గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 02, 2020 , 23:44:46

కాంగ్రెస్‌ నాయకులవి అర్థరహిత ఆరోపణలు

కాంగ్రెస్‌ నాయకులవి అర్థరహిత ఆరోపణలు

చర్లపల్లి : కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో పనిచేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అర్థరహిత ఆరోపణలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. గురువారం చర్లపల్లి డివిజన్‌ పరిధి పారిశ్రామికవాడలోని సీఐఏ కార్యాలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్యెల్యే బేతి సుభాష్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, టీఐఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్‌రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాడుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం కరోనా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తే కాంగ్రెస్‌ నాయకులు అవగాహన రాహిత్యంతో ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలకు ధైర్యం ఇవ్వకుండా కాంగ్రెస్‌ నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారన్నారు. సీఎం కేసీఆర్‌ వేతనాల విషయంలో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం కావడంతో పాటు వైద్యులు, పోలీసులకు వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఉద్యోగ సంఘాలు, కిందిస్థాయి సిబ్బంది సైతం కరోనా కట్టడిలో భాగస్వాములై పనిచేస్తుంటే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు.  కరోనా కట్టడి చర్యల్లో తెలంగాణ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.


logo