శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 09, 2020 , 23:37:55

వైద్యులకు వందనం..

వైద్యులకు వందనం..

  • ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు చికిత్స
  • మనో ధైర్యంతో సేవలందిస్తున్న గాంధీ,  ఛాతీ దవాఖాన డాక్టర్లు
  • గాంధీ హాస్పిటల్‌లో 143 మందికి చికిత్స 
  • పూర్తిగా కోలుకున్న 19 మంది డిశ్చార్జ్‌
  • కొవిడ్‌-19 కోరలు చాస్తున్న వేళ.. వైద్యులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. 

రక్షణ చర్యలు పాటిస్తూ, కుటుంబాలకు దూరంగా ఉంటూ  సేవలందిస్తున్నారు. నగరంలోని గాంధీ, ఛాతీ దవాఖాన వైద్యులు కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తూ వారి ప్రాణాలు కాపాడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వైద్యుడు దేవుడితో సమానం.. కానీ కరోనా మహమ్మారిలా దూసుకొస్తున్న వేళ వైద్యులు ప్రత్యక్ష దైవంగా మారారు.  కరోనా (కొవిడ్‌-19) బాధితులకు ప్రాణాలకు తెగించి సేవలందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు గాంధీ, ఎర్రగడ్డ ఛాతీ  దవాఖాన వైద్యులు.  ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 308 మంది కొవిడ్‌-19 బాధితులకు చికిత్స అందించగా అందులో కేవలం గాంధీ దవాఖానలోనే 143 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 19 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. 

పూర్తిస్థాయి కరోనా దవాఖానగా గాంధీ..

సాధారణంగా ప్రతి రోజూ 2000 నుంచి 3000 మంది ఓపీ, సుమారు 1500 మంది ఐపీ రోగులతో రద్దీగా ఉండే గాంధీ దవాఖాన ప్రస్తుతం కొవిడ్‌ హాస్పిటల్‌గా మారింది. తొలుత  గాంధీ దవాఖాననే కొవిడ్‌ పాజిటివ్‌ కేసులకు చికిత్స అందించేందుకు ఎంపిక చేశారు. అంతే కాకుండా 8 మంది వైద్యబృందంతో దవాఖానలోని వైరాలజీ విభాగంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్‌ను కూడా తెలుగు రాష్ర్టాలకు కలిపి ఇక్కడే ఏర్పాటు చేశారు. రోజుకు 100కు పైగా నిర్ధారణ పరీక్షలు గాంధీలో జరుపుతున్నారు. అనంతరం ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో పాజిటివ్‌ కేసులకు చికిత్స ప్రారంభించారు. దీంతో పాటు కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలను సైతం ఉస్మానియా మెడికల్‌ కళాశాల, సీసీఎంబీలో ప్రారంభించారు. ఏప్రిల్‌ 6 వరకు గాంధీలో 143 మంది కొవిడ్‌ పాజిటివ్‌ కేసులకు చికిత్స అందించగా, వీరిలో 19మంది పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్‌ చేశారు. ఇక ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో ఇప్పటి వరకు మొత్తం 37 పాజిటివ్‌ కేసులకు చికిత్స అందించగా 13 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 

1226 మందితో సేవలు

గాంధీ దవాఖానలో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులకు వైద్యులతో సహా మొత్తం 1226 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో 155 మంది వైద్యులతో పాటు మరో 100 మంది ఇతర సిబ్బంది ఉన్నారు.

ఐదురోజుల పాటు.. 

గాంధీ దవాఖానలోని  ప్రతి వైద్యుడికి విధులు నిర్వర్తించిన రోజు తర్వాత 5 రోజుల పాటు సెలవు ఇస్తున్నట్లు సూపరింటెండెంట్‌  డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. ప్రతిసారి ఐదురోజుల పాటు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ కుటుంబాలకు దూరంగా ఉండి సేవలందిస్తున్నారు. ప్రతి రోజూ వైరస్‌ ఉన్న రోగికి చికిత్స అందిస్తే వైద్యుడి ప్రాణాలకే ప్రమాదమని ఆయన పేర్కొన్నారు.

దేవుళ్లు అంటున్నారు..

  • ప్రజల ప్రశంసలు మరింత ధైర్యం పెంచాయి
  • గాంధీ దవాఖాన పారా మెడికల్‌ ఉద్యోగులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ‘మమ్మల్ని ఇప్పుడందరూ దేవుళ్లు అంటున్నారు. మానవ సేవే.. మాధవ సేవగా భావిస్తున్నాం. ఉద్యోగంలోనే సేవ చేసే భాగ్యం పొందడం అదృష్టం. పనిలోనే ఆనందం ఉన్నది. మా సేవలకు మా బంధువులు, స్నేహితులు, పొరుగింటి వాళ్లు మరింతగా గౌరవిస్తున్నారు.’ కరోనా బాధితులకు సేవలందిస్తున్న గాంధీ దవాఖాన పారా మెడికల్‌ సిబ్బంది మాటలివి. కొవిడ్‌-19తో ప్రమాదమని తెలిసినా రోగుల మధ్యనే ఉంటూ వారికి సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజలందరితో ప్రశంసలందుకుంటున్నారు. ప్రాణాలు సహితం లెక్క చేయకుండా రక్త పరీక్షలు, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కుటుంబాలకు దూరంగా..

కొవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది అంతా కుటుంబాలకు దూరంగా ఉండక తప్పని పరిస్థితి. డాక్టర్‌ ఎప్పుడూ వైరస్‌ ఎక్స్‌పొజిషన్‌లో ఉండకూడదు. నర్సింగ్‌ సిబ్బందిది కూడా  ఇదే పరిస్థితి. అదృష్టవశాత్తు గాంధీ దవాఖాన వైద్యులు ఎవరూ అనారోగ్యం బారిన పడలేదు. 

-డా.శ్రవణ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌, గాంధీ దవాఖాన

రోగుల ప్రాణాలే ముఖ్యం..

ఇలాంటి క్లిష్ట సమయంలో సేవలందించడం చాలా ముఖ్యం. కరోనా నేపథ్యంలో పని ఒత్తిడి  ఉన్నప్పటికీ మాకు రోగుల ప్రాణాలే ముఖ్యం. రోగి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయితే అందరికంటే ఎక్కువగా ఆనందించేది మేమే. 

     -మంగమ్మ, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ గాంధీ దవాఖాన

ఇండోనేషియా వాళ్లకు.. 

ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి నేనే టెస్టులు చేశా. వాళ్లకు పాజిటివ్‌ వచ్చింది. ఫస్ట్‌ కేసు నేనే చేసిన. గుండెకు సంబంధించిన పనితీరు తెలుసుకోవడం కోసం ఈసీజీ కీలకం. ఒక్కో రోగి దగ్గర 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది.

-కుమారస్వామి, ఈసీజీ టెక్నీషియన్‌

రోగులకు దూరంగా ఉండలేం..

కరోనా బాధితులకు ఎక్స్‌ రే అనివార్యం. మేం పీపీఈ కిట్‌ ధరిస్తున్నాం. మా యంత్రాన్ని కూడా కవర్‌ చేస్తున్నాం. కానీ రోగితో దూరం పాటించడం సాధ్యం కాదు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పిల్లలకు దూరంగా ఉంటున్నాం. చుట్టాలింటికి వెళ్లడం లేదు. ఐతే ఇప్పుడు మమ్మల్ని అందరూ దేవుళ్లు అంటున్నారు. పాదాభివందనం చేస్తున్నారు. పీపీఈ కిట్లకు కొరత లేదు. 

-కె. పుల్లయ్య, రేడియాలజిస్ట్‌

39 మందికి పరీక్షలు చేశా..

మూడేండ్ల చిన్నారికి పాజిటివ్‌ వచ్చింది. పరీక్షలు చేసేటప్పుడు గట్టిగా తుమ్మింది. అప్పుడు నా మాస్క్‌ ఊడిపోయింది. భయంతో  వెంటనే ముఖాన్ని శానిటైజర్‌తో కడిగేసుకున్న.  మాకిచ్చే సేఫ్టీ బాక్సులను కూడా శానిటైజ్‌ చేస్తున్నాం. ఇప్పటి వరకు 39 మంది పాజిటివ్‌ వ్యక్తులకు పరీక్షలు చేసిన. రక్తం, ఇతర నమూనాలను సేకరించి వాటిని సీల్‌ చేస్తాం. 

 -కె. బాలనాగరాజు, సీనియర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌

100 మందికి పరీక్షలు చేశా..

 డాక్టర్లు ఇచ్చిన జాబితా ప్రకారం ప్రతి రోగికీ టెస్టులు చేస్తుంటాం. వారు పడుకుంటే నిద్రలేపి శాంపిళ్లు తీసుకుంటాం. ఇప్పటి వరకు 100 మందికి పరీక్షలు చేసిన. వ్యక్తిగతంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. మా కుటుంబ సభ్యులంతా ప్రోత్సహిస్తున్నారు. మీరు బాగా పని చేస్తున్నారంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు.

- సిరిగాని రఘు, ల్యాబ్‌ టెక్నీషియన్‌logo