శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 10, 2020 , 23:38:53

కట్టడి పెంచారు..

కట్టడి పెంచారు..

 • పాజిటివ్‌ ప్రాంతాలన్నీ.. నియంత్రిత పరిధిలోకి 
 • నగరవాసులకు అసౌకర్యం కలగకుండా.. 12 క్లస్టర్లను 120 ప్రాంతాలుగా విభజన 
 • ఒకట్రెండు కేసులున్న కాలనీలు కూడా.. కంటైన్‌మెంట్‌ జోన్‌లోకి 
 • వచ్చే రెండు వారాల్లో పూర్తిగా నియంత్రణలోకి తెచ్చే వ్యూహం

నగరంలో కరోనా పాజిటివ్‌ నమోదైన ప్రాంతాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను సుమారు 120కి పెంచారు. కంటైన్‌మెంట్‌ల పరిధిని సమస్య ఉన్న ఇండ్లు, వారి అతి సమీప ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశారు. దీనివల్ల ఎక్కువ కాలనీలు బారికేడ్లతో బందీ కాకుండా, సాధారణ పౌరులకు అసౌకర్యం లేకుండా ఉంటుంది. అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. వచ్చే రెండు వారాల్లో వ్యాధిని పూర్తిగా నియంత్రణలోకి తేవాలనే వ్యూహంతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతున్నది. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  నగరంలో 89కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన 12 ప్రాంతాలను గుర్తించి (గత బుధవారం) కంటైన్‌మెంటు క్లస్టర్లుగా ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒకేచోట ఐదు-ఆరు పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల చుట్టూ మూడు-నాలుగు కిలోమీటర్లమేరకు బారికేడ్లు వేసి కట్టడి చేశారు. బారికేడ్లు ఏర్పాటుచేయడం వల్ల రాకపోకలకు వీలు లేకుండా పోయింది. దీనివల్ల దాదాపు 40 శాతం నగరం బారికేడ్లలో బందీ అయిపోయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, బుధవారం ప్రకటించిన కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో అక్కడక్కడ ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైన ప్రాంతాలను చేర్చలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో కరోనా ముప్పు యథావిథిగా పొంచి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన అన్ని ప్రాంతాలను కంటైన్‌మెంటు క్లస్టర్లుగా ఏర్పాటుచేసింది. అయితే ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకుగాను ఈ క్లస్టర్లను సమస్య ఉన్న ఇండ్లు, వాటి పరిసరాలకు మాత్రమే పరిమితం చేసింది. 

పాజిటివ్‌ ప్రాంతాలన్నీ.. దిగ్బంధనం

 నగరంలో ఇప్పటివరకు 150పైచిలుకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  అందులో ఒకే ప్రాంతం నుంచి ఆరు, అంతకన్నా ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలు కొన్ని ఉండగా, ఒకటి-రెండు కేసులు మాత్రమే నమోదైన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. బుధవారం ప్రకటించిన 12 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో 89 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవికాకుండా మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో 593 మందికి పరీక్షలు నిర్వహించగా, 63 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. వీరి ద్వారా మరో 45మంది వారి కుటుంబ సభ్యులు, ఇతరులకు సంక్రమించినట్లు వెల్లడైంది. అయితే గత బుధవారం 89పాజిటివ్‌ కేసులు నమోదైన 12ప్రాంతాలను మాత్రమే కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా అధికారులు నిర్ధారించడం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా పాజిటివ్‌ కేసులు నమోదైన ఇతర ప్రాంతాలను కూడా కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు.

పటాన్‌చెరు సర్కిల్‌లోని మయూరీనగర్‌లో ఒకే ఇంట్లో తండ్రీ, కొడుకులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మయూరీనగర్‌ మొత్తం కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా ఏర్పాటుచేశారు. వాస్తవానికి ఆ ఇంటితోపాటు చుట్టుపక్కల కొన్ని ఇండ్లకు మాత్రమే కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ను పరిమితం చేస్తే మిగిలిన ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడవచ్చు. అంతేకాదు తక్కువ పరిధిలో కంటైన్‌మెంట్‌ ఉంటే ఆ ప్రాంతంపై నిఘా ఏర్పాటు, సహాయక చర్యలు చేపట్టడం సులభతరం అవుతాయి. 

రెండు వారాల్లో నియంత్రించే లక్ష్యంతో..

 రాష్ట్రంలో తబ్లిగీ జమాత్‌కు సంబంధించిన వారితోనే ఎక్కువగా ముప్పు ఏర్పడింది. కేంద్ర ఇంటెలిజెన్స్‌ నివేదికతోపాటు రైల్వేశాఖ ఇచ్చిన సమాచారం ఆధారంగా దాదాపు అందరినీ గుర్తించారు. ప్రస్తుతానికి చాలావరకు క్వారంటైన్లకు తరలించారు. దీంతో వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో బయటినుంచి వచ్చేవారు లేకపోవడం వల్ల ముప్పు తప్పినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడున్నవారిలో అనుమానితులను కంటైన్‌మెంట్‌ల ఏర్పాటు ద్వారా కట్టడిచేస్తే వచ్చే రెండు వారాల్లో వ్యాధి వ్యాప్తి  పూర్తిగా తగ్గిపోతుందన్నది అధికారుల వ్యూహంగా ఉంది. గురువారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఇదే వ్యూహాన్ని అధికారులకు వివరిస్తూ, కంటైన్‌మెంట్లను సక్రమంగా అమలుచేయాలని ఆదేశించారు. దీనివల్ల వచ్చే రెండు వారాల్లో వ్యాధి పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని, కొత్తగా వ్యాప్తి చెందే అవకాశం ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. 

ఒకే ఇంట్లో 10 మందికి పాజిటివ్‌

మలక్‌పేట సర్కిల్‌ పరిధిలోని పాత మలక్‌పేట డివిజన్‌లో కొవిడ్‌-19 కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఓ కుటుంబంలోని 10 మందికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలడంతో ఈస్ట్‌జోన్‌ జాయింట్‌ కమిషనర్‌ రమేశ్‌, అడిషనల్‌ డీసీపీ గోవింద్‌రెడ్డి, సుల్తాన్‌బజార్‌ ఏసీపీ, చాదర్‌ఘాట్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తదితరులు ఆ వీధిని మూసివేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జలాల్‌ స్వీట్‌హౌజ్‌ నుంచి హనుమాన్‌ టెంపుల్‌ వరకు ఒక కిలోమీటర్‌, కాగజ్‌ కార్ఖానా నుంచి ఇదారే మిలియా మసీదు వరకు 1.5 కిలోమీటర్లు, వాహెద్‌నగర్‌ ఆర్‌జే ఫంక్షన్‌ హాల్‌ నుంచి శ్మశానవాటిక వరకు 2 కిలోమీటర్ల పరిధిని క్లస్టర్లుగా విభజించి, ఆ దారుల్లో వాహనాలు తిరుగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. 

అంబర్‌పేటలో.. కొత్తగా నాలుగు క్లస్టర్లు

అంబర్‌పేట సర్కిల్‌ పరిధిలో కొత్తగా నాలుగు చోట్ల కొవిడ్‌-19 నియంత్రిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు. నల్లకుంట బాయమ్మగల్లీ హ్యాపీహోమ్‌, సీఈ కాలనీ, రామకృష్ణనగర్‌ పార్కు, హిమాయత్‌నగర్‌ పరదాగేట్‌ వద్ద ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో ఆ పరిసర ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని సర్కిల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ హేమలత తెలిపారు. 

క్వారంటైన్‌ ఉల్లంఘన.. కేసు నమోదు..

దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ యువకుడు వారం రోజుల కిందట క్వారంటైన్‌ బ్రేక్‌ చేసి యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్‌ షేక్‌ ఫర్హీన్‌ పోలీసులకు సమాచారం అందించారు. క్వారంటైన్‌ బ్రేక్‌ చేసినందుకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి చికిత్స కోసం గాంధీకి తరలించారు.

రాజేంద్రనగర్‌లో కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించిన కింగ్స్‌కాలనీ, వట్టేపల్లి, ఉప్పర్‌పల్లి, హిమ్మద్‌నగర్‌, ఎంఎంపహాడి, నవ్‌ నంబర్‌, ఫోర్ట్‌వ్యూ కాలనీ తదితర ప్రాంతాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, ఆర్డీఓ చంద్రకళ ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇప్పటి వరకు 400వాహనాలు సీజ్‌ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ తెలిపారు.

 • చందానగర్‌సర్కిల్‌-21 పరిధిలో కరోనా (కొవిడ్‌ 19) పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదైన ఆయా ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా ప్రకటించిన ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. నోడల్‌ అధికారిగా జీహెచ్‌ఎంసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ చిన్నారెడ్డి (9989930363) అందుబాటులో ఉండనున్నారు. 
 • మలక్‌పేట, యాకుత్‌పురా జంట సర్కిళ్ల పరిధిలో కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించిన పాత మలక్‌పేట, అక్బర్‌బాగ్‌ ప్రొఫెసర్స్‌ కాలనీ, రైయిన్‌ బజార్ల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 
 • చాంద్రాయణగుట్ట పరిధిలో కంటైన్‌మెంట్‌ హాట్‌స్పాట్‌గా ప్రకటించిన హాఫిజ్‌బాబానగర్‌, బార్కాస్‌కు వచ్చే దారులను మూసివేశారు. నోడల్‌ అధికారి మహ్మద్‌ హాక్‌ (7995064692) అందుబాటులో ఉండనున్నారు. సర్కిల్‌-8 డిప్యూటీ కమిషనర్‌ షేర్లీ పుష్యరాగం హాట్‌స్పాట్‌ ఏరియాలో అవసరమైన వారికి ఇంటింటికీ వెళ్లి నిత్యావసర వస్తువులు అందించేలా కృషి చేస్తున్నారు.
 • మూసాపేట సర్కిల్‌లో మూడు కంటైన్‌మెంట్‌/హాట్‌స్పాట్‌ ప్రాంతాలను గుర్తించారు. కేపీహెచ్‌బీ కాలనీ వసంతనగర్‌, ధర్మారెడ్డి కాలనీ ఫేజ్‌-2, బాలాజీనగర్‌ కాలనీల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. నోడల్‌ ఆఫీసర్‌గా డి.ఆనంద్‌ (9704404870) వ్యవహరించనున్నారు. 
 • కూకట్‌పల్లి సర్కిల్‌లో మూడు హాట్‌స్పాట్లను గుర్తించగా.. బోయిన్‌పల్లి డివిజన్‌లోని హస్మత్‌పేట కాలనీలో రెండుచోట్ల, ఆల్విన్‌కాలనీ డివిజన్‌లోని ఎల్లమ్మబండలో ఒకచోట బారికేడ్లను ఏర్పాటు చేశారు. నోడల్‌ ఆఫీసర్‌గా గోవర్ధన్‌ (9849906741) వ్యవహరించనున్నారని జంట సర్కిళ్ల ఉప కమిషనర్‌ వి.ప్రశాంతి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కేపీహెచ్‌బీ కాలనీ సీఐ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. 
 • యూసుఫ్‌గూడ సర్కిల్‌ పరిధిలోని వెంకటగిరి, కార్మికనగర్‌, బోరబండ సైట్‌-3, రాజీవ్‌నగర్‌ క్లస్టర్లకు టోల్‌ ఫ్రీ నంబర్‌ను త్వరలో ప్రకటిస్తామని డిప్యూటీ కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. 
 • రాంగోపాల్‌పేట డివిజన్‌ నల్లగుట్ట, జీరాలో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆయా కాలనీలను కంటైన్‌మెంట్‌ క్టస్లర్లుగా ప్రకటించగా ఆయా ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేశారు. 
 • గాజులరామారం సర్కిల్‌ పరిధిలోని చంద్రగిరినగర్‌, శ్రీనివాస్‌నగర్‌, రొడామేస్త్రినగర్‌, అపురూపకాలనీ, సుభాష్‌నగర్‌ ప్రాంతాల్లో జోనల్‌ కమిషనర్‌ మమత, ఉప కమిషనర్లు, పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి శుక్రవారం పర్యటించారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లకు నోడల్‌ అధికారులుగా ఉప కమిషనర్లు మంగతాయారు, రవిందర్‌కుమార్‌లను నియమించినట్లు మమత తెలిపారు. 
 • సీతాఫల్‌మండి డివిజన్‌ పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌ బండ మైసమ్మ ఆలయం, బౌద్ధనగర్‌ డివిజన్‌లోని కౌసర్‌ మసీదు, బౌద్ధనగర్‌, నార్త్‌ లాలాగూడ దారులను మూసివేశారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ రవీకుమార్‌ రోజుకు రెండుసార్లు పర్యవేక్షిస్తున్నారు. 
 • తుర్కపల్లిలో ఒకే కుటుంబంలో ఇద్దరికి కొవిడ్‌ 19 వైరస్‌ సోకడంతో ఆ గ్రామాన్ని హాట్‌స్పాట్‌గా గుర్తించింది. తహసీల్దార్‌ ఆర్‌.గోవర్ధన్‌, శామీర్‌పేట పీహెచ్‌ఎస్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ మనుపప్పన్‌ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. 
 • అల్వాల్‌లోని రాజీవ్‌ వీకర్‌ సెక్షన్‌, హస్మత్‌పేట్‌, చంద్రారెడ్డినగర్‌, కనాజీగూడ రోడ్లను మూసివేసి జీహెచ్‌ంఎసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అల్వాల్‌ ఇన్‌స్పెక్టర్‌ పులి యాదగిరి పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
 • ఖైరతాబాద్‌ డీసీ గీతా రాధిక నేతృత్వంలో ఏఈ స్థాయి అధికారులు నోడల్‌ ఆఫీసర్లుగా వ్యవహరిస్తూ ప్రజావసరాలు తీరుస్తున్నారు. 
 • బేగంపేట సర్కిల్‌లో జీహెచ్‌ఎంసీ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సంయుక్తంగా 1550 ఇండ్లను సర్వే చేయిస్తున్నట్టు మెడికల్‌ అధికారి రవీందర్‌గౌడ్‌ తెలిపారు.

కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో చేపడుతున్న చర్యలు

 • పారిశుధ్యం, క్రిమిసంహారక రసాయనాల స్ప్రేయింగ్‌పై ప్రత్యేక దృష్టి. 
 • ప్రతి క్లస్టర్‌లో వైద్య-ఆరోగ్యశాఖ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ బృందాలు క్రమం తప్పకుండా సందర్శిస్తారు.
 • రోజుకు రెండుసార్లు అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
 • కరోనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వారిని ప్రభుత్వ ఐసోలేషన్‌కు తరలిస్తారు.
 • పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ క్లస్టర్ల చుట్టూ పటిష్టంగా బారికేడింగ్‌ ఏర్పాటుచేసి రాకపోకలను నివారిస్తారు.
 • కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో దుకాణాలు, కూరగాయల విక్రయాలు కొనసాగుతాయి.
 • క్లస్టర్‌లో ఉన్నవారిని బయటకు, బయట ఉన్నవారిని క్లస్టర్‌ లోనికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు.
 • సమీపంలోని కొన్ని క్లస్టర్లకు ఒక నోడల్‌ అధికారిని నియమిస్తారు.
 • క్లస్టర్‌లో ఉన్నవారికి ఒక ఫోన్‌ నంబర్‌ ఇస్తారు. ఎవరైనా అత్యవసరమైతే ఆ నంబరును సంప్రదించవచ్చు.
 • పూర్తిగా సమస్యలేదని నిర్ధారించుకున్నాక బారికేడ్లు తొలగిస్తారు

హాట్‌ స్పాట్స్‌ ప్రాంతాలపై.. నిఘా..

నగరంలో హాట్‌ స్పాట్స్‌గా గుర్తించిన ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీని కోసం డ్రోన్‌ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశామని రాచకొండ, హైదరాబాద్‌ సీపీలు మహేశ్‌ భగవత్‌, అంజనీకుమార్‌ తెలిపారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో పర్యటించి బందోబస్తు చర్యలను పరిశీలించారు.


logo