ఆదివారం 31 మే 2020
Hyderabad - Apr 07, 2020 , 23:52:36

గిఫ్ట్‌ పేరిట బురిడీ

గిఫ్ట్‌ పేరిట బురిడీ

సిటీబ్యూరో: గిఫ్ట్‌ పేరిట బురిడీ కొట్టించి ఓ వ్యక్తి ఖాతా నుంచి సైబర్‌నేరగాళ్లు రూ.84వేలు కాజేశారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ‘ఫోన్‌ పే’ నుంచి మాట్లాడుతున్నామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కాల్‌ చేశారు. మీకు ఫోన్‌ పే నుంచి గిఫ్ట్‌ వోచర్‌ వచ్చింది.. ఆ డబ్బులు మీ ఖాతాలో వేయాలంటే మీ కార్డు నంబర్‌ చెప్పండంటూ బ్యాంకు వివరాలు తీసుకున్నారు. రెండు దఫాలుగా రూ.84వేలు కాజేశారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

రూ.89వేలు కొట్టేశారు..

బంజారాహిల్స్‌లోకు చెందిన ఓ వ్యాపారి సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. అందులో మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.25వేలు డ్రా అయ్యాయంటూ ఉన్నది. దీంతో బాధితుడు మెసేజ్‌లో ఉన్న కాల్‌సెంటర్‌ నంబర్‌ అంటూ ఫోన్‌ చేశాడు. దీంతో ఫోన్‌ రీసీవ్‌ చేసుకున్న వ్యక్తులు మీ ఖాతా వివరాలు చెప్పండి.. చెక్‌ చేస్తామంటూ సూచించారు. ఓటీపీని తీసుకొని రూ.89వేలు కాజేశారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తులు తాము ఎయిర్‌టెల్‌ నుంచి మాట్లాడుతున్నామని కాల్‌ చేశారు. మీ బిల్లు పెండింగ్‌లో ఉన్నది వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి తెచ్చారు. చెల్లిస్తాను.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఉన్నది బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందంటూ బాధితుడు చెప్పాడు. ఓటీపీ తెలుసుకొని ఖాతాలో  రూ.63వేలు  దోచేశారు. 


logo