 5400 మందికి 

ముషీరాబాద్‌:  పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు అన్నదానం చేస్తున్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 21 స్వచ్ఛంద సంస్థలు, దాతలు మొత్తం 23 మంది నిత్యం 5400 మందికి అన్నదానం చేస్తున్నారు. 

జూబ్లీహిల్స్‌లో 4000 మందికి

జూబ్లీహిల్స్‌ జోన్‌ బృందం : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం పరిధిలో సుమారు 4000 మందికి అన్నదానం చేస్తున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సొంత ఖర్చుతో 1000 మందికి , ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో 500 మందికి,  డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, స్థానిక నేతలు పేదలకు అన్నదానం చేస్తున్నారు. అవతార్‌ సంస్థ ఆధ్వర్యంలో 1000, ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ  200 మంది పేదలకు అన్నదానం చేస్తున్నారు. 

మలక్‌పేట, యాకుత్‌పురాలో.. 

సైదాబాద్‌: మలక్‌పేట, యాకుత్‌పురా నియోజకవర్గాల పరిధిలో నిత్యం 22,500 మందికి అన్నదానం చేస్తున్నారు.  అమ్మ ఫౌండేషన్‌ చైర్మన్‌ నాగమల్ల అనిల్‌కుమార్‌  వలస కూలీలు 200 మందికి, చిన జీయర్‌ స్వామి సేవా సమితి ప్రతినిధులు  300 మందికి, పీపీఆర్‌ సేవా సమితి ప్రతినిధులు పన్నాల పర్వతాల్‌ రెడ్డి, వంశీధర్‌ రెడ్డి, కిరణ్‌కుమార్‌ రెడ్డిలు 300 మందికి, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు శ్యామ్‌ కనకాల ఆధ్వర్యంలో 300 మంది, నెహ్రూనగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ గౌస్‌, మహ్మద్‌ నయీంలు 500 మందికి అన్నదానం చేస్తున్నారు.


logo