మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 02, 2020 , 23:43:38

ఫ్లైఓవర్ల పూర్తికి.. అందివస్తున్న లాక్‌డౌన్‌

ఫ్లైఓవర్ల పూర్తికి.. అందివస్తున్న లాక్‌డౌన్‌

హైదరాబాద్‌ నగరాన్ని  ట్రాఫిక్‌ రద్దీ రహితంగా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ) కింద రూ. 2399కోట్ల వ్యయంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్‌ కారిడార్లు, రోడ్‌ అండర్‌ బ్రిడ్జిలు, కేబుల్‌ బ్రిడ్జి తదితరవాటి నిర్మాణ పనులు చేపట్టిన విషయం విదితమే. వీటిలో రూ. 1500కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. పనులను వేగంగా పూర్తిచేసేందుకు బిల్లుల చెల్లింపులలో జాప్యాన్ని, నిధుల కొరతను అధిగమించేందుకు ఎస్‌బీఐ బ్యాంకు ద్వారా రూ. 2500 కోట్ల మొత్తాన్ని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ రుణం రూపంలో సమకూర్చుకుంది. ఇదివరకే మున్సిపల్‌ బాండ్ల ద్వారా సేకరించిన నిధులనుంచి రూ. 500కోట్లు, అలాగే జీహెచ్‌ఎంసీ నిధులనుంచి మరో రూ. 370కోట్లను ఖర్చుచేసిన అధికారులు మరో రూ. 200కోట్ల విలువైన బిల్లుల చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 834.44కోట్లతో చేపట్టిన 11పనుల్లో వచ్చే జాన్‌ నాటికి రూ. 436.52కోట్ల విలువైన పనులను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకనుగుణంగా లాక్‌డౌన్‌ సమయాన్ని జీహెచ్‌ఎంసీ, ఆయా నిర్మాణ సంస్థలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాయి. ట్రాఫిక్‌ నియంత్రణ, మళ్లింపు వంటి సమస్యలు లేనందున నిరాటంకంగా రేయింబవళ్లూ పనులు కొనసాగిస్తున్నారు. వైరస్‌ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఎక్కువ యంత్రాలను ఉపయోగిస్తూ తక్కువ మంది కార్మికులు ఉండేలా నిబంధనలు అమలు చేస్తున్నారు. అయితే ఎల్‌అండ్‌టీ సంస్థతోపాటు వివిధ ప్యాకేజీలకింద చైనాతో అనుబంధం కలిగిన సంస్థలు చేపట్టిన దుర్గం చెరువు సహా పలు ఎలక్ట్రికల్‌ పనులు పూర్తిగా ఆగిపోయాయి. 

బీటీ సరఫరాకు తొలగిన అడ్డంకులు

కాంప్రహెన్సివ్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం(సీఆర్‌ఎంపీ) కింద నగరంలో 1800 కోట్ల వ్యయంతో చేపట్టిన 709 కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో ఇతర రాష్ర్టాలనుంచి బీటీ సరఫరాకు మార్గం సుగమం అయింది. దీంతో శుక్రవారం నుంచి యథావిధిగా పనులు మొదలవుతాయని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ విధించడంవల్ల ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోవడంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లనుంచి రావాల్సిన బీటీ రాక నిలిచిపోయింది. ప్రస్తుత సమయాన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం, రోడ్ల పునరుద్ధరణ పనులకు సద్వినియోగం చేసుకోవాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. అంతేకాదు, బీటీ వాహనాలకు అంతరాయం లేకుండా చూడాలని డీజీపీని కోరారు. దీంతో ఆయన పొరుగు రాష్ర్టాలతో మాట్లాడి బీటీ లారీలు యథావిథిగా వచ్చేవిధంగా తగిన చర్యలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి ఆయా ప్రాంతాల్లో పనులు యథావిథిగా ప్రారంభమవుతాయని వివరించారు. 


logo