మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 09, 2020 , 23:43:12

అష్ట దిగ్బంధనం

అష్ట దిగ్బంధనం

  • లోనికి వెళ్లొద్దు.. బయటకు రావద్దు.. ఎక్కడివారు అక్కడే..
  • ప్రతి ఒక్కరికీ రోజుకు రెండుసార్లు వైద్యపరీక్షలు  
  • వారంలోగా పూర్తిగా కట్టడి చేసే వ్యూహం
  • నగర వ్యాప్తంగా 12 కంటైన్‌మెంటు క్లస్టర్లు.. శుక్రవారం మరిన్ని పెరిగే అవకాశం

మహానగరాన్ని కరోనా వైరస్‌ వణికిస్తున్నది. దాన్ని అణచివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు చేపట్టింది. నానాటికీ పెరుగుతున్న కేసులను నియంత్రించేందుకు కంటైన్‌మెంట్‌ ప్రాంతాలపై ఫోకస్‌ పెట్టింది. ‘వైరస్‌ వ్యాప్తి’ని అడ్డుకునేందుకు జన సమూహాన్ని నిరోధించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నది. పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను దిగ్బంధనం చేస్తున్నది. ఆ ఏరియాలోని జనం ఇంటి వద్దనే ఉండేందుకు ఉన్న అన్ని రహదార్లను మూసేస్తున్నది. అవసరమైన అన్ని నిత్యావసర వస్తువులు పొరుగునే లభిస్తున్నప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లే వారిని కట్టడి చేస్తున్నది. అందుకే గురువారం నగరంలోని కంటైన్‌మెంట్‌ ప్రాంతాలను బారికేడ్లు, ఇనుప కంచెలతో మూసేశారు. జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు ప్రతి కరోనా నియంత్రణ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు జీహెచ్‌ఎంసీ, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ఆయా కేంద్రాలను పరిశీలించింది. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనాను కట్టడి చేసేందుకు కంటైన్‌మెంట్‌ ఏరియాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాలు, వచ్చేందుకు అవకాశాలున్న 12 ప్రాంతాలను గుర్తించి అష్టదిగ్బందనం చేశారు. చుట్టూ బారికేడ్లు ఏర్పాటుచేసి లోపలి వారు బయటకు, బయటివారు లోపలికి రాకుండా నియంత్రిస్తున్నారు. ఆ ప్రాంతంలోని వారికి రోజుకు రెండు దఫాలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే వారం రోజుల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కంటైన్‌మెంటు క్లస్టర్లు మరిన్ని పెరిగే అవకాశముందని, శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష అనంతరం కొత్త కంటైన్‌మెంటు క్లస్టర్ల వివరాలు వెల్లడిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు వివరించారు. ఆరోగ్య సిబ్బంది నిరంతరం ఆ ప్రాంతంలోనివారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో కంటైన్‌మెంట్‌కు ఒక నోడల్‌ అధికారిని నియమించి అక్కడి వారికి ఒక కంటాక్ట్‌ నంబర్‌ ఇవ్వాలని నిర్ణయించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు కూడా అక్కడికే పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  దీంతో ఒక ప్రాంతంలో వైరస్‌ ఉందంటే, ఆ వైరస్‌ను అక్కడే కట్టడి చేసేందుకు అవకాశముంటుంది.

కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలో...

కూకట్‌పల్లి : కూకట్‌పల్లి, మూసాపేట్‌ జంట సర్కిళ్ల పరిధిలో కొవిడ్‌-19 కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. ఆయా కాలనీలకు అనుసంధానంగా ఉన్న ప్రధాన, అంతర్గత రోడ్లను బారికేడ్‌లతో మూసివేశారు. కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధి ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్‌లో అంజయ్యనగర్‌, హస్మత్‌పేట్‌, గౌరినగర్‌, ఆర్‌ఆర్‌నగర్‌ కాలనీలు, బాలానగర్‌ డివిజన్‌ పరిధిలో రాజీవ్‌గాంధీనగర్‌, రాజుకాలనీ, ఫిరోజ్‌గూడ, బాలానగర్‌, కూకట్‌పల్లి డివిజన్‌ పరిధిలో కూకట్‌పల్లి, సాయిబాబా కాలనీలు క్లస్టర్‌ పరిధిలో ఉన్నాయి. 

మూసాపేట్‌ సర్కిల్‌ పరిధిలో...

మూసాపేట్‌ సర్కిల్‌ పరిధిలోని కేపీహెచ్‌బీ డివిజన్‌లో ఎస్‌ఎస్‌ కాలనీ, వసంత్‌నగర్‌ కాలనీ, సీబీసీఐడీ కాలనీ, మెడో ల్యాండ్స్‌, బాలాజీనగర్‌ డివిజన్‌లో బాలాజీనగర్‌, వివేక్‌నగర్‌, కేపీహెచ్‌బీకాలనీ రోడ్డు నంబరు ఒకటి, అల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలో పద్మావతినగర్‌, అల్లాపూర్‌, సఫ్దర్‌నగర్‌, రాజీవ్‌గాంధీనగర్‌ కాలనీ, మూసాపేట్‌ డివిజన్‌ పరిధిలో జనతానగర్‌, మూసాపేట్‌ కాలనీలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా గుర్తించారు.

యూసుఫ్‌గూడ సర్కిల్‌లో...

 బల్దియా 19వ సర్కిల్‌ (యూసుఫ్‌గూడ) పరిధిలో కరోనా వైరస్‌ ప్రభావిత క్లస్టర్‌గా బుధవారం ఒక్క వెంకటగిరిని మాత్రమే గుర్తించారు. గురువారం తాజాగా మరో 3 క్లస్టర్లను గుర్తించి అక్కడ చేపట్టాల్సిన చర్యల గురించి బల్దియా అధికారులు సమాలోచన చేశారు. బోరబండ డివిజన్‌ సైట్‌-3లోని జయశంకర్‌ కమ్యూనిటీహాల్‌ పరిసరాల్లో ఒకటి, ఎర్రగడ్డ డివిజన్‌ జయంతినగర్‌లో రెండు క్లస్టర్లు శుక్రవారం నుంచి అమలుకానున్నాయి. ఆయా క్లస్టర్ల ఏరియాలో బారికేడ్ల ఏర్పాటు, రాకపోకల నియంత్రణ ఎంత దూరం వరకు అమలుపర్చాలన్న అంశాన్ని శుక్రవారం ప్రకటిస్తామని బల్దియా డిప్యూటీ కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. సర్కిల్‌ పరిధిలోని ఈ నాలుగు క్లస్టర్ల పరిధిలో పోలీస్‌ల పటిష్ట బందోబస్తు ఉంటుందని ఆయన వెల్లడించారు.

సనత్‌నగర్‌లో...

సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని రాంగోపాల్‌పేట డివిజన్‌ నల్లగుట్ట ప్రాంతంలో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జీహెచ్‌ఎంసీ, వైద్య అరోగ్య శాఖ, పోలీసులు నల్లగుట్ట ప్రాంతంలో చుట్టు రెండు కిలోమీటర్ల పరిధిని కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా ప్రకటించారు. 

అల్వాల్‌ సర్కిల్‌లో

మల్కాజిగిరి : అల్వాల్‌ సర్కిల్‌లో కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను ప్రకటించారు. అల్వాల్‌లోని హస్మత్‌పేట్‌, రాజీవ్‌ వీకర్‌సెక్షన్‌, కనాజిగూడ, చంద్రారెడ్డి కాలనీ రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. కిలోమీటర్లమేరకు వాహనాలను అనుమతించడం లేదు. కనాజిగూడ, చంద్రారెడ్డినగర్‌ క్లస్టర్లు జోన్‌ పరిధిలోకి వస్తాయని క్రైం అడిషనల్‌ డీసీపీ ఇందిరా, అల్వాల్‌ ఇన్‌స్పెక్టర్‌ పులియాదగిరి పేర్కొన్నారు. 

కుత్బుల్లాపూర్‌లో నాలుగుచోట్ల..

దుండిగల్‌ : నగరశివారు కుత్బుల్లాపూర్‌, గాజులరామారం సర్కిళ్ల పరిధిలోని పలుప్రాంతాలను పోలీసులు, అధికారులు అష్టదిగ్బంధనం చేశారు. ఆయాప్రాంతాలల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో సదరు కాలనీలను కొవిడ్‌-19 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా అధికారులు ప్రకటించారు. చుట్టుపక్కల అర కిలోమీటర్‌మేర బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. ప్రధానంగా కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ సుభాష్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని అపురూప కాలనీ, సుభాష్‌నగర్‌లలో కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలను మూసివేశారు. గాజులరామారం డివిజన్‌లోని చంద్రగిరినగర్‌ను కోవిడ్‌-19 కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా ప్రకటించారు. దీంతో చంద్రగిరి నగర్‌ సమీపంలోని రోడామిస్త్రీ నగర్‌, సుభాష్‌చంద్రబోస్‌ నగర్‌, శ్రీనివాసకాలనీ, జాహంగీర్‌బస్తీ నుంచి చంద్రగిరినగర్‌కు రాకపోకలు కొనసాగించకుండా చుట్టూ కిలోమీటర్‌ దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.

నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి, ప్రగతినగర్‌లోని శిల్పా లే అవుట్‌ సైతం కొవిడ్‌-19 కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా ప్రకటించారు. దీంతో కాలనీ చుట్టూ కిలోమీటర్‌ దూరం వరకు బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు.

రెండు సర్కిళ్ల పరిధిలో క్లస్టర్లు

సైదాబాద్‌/ మాదన్నపేట : మలక్‌పేట, యాకుత్‌పురా సర్కిళ్ల పరిధిలో కొవిడ్‌-19 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మలక్‌పేట సర్కిల్‌ అక్బర్‌ బాగ్‌ డివిజన్‌లోని ప్రొఫెసర్స్‌కాలనీ, సంతోష్‌నగర్‌ పరిధిలోని సంతోష్‌నగర్‌ను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు. పై రెండు ప్రాంతాల్లో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా క్లస్టర్‌ పరిధిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని సంతోష్‌నగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ అలివేలు మంగతాయారు తెలిపారు. ఐఎస్‌ సదన్‌ చౌరస్తానుంచి సంతోష్‌నగర్‌ వరకు 1 కిలోమీటర్‌ పరిధి, సంతోష్‌నగర్‌ నుంచి హఫీజ్‌బాబానగర్‌ మీదుగా ఐఎస్‌ సదన్‌ చౌరస్తా, ఈదీ బజార్‌ వరకు 2 కిలో మీటర్ల పరిధి, అక్కడి నుంచి సంతోష్‌నగర్‌ ప్రధాన రహదారి వరకు 2 కిలో మీటర్ల వరకు ఉన్న రోడ్లను మూసివేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు.

మలక్‌పేట సర్కిల్‌ పరిధిలో...

మలక్‌పేట సర్కిల్‌ పరిధిలోని ప్రొఫెసర్స్‌ కాలనీలో గతనెలలో ఢిల్లీ వెళ్లివచ్చిన తండ్రీ కొడుకులకు పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చిన విషయం విధితమే. దీంతో ప్రొఫెసర్‌ కాలనీతో పాటు ముంతాజ్‌ కాలేజ్‌ నుంచి సైదాబాద్‌ సపోటాబాగ్‌ వరకు 2 కిలో మీటర్లు, మలక్‌పేట సూపర్‌బజార్‌ చౌరస్తా నుంచి డీమార్ట్‌ చౌరస్తా వరకు, అక్కడి నుంచి అక్బర్‌బాగ్‌ చౌరస్తా వరకు కిలోమీటర్‌, అక్బర్‌బాగ్‌ చౌరస్తా నుంచి మలక్‌పేట జూనియర్‌ కాలేజ్‌ చౌరస్తా వరకు క్లస్టర్లుగా విభజించి రోడ్లపై వాహనాలు తిరుగకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. 

చాంద్రాయణగుట్ట పరిధిలో...

చాంద్రాయణగుట్ట : చాంద్రాయణగుట్ట పరిధిలో కొవిడ్‌-19 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను ఏర్పాటు చేశారు.  హాఫీజ్‌ బాబానగర్‌, బార్కాస్‌ ప్రాంతాలను  కంటైన్‌మెంట్‌ పరిధిలోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయా ప్రాంతాలకు వచ్చే ప్రధాన, అంతర్గత రోడ్లనను బారికేడ్లతో మూసివేసి బందోబస్తును ఏర్పాటు చేశారు. బస్తీల చుట్టూ కిలో మీటర్‌ పరిధిలో ప్రవేశం లేదని బోర్డులను ఏర్పాటు చేసి పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

చందానగర్‌ సర్కిల్‌లో..

చందానగర్‌ : చందానగర్‌ సర్కిల్‌ పరిధిలో కొత్తగా కొవిడ్‌- 19 కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. మియాపూర్‌-హఫీజ్‌పేట్‌ రహదారి పరిధిలో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు ఉపకమిషనర్‌ సుదాంశ్‌ నందగిరి తెలిపారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయాల్సిన నేపథ్యంలో ఈ క్లస్టర్ల పరిధిలో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్టు వారు తెలిపారు. కాగా మియాపూర్‌ నుంచి న్యూ హఫీజ్‌పేట్‌ వరకు 2.3 చదరపు కిలోమీటర్ల పరిధి క్లస్టర్‌గా గుర్తించామన్నారు. మియాపూర్‌ జాతీయ రహదారిపై ఉన్న రాజారాం కాలనీ నుంచి ఆల్విన్‌ చౌరస్తా మీదుగా హఫీజ్‌పేట్‌ ఫ్లై ఓవర్‌కు ఎడమవైపు ఉన్న, సాయినగర్‌, యూత్‌ కాలనీ, అదేవిధంగా సర్వే నంబర్‌ 80లోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆదిత్యనగర్‌, సుభాష్‌ చంద్రబోస్‌నగర్‌, ప్రేమ్‌నగర్‌, మార్తాండ నగర్‌లు క్లస్టర్‌ పరిధిలోకి వస్తాయని తెలిపారు. క్లస్టర్‌లోని ఈ ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న ప్రధాన, అంతర్గతంగా ఉన్న మొత్తం 54 రహదారులను మూసి వేస్తున్నామని తెలిపారు. అయితే అత్యవసర వస్తువుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. మొబైల్‌ రైతుబజార్ల కోసం మొత్తం క్లస్టర్‌లో 4 ద్వారాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

రెడ్‌హిల్స్‌, షేక్‌పేట్‌ డివిజన్‌లలో... 

షేక్‌పేట డివిజన్‌ పరిధిలోని పలు కాలనీలను పోలీసులు, అధికారులు దిగ్బంధం చేశారు. ఆయా ప్రాంతాల్లో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఆయా కాలనీలను కొవిడ్‌-19 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు. ముఖ్యంగా టోలిచౌకి గెలాక్సీ థియేటర్‌ పక్కన ఉన్న ఆడమ్స్‌ కాలనీ, అజీజ్‌బాగ్‌, బృందావన్‌ కాలనీ, ఆదిత్యానగర్‌ కాలనీలను కంటైన్‌మెంట్‌ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నాంపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి రెడ్‌హిల్స్‌ను కరోనా హాట్‌స్పాట్‌గా అధికారులు గుర్తించారు. ఈ మేరకు రెడ్‌హిల్స్‌ లక్ష్మీనగర్‌లోని ఆరు వీధులను దిగ్బంధం చేశారు. కాలనీలకు రాకపోకలు సాగించేదారులను మూసివేసినట్లు తెలిపారు. 

ఏర్పాట్లు ఇలా ఉన్నాయి..!

  • కంటైన్‌మెంట్‌ ఏరియాలో అన్ని రహదారులు దిగ్బంధనం చేస్తారు. ఆ ఏరియాకు ఒకటే ప్రవేశ ద్వారం.. బయటకు వెళ్లేందుకు ఒకటే మార్గం ఉంటుంది.
  • ఆ ప్రాంతంలోని ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తారు. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ  ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడంలో ముందుంటారు.
  • వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఎక్కడికక్కడే బారికేడ్లు వేస్తారు. రోడ్లు భవనాల శాఖతో సమన్వయం చేసుకుంటూ ఈ ఏర్పాట్లు చేస్తారు.
  • ఒక కంటైన్‌మెంట్‌ ఏరియాకు ఒక ఏసీపీ స్థాయి అధికారిని బందోబస్తు పర్యవేక్షణాధికారిగా నియమించారు.
  • ఆయా ప్రాంతాలపై వీడియోలతో నిఘాను ఏర్పాటు చేస్తారు.

మీ భద్రత కోసమే.. ఇదంతా 

లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నాం. ప్రజలెవరూ బయటకు రావద్దు. కరోనాను పూర్తిస్థాయిలో కట్టడి చేసి, అది ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కంటైన్‌మెంట్‌ ఏరియాలను ప్రకటిస్తున్నాం. ఇందులో భాగంగా ఆయా ఏరియాలో పోలీసు శాఖ తరపున అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం. వీడియోలతో నిఘా పెట్టడంతో పాటు ఒక కంటైన్‌మెంట్‌ ఏరియాకు ఒక ఏసీపీ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమిస్తున్నాం. మీ భద్రత కోసమే మేమున్నాం. ప్రస్తుతానికి 12 కంటైన్‌మెంట్‌ ప్రాంతాలున్నాయి, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నది.

-అంజనీకుమార్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌


logo