గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 10, 2020 , 23:37:54

పోలీసులు.. ఆరోగ్యంగా ఉండాలి

పోలీసులు.. ఆరోగ్యంగా ఉండాలి

  • నగర సీపీ అంజనీకుమార్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు  ఆరోగ్యవంతులుగా ఉండాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషననర్‌ అంజనీకుమార్‌ సూచించారు. శుక్రవారం రెండు గంటల పాటు వీడియో కన్ఫరెన్స్‌ నిర్వహించి... 4 వేల మంది సిబ్బందితో ప్రత్యక్షంగా, పరోక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల పుట్టిన రోజు వేడుకలు, సంతోష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ మ్యారేజ్‌ డే వేడుకను కూడా కన్ఫరెన్స్‌లో నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా కానిస్టేబుళ్లతో సీసీ వీడియో కన్ఫరెన్స్‌లో మాట్లాడారు. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ప్రతి రోజు అర్ధరాత్రి 12.30 నుంచి ఒంటి గంట వరకు విధి నిర్వహణలో ఉండే కానిస్టేబుళ్లను నేరుగా కలుస్తున్నారు. వారితో నేరుగా మాట్లాడుతూ మనమంతా పోలీసు కుటుంబం, ప్రజల కోసం పనిచేస్తున్నామని వారిలో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు.   

ఇబ్బందులు ఉండొద్దు

హైదరాబాద్‌లో నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. శుక్రవారం నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వ్యాపారులు, వ్యాపార సంఘాలు, సంస్థలతో పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో జాయింట్‌ సీపీలు తరుణ్‌జోషి, అవినాష్‌ మహంతి పాల్గొన్నారు. నిత్యావసరాలు సరఫరా చేసే లారీలను ఎవరు కూడా ఆపరని, అలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే కొవిడ్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలన్నారు. సమావేశంలో కిరాణా, కూరగాయలు తదితర నిత్యావసరాలకు సంబంధించిన వర్తకులు పాల్గొన్నారు. 


logo