శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 08, 2020 , 23:43:44

కనురెప్ప వాల్చకుండా..

కనురెప్ప వాల్చకుండా..

  • ప్రజలందరి శ్రేయస్సు కోసం 
  • లాక్‌డౌన్‌ వేళ.. అనుక్షణం పోలీసుల సేవలు 
  • బంధాలు బంధుత్వాలకు దూరం... ప్రజల రక్షణే ధ్యేయం 
  • సేవలకు జేజేలు పలుకుతున్న భాగ్యనగరం 

ప్రాణాంతకమైన వైరస్‌ ఓ వైపు. ప్రజలందరి కోసం పోలీసులు మరోవైపు. కరోనా వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్‌ను పటిష్టంగా చేయగలిగితేనే మనం పోరాడి గెలవగలిగినట్టు. వైద్యుల తర్వాత అత్యంత కీలకమైన ఆ బాధ్యతను తీసుకొని యావత్‌ నగర ప్రజలందరికీ మేమున్నామంటూ భరోసానిస్తున్నారు నగర పోలీసులు. ‘మీరు ఇంట్లో ఉండండి. మీ కోసం మేము బయట ఉంటాం’..అని పదే పదే చెబుతున్నారు. వేల సంఖ్యలో ఒక్కసారిగా జనం బయటికి రాకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూనే అలా వచ్చిన వారికి నచ్చజెప్పి వెనక్కి పంపడం కూడా సులువైన విషయమేమీ కాదు. కంటికి కనిపించకుండా వైరస్‌ విస్తరిస్తున్న వేళ ఇంటా బయటా విధుల కోసం తిరగాల్సిరావడంతో ఒకింత ఆందోళన నెలకొన్నప్పటికీ ప్రజల రక్షణే పరమావధిగా సమాజ శ్రేయస్సే ఊపిరిగా పనిచేస్తున్నారు. వేళకు భోజనం చేయలేక... కంటి మీద కునుకులేని పరిస్థితులు నెలకొన్న అవస్థలో  కొంచెం తీరిక దొరికితే.. ఎక్కడో అక్కడ కడుపు నింపుకోవడం మళ్లీ విధుల్లో నిమగ్నమవ్వడం నిత్యకృత్యమైంది.  అంతేనా.. విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే అభ్యాగుల ఆకలి తీర్చి... దాతృత్యాన్ని చాటుకుంటున్నారు. కుటుంబం కన్నా... విధులు.. సేవలకే ప్రాముఖ్యత ఇస్తూ.. మహమ్మారి నిర్మూలనలో తమ వంతు పోరాటం చేస్తున్న ఈ యోధులకు జేజేలు పలుకుతున్నది యావత్‌ భాగ్యనగరం. 

అది మా కర్తవ్యం 

పోలీసు ఉద్యోగాల్లో చేరామంటనే అన్నింటికీ తెగించి ప్రజల రక్షణ కోసం పనిచేయాలి. అది మా కర్తవ్యం. ఉన్నతాధికారుల ఆదేశాలతో తగిన వ్యక్తిగతమైన రక్షణ చర్యలు తీసుకుంటూ విధులు నిర్వహిస్తున్నాం. అయితే మా కుటుంబ సభ్యుల రక్షణ కూడా మాకు  ముఖ్యం. ప్రతి రోజూ బయట విధి నిర్వహణలో ఉండే మాకు అనుకోని విధంగా ఎదైనా వైరస్‌ సోకితే ఎలా.? మా  కుటుంబ సభ్యుల పరిస్థితి ఎట్లా అని ఆలోచిస్తుంటాం. అందుకే ఇంటికి వెళ్లిన తరువాత భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాం.

-బ్రహ్మం, కానిస్టేబుల్‌, నారాయణగూడ

అనవసరంగా రోడ్డుపైకి..

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉన్నా.. కొందరు రోడ్లపైకి అనవసరంగా వస్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఆ సమయంలో అనుకోని విధంగా తమకు వైరస్‌ సోకితే ఎలా అనే ఒక ఆందోళన ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఇండ్లలో ఉంటే అందరికీ అది సురక్షితమని భావిస్తాం. మీము మా కుటుంబ సభ్యులకు దూరంగానే ఉంటున్నాం. ఇంటికి వెళ్తే భయం.. భయంగానే ఉండాల్సిన పరిస్థితి . వైరస్‌ సోకకుండా మాస్కులు, శానిటైజర్స్‌ వాడుతున్నాం. అయినా కూడా కొంత భయం ఉంది.

-గయాసుద్దీన్‌, కానిస్టేబుల్‌, చిక్కడపల్లి

భార్యపిల్లల్ని ఊరికి పంపాను...

కరోనా వైరస్‌ భార్యాపిల్లలకు వస్తుందేమోనని భయపడి ఊరికి పంపించా. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించగానే... రోజూ వివిధ ప్రాంతాల్లో డ్యూటీ చేస్తూ వివిధ రకాల వ్యక్తులను కలుస్తున్నాను. ఇంటికి వెళ్లగానే స్నానం చేసి దుస్తులు ఉతికిన తర్వాత కూడా ఇంట్లో ఉన్నంతసేపు భార్యాపిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తున్నది. వారికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని ముందుగానే వారిని  అత్తగారింటికి పంపాను. రోజూ విధులు నిర్వహిస్తున్నప్పుడు కరోనా వైరస్‌ అంటుకుంటుందేమోనని జాగ్రత్తలు తీసుకుంటున్నా. 

- జి. శ్రీనివాసులు, కానిస్టేబుల్‌, కేపీహెచ్‌బీ కాలనీ

అత్యవసర పరిస్థితిలో ..

ఉత్తర మండల పోలీస్‌ పరిధిలో స్థానికులు పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. పై అధికారులు కూడా కిందిస్థాయి సిబ్బందికి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు. ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా మూడు షిఫ్ట్‌ల్లో విధులు చేయాలని సూచించారు. 8 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నాం. లాక్‌డౌన్‌ సమయంలో ఇప్పటి వరకు తనిఖీలు చేసిన వారంతా అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వచ్చిన వారు కనిపించారు. మా డ్యూటీని మేం సక్రమంగా నిర్వహిస్తున్నాం. 

- నాగార్జున కుమార్‌, కానిస్టేబుల్‌ 


logo