శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 03, 2020 , 23:15:22

పాత బిల్లే ప్రామాణికం..!

పాత బిల్లే ప్రామాణికం..!

-గత నెల బిల్లు ఆధారంగానే   కొత్త బిల్లులు

-విద్యుత్‌ బిల్లుల జారీపై   డిస్కం అధికారుల నిర్ణయం

-ఈఆర్‌సీ పరిశీలనలో ఫైల్‌

-రెండుమూడురోజుల్లో  తుది నిర్ణయం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత్‌ బిల్లుల జారీపై  స్పష్టత వచ్చింది. ఇంతకాలం నెలకొన్న డోలాయామానానికి తెరపడింది. దీనిపై విద్యుత్‌ సంస్థల అధికారులు తాజాగా తుది నిర్ణయం తీసుకున్నారు. పాత బిల్లులను ప్రామాణికంగా తీసుకుని, గత నెలలో ఎంత బిల్లు వస్తే దానినే ఈ నెల బిల్లుగా జారీచేయాలని నిశ్చయించారు. ఇందుకు అనుమతి కోరుతూ విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీ(ఈఆర్‌సీ)కి పంపించారు. ఇందుకు సంబంధించిన  ఫైల్‌ ఈఆర్‌సీ పరిశీలనలో ఉంది. దీనిపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశముందని టీఎస్‌ఎస్పీడీఎల్‌ అధికారులు ఆశాభావం  వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ సంస్థలు నియమించిన ఏజెన్సీలు ప్రతి నెల మొదటి వారంలో ఇంటింటికి తిరుగుతూ మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా బిల్లులు జారీచేస్తుండటం తెలిసిందే. ఇలా గ్రేటర్‌లో 44 లక్షల పైచిలుకు వినియోగదారులున్నారు. వీరి నుంచి ప్రతి నెల రూ. 1500 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. కాని ఇప్పుడు ఇంటింటికి తిరిగి బిల్లులు చెల్లించే అవకాశం లేకపోవడంతో బిల్లుల వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అంతే కాకుండా ఆర్థిక నష్టం వచ్చే అవకాశం లేకపోలేదు. డిస్కం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సమస్యలు తలెత్తకుండా మధ్యేమార్గంగా పాత బిల్లులను ప్రామాణికంగా తీసుకుని కొత్త బిల్లులు జారీచేసేందుకు డిస్కం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం వినియోగదారులు గత నెల ఎంత బిల్లులు చెల్లించారో.. ఈ నెల సైతం అంతే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోతే విధించే ఫైన్లు, జరిమానాల నుంచి మినహాయించనున్నారు. కేంద్ర విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఫైన్లు, జరిమానాల నుంచి మినహాయింపునివ్వనున్నారు.

ఉదాహరణకు ఒక వినియోగదారుడు ఫిబ్రవరి నెలకు రూ. 234 బిల్లు చెల్లిస్తే మార్చి మాసానికి సైతం అంతే బిల్లును చెల్లించాల్సిఉంటుంది. లాక్‌డౌన్‌ ముగిసి, పరిస్థితులు సర్దుకుంటే మే మాసం మొదటి వారంలో మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా కొత్త బిల్లులను జారీచేస్తారు. అప్పుడు వచ్చిన బిల్లులో నుంచి ఇది వరకు చెల్లించిన మొత్తాన్ని మినహాయించి, కొత్త బిల్లులు జారీచేస్తారు. కొత్త బిల్లులో ఏప్రిల్‌ నెల బిల్లుతో పాటు ఇదివరకటి బకాయి ఉంటే మొత్తం కొత్త బిల్లుగా వస్తుంది. 


logo