ఆదివారం 31 మే 2020
Hyderabad - Apr 07, 2020 , 00:58:19

మే ఆఖరుకల్లా ఉక్కు వంతెన రెడీ

మే ఆఖరుకల్లా  ఉక్కు వంతెన రెడీ

  • పునాదుల పనులు 80 శాతం పూర్తి
  • ముమ్మరంగా కొనసాగుతున్న ఫ్యాబ్రికేషన్‌ పనులు
  • పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌
  • ‘అన్నపూర్ణ’ కేంద్రం పరిశీలన

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పంజాగుట్టలోని చట్నీస్‌ హోటల్‌ నుంచి హెటీ టవర్‌ వరకు శ్మశానవాటిక మీదుగా నిర్మిస్తున్న స్టీలు బ్రిడ్జి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పునాదుల పనులు 80 శాతం పూర్తి కాగా, బ్రిడ్జి ఫ్యాబ్రికేషన్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మే 31వ తేదీ నాటికి బ్రిడ్జిని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులతోపాటు ఇందుకు అవసరమైన భూసేకరణ పురోగతిని సోమవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. 

పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద తీవ్ర ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతున్న విషయం విదితమే. అక్కడ రోడ్డును విస్తరించేందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ శ్మశానవాటిక నిర్వాహకులు ఒప్పుకోని కారణంగా అది సాధ్యంకాలేదు. దీంతో సాధ్యమైనంత మేరకు తక్కువ భూసేకరణతో శ్మశానవాటిక మీదుగా స్టీలు బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ అధికారులు, ఈ మేరకు పనులు చేపట్టారు. ఇందులో భాగంగా పంజాగుట్ట శ్మశానవాటిక(చట్నీస్‌ ముందు) వద్ద రూ.5.95 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇక్కడ రోడ్డును 110మీటర్ల పొడవున, ఆరు మీటర్ల వెడల్పు వరకు విస్తరిస్తున్నారు. స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం 43 మీటర్ల పొడవు వరకు ఉండగా, బ్రిడ్జి అప్రోచ్‌లు 67 మీటర్లు ఉండేలా నమూనాలు రూపొందించారు. బ్రిడ్జికి సంబంధించి పునాదుల పనులు 80 శాతం పూర్తికాగా, స్టీలు బ్రిడ్జి ఫ్యాబ్రికేషన్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులు వచ్చే నెల చివరికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.17కోట్లు ఖర్చవుతుందని అంచనా. కాగా, భూసేకరణకు రూ.5.95 కోట్లు వెచ్చిస్తున్నారు. దీంతో మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.23కోట్లుగా చెప్పవచ్చు.

పనులు పరిశీలించిన మంత్రులు...

పంజాగుట్ట శ్మశానవాటిక పక్కన, ఫర్నిచర్‌ వరల్డ్‌ ముందు నుంచి రోడ్డు విస్తరణ, స్టీలు బ్రిడ్జీ నిర్మాణ పనులను మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ విలేకరులతో మాట్లాడుతూ, నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో శ్మశానవాటిక-చట్నీస్‌ మధ్య ఇరుకుగా ఉన్న పంజాగుట్ట రహదారిని రెండు వైపులా విస్తరించేందుకు ఎస్‌ఆర్‌డీపీ కింద ప్రభుత్వం పనులు మంజూరు చేసినట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో ఏర్పడిన వెసులుబాటును ఉపయోగించుకొని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఎస్‌ఆర్‌డీపీ/సీఆర్‌ఎంపీ పనులను రాత్రింబవళ్లు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ లాక్‌డౌన్‌ కాలంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేవని, అదనపు కార్మికులు, యంత్రాలతో ముమ్మరంగా పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ పనుల్లో భాగంగా రోడ్డుకు రెండు వైపులా రెండు లేన్ల ర్యాంపులు నిర్మిస్తున్నట్లు మేయర్‌ తెలిపారు. అయితే శ్మశానవాటికలో సమాధులకు నష్టం జరుగకుండా మధ్యలో 43 మీటర్ల పొడవున స్టీల్‌ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు తెలిపారు. శ్మశానవాటిక ప్రవేశమార్గం వైపు ట్రాఫిక్‌ నియంత్రణకు దోబీఘాట్‌ వైపు బయటికి వెళ్లే మార్గం నిర్మించేందుకు ఆస్తులు సేకరిస్తున్నామన్నారు. 


logo