సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Apr 10, 2020 , 23:35:59

సలాం హైదరాబాద్‌..

సలాం హైదరాబాద్‌..

  • పేదల కడుపు నింపుతూ దాతృత్వానికి ఆదర్శం
  • వివిధ ప్రాంతాల్లో భారీగా అన్నదానాలు
  • ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీకి తోడుగా ప్రైవేటు సంస్థలు
  • అన్నపూర్ణ కేంద్రాలు, లేబర్‌ క్యాంపులు, షెల్టర్‌ హోమ్‌లు అదనం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ బేగంపేట: ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్‌ నగరం పేదల కడుపు నింపుతూ దాతృత్వానికి ఆదర్శంగా నిలుస్తున్నది. లాక్‌డౌన్‌ కారణంగా పేదల ఆకలి తీర్చేందుకు అనేకమంది దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. వేల సంఖ్యలో పేదలకు రోజూ ఆహారం వండి ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేస్తున్నారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రభుత్వం వేలాది మందికి అన్నపూర్ణ పథకం ద్వారా భోజనం పెట్టడమే కాకుండా ఉచితంగా బియ్యం, నగదు అందిస్తుండగా, పలు స్వచ్ఛంద సంస్థలు, వివిధ సామాజిక సంఘాలు తమ దాతృత్వాన్ని చాటుకోవడం విశేషం. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి పేదలు, వలస కార్మికులకు నగరంలోని దాతలు విరివిగా అన్నదానం చేస్తున్నారు. ఇందులో గుజరాతీ సేవా మండలిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వీరు రెండు వేలమంది పోలీసులు, ఐదువేలమంది పేదలకు రోజూ ఆహార ప్యాకెట్లు అందిస్తున్నారు.  అలాగే, నగర మార్వాడీ సంఘం రోజుకు ఐదు వేలు, లక్డీకాపూల్‌లోని వైశ్య హాస్టల్‌  ఐదు వేలు, వాసవీ సేవా సంఘం  ఐదు వేల చొప్పున రోజూ 22వేల ఆహార పొట్లాలు ఈ నాలుగు సంఘాలే అందిస్తుండడం విశేషం. అలాగే, వివిధ కార్పొరేట్‌ సంస్థలు, ఎన్‌జీఓలు కలిపి మొత్తం 80 సంస్థల ఆధ్వర్యంలో రోజుకు 55వేల ఆహార పొట్లాల పంపిణీ జరుగుతున్నది. దీనికోసం జీహెచ్‌ఎంసీ వారికి అనుమతులు మంజూరుచేసింది.  ప్రభుత్వం ద్వారా ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలో రేషన్‌ కార్డులు లేని 80వేలమంది పేదలకు ఒక్కొక్కరికి 12కిలోల బియ్యంతోపాటు రూ. 1500చొప్పున  పంపిణీచేసిన విషయం విధితమే. ఇది కాకుండా వివిధ పరిశ్రమలు, నిర్మాణ రంగ కంపెనీలు మొత్తం 288 వివిధ సంస్థల ద్వారా వేల సంఖ్యలో ఉన్న తమ ఉద్యోగులు, రోజు కూలీలకు ఉచితంగా భోజనం, ఆహార సామగ్రిని అందిస్తున్నాయి. అలాగే, 185 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా మధ్యాహ్నం 55వేలమందికి, 91 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా సాయంత్రం 35 వేలమందికి ఉచితంగా భోజనం అందిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని 17 షెల్టర్‌ హోమ్‌లు, మరో 90ప్రైవేటు ఎన్‌జీఓల ఆధ్వర్యంలో నడిచే అనాథాశ్రమాల ద్వారా కూడా వందల సంఖ్యలో పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ఇవే కాకుండా ఆయా ప్రాంతాల్లో చాలామంది వ్యక్తిగతంగా కూడా అన్నదానం చేస్తుండడం విశేషం. 

ఆకలితో ఉండరాదన్నదే సీఎం ఆకాంక్ష : మేయర్‌

దాతృత్వానికి హైదరాబాద్‌ నిదర్శనంగా నిలుస్తున్నదని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి రోడ్‌లోని గుజరాతీ సేవా మండలి ఆధ్వర్యంలో నెలకొల్పిన సెంట్రల్‌ కిచెన్‌ను ఆయన సందర్శించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోజుకు ఏడు వేలమందికి ఆహారం అందిస్తున్న గుజరాతీ సమాజాన్ని ఆయన అభినందించారు. రెండు వేలమంది పోలీసులకు, ఐదు వేలమంది పేదలకు ఈ గుజరాతీ సమాజ్‌ అన్నదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆకలితో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడరాదని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించి నిరుపేదలు, వలస కూలీలతోపాటు కరోనా వైరస్‌ నియంత్రణకు శ్రమిస్తున్న క్షేత్రస్థాయి పోలీసులు, ఇతర సిబ్బందికి ఆహార ప్యాకెట్లను అందిస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా మేయర్‌ వృద్ధులు, నిరాశ్రయులకు ఆహార ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర గుప్తా, గుజరాతీ సమాజ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఘన్‌శ్యామ్‌ దాస్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

8 వేల మందికి ఆహారం

  • గోభారతి ఫౌండేషన్‌, శ్రీ అన్నపూర్ణ క్యాటరర్స్‌ దాతృత్వం

అంబర్‌పేట, నమస్తే తెలంగాణ:  లాక్‌డౌన్‌ నేపథ్యంలో నల్లకుంటకు చెందిన గోభారతి ఫౌండేషన్‌, శ్రీఅన్నపూర్ణ క్యాటరర్స్‌  ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఆహార పంపిణీ ప్రారంభించారు. మొదటి రోజు వెయ్యి మందికి ఆహారాన్ని అందించారు. తర్వాత ఆ సంఖ్య పెరుగుతూ పది రోజుల్లో 8 వేలకు పెరిగింది. ప్రసుత్తం రోజు 8 వేల ఆహారపు పొట్లాలను తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. సైబరాబాద్‌ పోలీసుల ద్వారా రోజు 5వేల ప్యాకెట్లు, అంబర్‌పేట, నల్లకుంట, ఓయూ, కాచిగూడ పోలీస్‌స్టేషన్ల ద్వారా మూడు వేల ప్యాకెట్లను పేదలు నివాసముండే బస్తీల్లో  పంపిణీ చేస్తున్నారు. ఆహారం వండటం, వాటిని ప్యాకింగ్‌ చేయడానికి ఇక్కడ 25 మంది వలంటీర్లు పని చేస్తున్నారు. లాక్‌ డౌన్‌ ఉన్నంత కాలం  గోభారతి ఫౌండేషన్‌ డైరెక్టర్‌ శంకరమఠ్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

స్వర్ణభారత్‌ ట్రస్టు అన్నదానం

శంషాబాద్‌: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపుమేరకు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ అన్నదానం గత 15 రోజులుగా కొనసాగిస్తున్నది.  శుక్రవారం శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ పరిధిలోని స్వర్ణ భారత్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రశీదుగూడ పంచాయతీలో వలస కూలీలకు భోజన ప్యాకెట్లు తహసీల్దార్‌ జనార్దనరావు పంపిణీ చేశారు. నిత్యం 250 మందికి మధ్యాహ్న భోజనాలను అందజేస్తున్నారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు కొనసాగిస్తామని మేనేజింగ్‌ ట్రస్టీ దీపావెంకట్‌నాయుడు  తెలిపారు.


logo