శనివారం 30 మే 2020
Hyderabad - Apr 06, 2020 , 00:03:15

ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ పనులు పూర్తి చేయాలి

ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ పనులు పూర్తి చేయాలి

  • మేయర్‌ బొంతు రామ్మోహన్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/అబిడ్స్‌/మాదన్నపేట: లాక్‌డౌన్‌ సమయంలో ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ పనులను వేగంగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులను మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఆదివారం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మేయర్‌ తనిఖీ చేశారు. ఓవైసీ దవాఖాన, ఐఎస్‌ సదన్‌ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌, బహదూర్‌పురా క్రాస్‌రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ పనులను తనిఖీ చేశారు. ప్రస్తుతం ట్రాఫిక్‌సమస్యలులేనందున కార్మికుల భద్రతకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని మెటీరియల్‌ను ముందస్తుగా సమకూర్చుకుని పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ పనులకు అడ్డుగా ఉన్న ఆస్తులను సేకరించి నిర్మాణ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. ఆలాగే వాటర్‌ పైప్‌లైన్లు, విద్యుత్‌ స్తంభాలు, ఇతర శాఖల కేబుళ్లను యుద్ధప్రాతిపదికన తరలించి నిర్మాణాలను వేగవంతం చేసేందుకు సహకరించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించిందని మేయర్‌ తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీ పనులు పూర్తి అయితే ట్రాఫిక్‌ రద్దీ రహిత, సిగ్నలింగ్‌ రహిత రవాణాకు అవకాశం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ప్రాజెక్టు ఇంజినీర్లు పాల్గొన్నారు. అదేవిధంగా నాంపల్లి  ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో వలస కూలీలు, నిరాశ్రయులకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. సామాజిక దూరాన్ని పాటించాలన్న ఉద్దేశంతో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఆశ్రయం పొందుతున్న  530మందిలో 130 మందిని విక్టరీ ప్లే గ్రౌండ్‌కు తరలించినట్లు తెలిపారు. వారందరికీ రెండు పూటలా ఉచితంగా అన్నపూర్ణ భోజనం పెడుతున్నామని మేయర్‌ తెలిపారు. అనంతరం ఆ ప్రాంతంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికురాలని పలుకరించారు. చేతులకు గ్లౌస్‌లు ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించారు. కార్మికుల క్షేమం కోసమే వాటిని ఇచ్చారని అందరూ తప్పకుండా వాడాలని సూచించారు.


logo