బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 07, 2020 , 01:01:50

సమస్యాత్మక ప్రాంతాల్లో ‘డ్రోన్‌'

సమస్యాత్మక ప్రాంతాల్లో ‘డ్రోన్‌'

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్‌ పెట్రోలింగ్‌ కనిపించనుంది. సోమవారం రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌, సయింట్‌ సంస్థ సహకారంతో మల్కాజిగిరి, పహాడీషరీఫ్‌, బాలాపూర్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో డ్రోన్‌ పెట్రోలింగ్‌ను ప్రారంభించారు. కరోనా విషయాన్ని దాచి ఇండ్లల్లో దాక్కున్న వారికి డ్రోన్‌ పెట్రోలింగ్‌ సహాయంతో పోలీసులు హెచ్చరించడంతోపాటు వారిని బయటికి వచ్చేవిధంగా చర్యలు చేపట్టనున్నారు. ఈ డ్రోన్‌ పెట్రోలింగ్‌కు పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ ఉండడంతో దాకున్న వారి పేర్లు వివరాలు డ్రోన్‌ కెమెరాతో దాదాపు కిలోమీటర్‌ వరకు వినిపించే విధంగా అనౌన్స్‌మెంట్‌ చేయనున్నారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ సమర్థవంతంగా జరుగుతుందా లేదా అని విషయాన్ని పోలీసులు పసిగట్టనున్నారు. దీంతో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి గల్లీల్లో తిరిగితే వెంటనే పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని ఇండ్లలోకి పంపించే అవకాశం ఉంది. ఈ డ్రోన్‌ దాదాపు 48 మీటర్ల(144 అడుగులు) ఎత్తు వరకు ఎగురనుంది. డ్రోన్‌ను దాదాపు 400 అడుగుల వరకు ఎగుర వేసే అనుమతి ఉంది. ప్రారంభోత్సవంలో రాచకొండ ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, సయింట్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

పోలీసు వాహనాలకు శానిటైజేషన్‌

నిత్యం విధుల్లో ఉంటూ కరోనా అనుమానితులను తరలిస్తన్న పోలీసు సిబ్బంది కరోనా బారినపడకుండా రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌, హర్ష టయోటా సంస్థ పోలీసు పెట్రోలింగ్‌ వాహనాలకు శానిటైజేషన్‌ చేశారు. అధికారుల వాహనాలతోపాటు కమిషనరేట్‌ పరిధిలోని దాదాపు 400 వాహనాలకు శానిటైజేషన్‌ చేసినట్లు సీపీ తెలిపారు. దీంతో ఈ వాహనాల్లో తిరిగినా నాలుగు నెలల వరకు ఎలాంటి వైరస్‌ వ్యాపించదని సీపీ చెప్పారు.

బయటకు రావద్దు:  సీపీ అంజనీకుమార్‌

లాక్‌డౌన్‌లో ఎవరూ బయటకు రావొద్దని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ సోమవారం సూచించారు. సోషల్‌మీడియాపై బాధ్యత ఉన్నది.. నకిలీ వార్తలు సృష్టించి వాటిని సర్క్యూలేట్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో 117 చెక్‌పోస్టులున్నాయని, 10వేల మంది పోలీసులు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నారని తెలిపారు. అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. అన్ని మతాలకు చెందిన పండుగలు, ప్రార్థనాలయాలకు భక్తులు వెళ్లడం లేదన్నారు. చర్చీల్లో ఆన్‌లైన్‌లో ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు. ఇలా ప్రజలందరూ కలిసికట్టుగా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించడం వల్ల కరోనాను తరిమికొట్టొచ్చని, మీ కోసం బయట పోలీసులు, ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ పనిచేస్తుందన్నారు. స్వీయ నిర్బంధంలో ఉండాలని, నిబంధనలు అతిక్రమించి బయటకు వచ్చే వారి వాహనాలను సీజ్‌ చేస్తున్నామని సీపీ హెచ్చరించారు.


logo