శనివారం 30 మే 2020
Hyderabad - Apr 05, 2020 , 23:57:47

రికార్డు స్థాయిలో బియ్యం పంపిణీ

రికార్డు స్థాయిలో బియ్యం పంపిణీ

  • ఐదు రోజుల్లోనే 50 శాతం మందికి రేషన్‌
  • త్వరలో రూ.1500 నగదు
  • పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కేవలం ఐదు రోజుల్లోనే రాష్ట్రంలో రికార్డుస్థాయిలో రేషన్‌ బియ్యం పంపిణీ చేయడం జరిగిందని పౌరసరఫరాలశాఖ సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి 5 వ తేదీ వరకు రాష్ట్రం లో 50 శాతం మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఆదివారం రోజు  ముషీరాబాద్‌ షాప్‌నెంబరు 638లో ముషీరాబాద్‌ శాసనసభ్యులు ముఠాగోపాల్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాసరెడ్డి బియ్యం పంపిణీ చేశారు. రేషన్‌ దుకాణాల్లో బియ్యం పంపిణి ప్రక్రియను పరిశీలించిన సందర్భంగా ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో 2.80 కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులకు ఉచితంగా 12 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభించామని అన్నారు. ప్రారంభంలో ఒకట్రెండు రోజులపాటు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని, వాటిని వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. మొత్తం 87.55 లక్షల కుటుంబాలకు 45,11,849 కుటుంబాలకు 1లక్ష 67 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగిందన్నారు. కేవలం ఐదు రోజుల్లో 50 శాతం పంపిణీ చేయడం రికార్డని అన్నారు. మూమూలుగా ప్రతీనెల 15 రోజుల్లో 1.67 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తే ఇప్పుడు కేవలం ఐదు రోజుల్లోనే అధికంగా పంపిణీ చేశామన్నారు. ఇదేవిధంగా కొనసాగితే 3,4 రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. త్వరలో అకౌంట్‌లోకి  రూ.1500 నగదు : ప్రతీ రేషన్‌కార్డు లబ్ధిదారుడికి రెండు , మూడు రోజుల్లో ఆన్‌లైన్‌ ద్వారా వారి ఖాతాల్లో రూ.1500 జమ చేస్తామని శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.   


logo