ఆదివారం 31 మే 2020
Hyderabad - Apr 07, 2020 , 23:54:51

సామాజిక దూరం పాటించాలి

సామాజిక దూరం పాటించాలి

-సీపీ అంజనీకుమార్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని  సీపీ అంజనీకుమార్‌ సూచించారు. మంగళవారం సీసీ రేషన్‌షాప్‌ల వద్ద, అన్నదానాల వద్ద ప్రజలు దూరం పాటిస్తున్నారా ? లేదా ? అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఎంఎస్‌ మక్తా, గోల్కొండ, ఆసీఫ్‌నగర్‌, బంజారాహిల్స్‌, గోల్కొండ, తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో సీపీ పర్యటించారు.  అదేవిధంగా  సీపీ అంజనీకుమార్‌ కరోనా అప్‌డేట్స్‌ గురించి మంగళవారం వీడియో ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కరోనా నివారణ చర్యలను ప్రతి గంటకోసారి సీఎం కార్యాలయం, చీఫ్‌ సెక్రటరీ కార్యాలయం నుంచి సీఎం వ్యక్తిగతంగా రివ్యూ చేస్తున్నారని తెలిపారు. ఇంట్లో ఉండి మద్దతు తెలుపాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మానసిక ఒత్తిడి నివారణకు కౌన్సెలింగ్‌...

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మానసిక వత్తిడి నివారణకు స్వచ్ఛందంగా పని చేసేందుకు మార్గదర్శక్‌లు కవిత నటరాజన్‌, డాక్టర్‌ అమినా నిలోఫర్‌ హూస్సేన్‌ , డాక్టర్‌ అనితా అరేలు ముందుకొచ్చారు. ఎవరైనా మానసిక సమస్యతో బాధపడేవారు 9490617234కు ఫోన్‌ చేయాలని వారు సూచించారు. 

పెట్రోలింగ్‌ వాహనాలు శుభ్రం...

 సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో దాదాపు 350 పోలీసు పెట్రోలింగ్‌ వాహనాలకు మహవీర్‌ స్కోడా,హర్ష టయోటా సంస్థ ప్రతినిధుల సహకారంతో డిసిన్‌ ఇన్‌ఫిక్షన్‌, శానిటైజేషన్‌ చేశారు. సైబరాబాద్‌ కార్‌ హెడ్‌ క్వార్టర్స్‌ అదనపు డీసీపీ మాణిక్‌ రాజ్‌ పర్యవేక్షించారు.

పోలీసులకు శానిటైజర్ల పంపిణీ

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పోలీసుల రక్షణ కోసం నగరానికి చెందిన చాలెంజర్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ సంస్థ యజమాని, విశ్రాంత సైనికాధికారి సీహెచ్‌.వెంకటేశ్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు శానిటైజర్లను పంపిణీ చేశారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వెంకటేశ్‌ను అభినందించారు.


logo