బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 08, 2020 , 23:38:24

వైద్యులూ జాగ్రత్తలు తీసుకోండి

వైద్యులూ జాగ్రత్తలు తీసుకోండి

  • మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలను కాపాడగలం
  • కరోనా బాధితుల చికిత్సలో 
  • అప్రమత్తంగా ఉండాలి
  • డాక్టర్లు స్వీయ ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
  • గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ‘వైద్యో నారాయణ హరి’ అన్నారు పెద్దలు.. మరి అలాంటి దేవుడి ఆరోగ్యమే సంకటంలో పడితే జరిగే పరిణామాలను ఊహించగలమా? వైద్యులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రోగుల ప్రాణాలను కాపాడగలుగుతారు.  ‘వైద్య వృత్తి అంటేనే కత్తిమీద సామువంటిది. క్లిష్టమైన పరిస్థితుల్లో వృత్తిపరంగా పలురకాల ఒత్తిళ్లు, ఆందోళనలు సహజం. మనం ఆరోగ్యంగా ఉంటేనే రోగుల ప్రాణాలను రక్షించగలుగుతాం. డాక్టర్‌ తన కోసం కాదు ప్రజల కోసం బతకాలి’ అని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ అన్నారు. వైద్యులు తమ ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.

పర్సనల్‌ ప్రొటెక్షన్‌ లేకుండా వార్డులోకి వెళ్లొద్దు

ప్రస్తుతం గాంధీ దవాఖానలో 350 మంది వైద్యులు కొవిడ్‌ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రత్యేక ఐసీయూ, పర్యవేక్షణ వార్డులో బాధితులకు, అనుమానితులకు వైద్యం అందిస్తున్నాం. డాక్టర్లందరికీ పీపీసీ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ కిట్స్‌)తోపాటు ఎన్‌- 19 మాస్కులు, గ్లౌస్‌లు తదితర రక్షణ కవచాలను ప్రభుత్వం సమకూర్చింది. ఇవి ధరించకుండా ఏ ఒక్క డాక్టర్‌ కూడా కరోనా వార్డుల్లోకి ప్రవేశించకూడదు. 

గ్లౌస్‌ ధరించి ముఖాన్ని తాకొద్దు

 వైద్యులు గ్లౌస్‌ ధరించిన చేతులతో తమ ముఖానిగానీ, ఏ శరీర భాగాన్ని తాకరాదు. ఎందుకంటే బాధితుడి నుంచి వైరస్‌ గ్లౌస్‌లకు అంటుకొని ఉంటే అదే గ్లౌస్‌ ధరించిన చేతులతో వైద్యులు తమ ముఖాన్ని తాకడం వల్ల వారికి కూడా వైరస్‌ సోకే ప్రమాదం ఉన్నది

బాధితులతో దూరంగా ఉండి మాట్లాడాలి 

వైరస్‌ సోకిన బాధితులతో దూరంగా ఉండాలి. వారితో మాట్లాడే సమయంలో నిర్ణీత దూరం పాటించాలి. వారికి చికిత్స చేసే సమయంలో చేతికి తప్పకుండా గ్లౌస్‌లు, ముఖానికి మాస్కు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ కిట్‌, తలకు సర్జికల్‌ క్యాప్‌ ధరించాలి.

ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు

అత్యవసర సమయంలో వైద్యులు 24 గంటలు పనిచేస్తున్నారు. దీని వల్ల ఏర్పడే స్ట్రెస్‌, టెన్షన్‌ వంటివి ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపుతాయి. వీలు దొరికినప్పుడు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. ఎంత పనివత్తిడి ఉన్నా మన ఆరోగ్యం కూడా ముఖ్యమే. డాక్టర్‌ అనేవాడు ప్రజల కోసం బతకాలి. 


logo