బుధవారం 27 మే 2020
Hyderabad - Apr 03, 2020 , 23:16:59

కలసికట్టుగా గుర్తించారు

కలసికట్టుగా గుర్తించారు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడిలో పోలీసులకు కమ్యూనిటీ పోలీసింగ్‌ ఎంతగానో సహకరిస్తున్నది. ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిని గుర్తించడంలో పోలీసులకు కమ్యూనిటీ పోలీసింగ్‌ నుంచి సమాచారం వస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఢిల్లీకి వెళ్లొచ్చిన వారందరినీ దాదాపుగా గుర్తించారు. ఇతర విభాగాల సమన్వయంతో ఢిల్లీ వెళ్లొచ్చిన వారి వివరాలు తీసుకొని, స్థానిక పోలీస్‌స్టేషన్‌ సిబ్బందికి కరోనా అనుమానితులను గుర్తించే బాధ్యతలను అప్పగించారు. దీంతో ఇప్పటికే నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న వారందరినీ గుర్తించి, వారి లింక్‌లను కూడా గుర్తించారు. కరోనా ఫ్రీ సిటీగా గుర్తించే పనిని విజయవంతం చేసేందుకు నగర  పోలీసులు కృషి చేస్తున్నారు. ఇందులో కమ్యూనిటీ పోలీసింగ్‌ సేవలను ఉపయోగిస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ గ్రూప్‌లను తయారు చేసి ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోని సెక్టార్ల వారీగా ప్రజా సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు. దీంతో పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే దాదాపుగా హైదరాబాద్‌లో ఇతర దేశాలు, రాష్ర్టాలకు వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించే పని పూర్తయ్యిందనుకున్న సమయంలోనే ఢిల్లీ నిజాముద్దీన్‌ ఘటన అందరినీ ఖంగుతిన్పించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతోనే మొదట్లో ఆందోళనకు గురైనా.. ఒకటి రెండు రోజుల్లోనే పరిస్థితిని పోలీసులు చక్కబెట్టారు.

పోలీస్‌స్టేషన్ల వారీగా...

ఒక్కో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇతర దేశాలు, రాష్ర్టాలకు వెళ్లొచ్చిన వారి వివరాలను సేకరించి... వారందరికీ పరీక్షలు నిర్వహించారు. కరోనా అనుమానితులను క్వారంటైన్‌ చేసి,  పాజిటివ్‌ వచ్చిన వారిని ఆయా దవాఖానలకు తరలించారు. ఇంకా ఎవరైనా ఉంటే... వారి సమాచారాన్ని కమ్యూనిటీ పోలీసింగ్‌ సభ్యులు పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌తో పాటు డయల్‌ 100కు, స్థానిక పోలీసులకు ఈ సమాచారం వస్తుంది. దీంతో వెంటనే క్షేత్ర స్థాయిలోని పోలీసులు రంగంలోకి దిగి... అలాంటివారిపై నిఘా పెడుతున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన వారితో పాటు వారెవరిని కలిశారనే విషయంలో స్పష్టత వస్తున్నా.. మరింత స్పష్టత కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారు. దీనిలో కమ్యూనిటీ పోలీసింగ్‌ సేవలను పోలీసులు ఉపయోగించుకుంటున్నారు. 

పేదలకు నిత్యాసరాలు అందించిన సీపీ అంజనీకుమార్‌

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ నగర వ్యాప్తంగా నిరంతరం విస్తృతంగా పర్యటిస్తూ సిబ్బందిలో ఉత్సాహన్ని నింపుతున్నారు. ఆయా కూడళ్లలో ఉండే సిబ్బందితో కరోనా కట్టడిలో పోలీసుల పాత్ర, పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి వివరిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి పలు చోట్ల క్షేత్ర స్థాయి సిబ్బందితో మాట్లాడి, వారికి ఆహారపు పొట్లాలను అందించారు. కిషన్‌బాగ్‌లో శుక్రవారం బహుదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కిషన్‌బాగ్‌లో బీహార్‌ నుంచి వచ్చిన కూలీలకు సీహెచ్‌ కృషమూర్తి ఆధ్వర్యంలో 200 మందికి ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులను సీపీ పేదలకు అందించారు.


logo