మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 05, 2020 , 23:57:05

కరోనా కట్టడిలో.. మీ సేవలు వెలకట్టలేనివి

కరోనా కట్టడిలో.. మీ సేవలు వెలకట్టలేనివి

  • మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ 

అమీర్‌పేట్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  కరోనాను కట్టడి చేయడంలో వైద్యులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, ఆశావర్కర్ల సేవలు వెలకట్టలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పలు ప్రాం తాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, ఆశావర్కర్లను మంత్రి తలసాని అభినందించారు. ఈ సందర్భంగా సంగీత్‌ చౌరస్తాలోని చెక్‌పోస్టు వద్ద, మోండా మార్కెట్‌, సిటీలైట్‌ జంక్షన్‌, రాణిగంజ్‌, రసూల్‌పురా చౌరస్తాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, క్లాక్‌ టవర్‌ వద్ద పారిశుధ్య సిబ్బంది, ఆశా వర్కర్లకు కృతజ్ఞతగా గులాబీ పూలు అందజేశారు. శానిటైజర్‌, గ్లూకోజ్‌, వాటర్‌ బాటిల్‌ను పంపిణీ చేశారు. అదేవిధంగా సనత్‌నగర్‌ జెక్‌కాలనీ రెసిడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జెక్‌కాలనీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు జి.సూర్యశంకర్‌రెడ్డి అధ్యక్షతన కాలనీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మంత్రి తలసానికి జెక్‌ కాలనీ ఫెడరేషన్‌ వారు వెయ్యి వెంటిలేటర్లు సమకూర్చేందుకు సహాయం అందిస్తామని మంత్రికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జెక్‌కాలనీ నివాసితులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ లక్ష్మిరెడ్డి, జెక్‌కాలనీ ఫెడరేషన్‌ ప్రతినిధులు గ్రీన్‌సిటీ అధినేత సుబ్బరాజు, విశ్వనాథరాజు, అనంతరెడ్డి, కె.ఆర్‌.కె.రెడ్డి, శ్రీహరి, డాక్టర్‌ వై.వి.రాఘవయ్య, సురేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.  

  స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష  :  మంత్రి మల్లారెడ్డి 

 జవహర్‌నగర్‌/కంటోన్మెంట్‌,(నమస్తే తెలంగాణ): స్వీయ నియంత్రణతోనే కరోనాను కట్టడి చేయడం సాధ్యమని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డులో పేదలకు ఉచితంగా మంత్రి మల్లారెడ్డి కూరగాయలను పంపిణీ చేశారు. అదేవిధంగా జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు మేకల అయ్యప్ప, మేయర్‌ మేకల కావ్య ఆధ్వర్యంలో 4వేల మంది పేదలు, వలస కూలీలకు 300క్వింటాల బియ్యం, 25 వేల గుడ్లను మంత్రి  మల్లారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంటు ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ ఒక్క వ్యక్తి కూడా పస్తులుండ కూడదని సీఎం కేసీఆర్‌ సంకల్పమన్నారు. పేద కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ఉచితంగా కూరగాయలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీ.ఎన్‌.శ్రీనివాస్‌, బోర్డు సభ్యుడు కె.పాండుయాదవ్‌, ఎంపిక శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ ఉదయ్‌కుమార్‌, డైరెక్టర్లు శేర్విన్‌కుమార్‌, శ్రీనివాస్‌, బాలమల్లు, నాయకులు కె.బి.శంకర్‌రావు, టింకుగౌడ్‌, సదానంద్‌, తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌, జవహర్‌నగర్‌ డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌, యూత్‌ నాయకుడు భార్గవరామ్‌,కార్పొరేటర్లు పాల్గొన్నారు.  

సామాజిక దూరం పాటించాలి: ఎంపీ  

చార్మినార్‌: కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రజలకు సూచించారు. ఆదివారం ఆయన పాతనగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను అంచనా వేస్తూ స్థానికులతో ముచ్చటించారు. అనంతరం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ కరోనా అనుమానిత వ్యక్తుల వివరాలను అధికారులకు తెలియజేయాలని సూచించారు.

1100 కుటుంబాలకు చేయూత  

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, పల్లవిగ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌, పల్లవి ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యం ద్వారా 1100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పంపిణీ చేశారు. చర్లపల్లి డివిజన్‌ ఇందిరమ్య గృహకల్ప, చర్చి కాలనీలో నివసిస్తున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులకు సంబంధించిన కిట్‌లు అందజేశారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్‌ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.


logo