శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Mar 31, 2020 , 23:06:15

ఒక్కరూ.. ఆకలితో ఉండొద్దు

ఒక్కరూ.. ఆకలితో ఉండొద్దు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌లో భాగంగా ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనిఏ ఉద్దేశంతో వలస కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారందరికీ ఉచితంగా బియ్యం, నగదు పంపిణీ చేస్తున్నట్టు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా వలస కార్మికులు ఉన్న ప్రాంతాల్లో మంగళవారం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ,పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా రేషన్‌ కార్డులేని నిరుపేద వలస కార్మికులకు ఒక్కొక్కరికీ 12కిలోల చొప్పున బియ్యం, రూ. 500చొప్పున నగదు అందజేశారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని అశోక్‌నగర్‌లో నిర్వహించిన బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో పాటు మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, స్థానిక కార్పొరేటర్‌ ముఠా పద్మ, పౌర సరఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎం. శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరంలో ఉన్న 34283మంది వలస కార్మికులకు 411మెట్రిక్‌ టన్నుల బియ్యం అందజేయనున్నట్టు వెల్లడించారు. ఆకలితో ఏ ఒక్కరూ పస్తులుండరాదనే ఉద్దేశంతో అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచిత భోజన సౌకర్యాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కరోనాను అడ్డుకునేందుకు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన నగరవాసులకు పిలుపునిచ్చారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,35,669 మంది వలస కార్మికుల సంరక్షణకు 4028మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని,  రూ. 16,78,34,500 నగదును ప్రభుత్వం అందజేస్తున్నట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. నగరంలో పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర ప్రదేశ్‌,రాజస్థాన్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ర్టాలకు చెందినవారు వివిధ నిర్మాణ పనుల్లో కొనసాగుతున్నారు. వీరందరికీ ఎటువంటి రేషన్‌ కార్డులు లేకపోగా, రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. అగమ్యగోచరంగా మారిన వీరి దుస్థితిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉచిత బియ్యం, నగదు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 

జీహెచ్‌ఎంసీ చుట్టూ.. 95వేల మంది 

జీహెచ్‌ఎంసీ శివార్లలో ఉన్న మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో 948 ప్రదేశాల్లో వేర్వేరు చోట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దాదాపు 95859మంది వలస కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా ఆయా ప్రాంతాల్లో ఉండిపోయినట్లు జీహెచ్‌ఎంసీ అర్బన్‌ కమ్యునిటీ డెవలప్‌మెంట్‌ విభాగంతో గుర్తించింది. సంఘటిత నిర్మాణ రంగంలో 41740మంది వలస కార్మికులు 284 వర్కింగ్‌ సైట్లలో ఉండగా, మిగిలినవారు అసంఘటిత రంగంలో వివిధ పనులు చేసుకుంటున్నారు. వీరందరికీ పనిచేస్తున్న చోటే లేబర్‌ క్యాంపులను ఏర్పాటుచేసి ఉచితంగా భోజనం, అనారోగ్యంగా ఉన్నవారికి వైద్య సౌకర్యాలు సమకూర్చుతున్నారు. 

ఎవర్నీ పస్తులుంచం:తలసాని 

బన్సీలాల్‌పేట్‌: పేదలు పస్తులుండకుండా సీఎం కేసీఆర్‌  ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, ఐదు వందల రూపాయల నగదు ఇవ్వాలని నిర్ణయించారని మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం బన్సీలాల్‌పేట్‌లోని జీహెచ్‌ఎంసీ మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌లో బేగంబజార్‌కు చెందిన వ్యాపారి బంకత్‌ సహకారంతో మంత్రి 627 మంది నిరుపేదలకు 20 రోజులకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు.

అభాగ్యులకు తోడూనీడ:మల్లారెడ్డి

 మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:   జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 600 మంది కూలీలకు మంత్రి మల్లారెడ్డి సొంత ఖర్చులతో నిత్యావసర సరుకులను అందజేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మేడ్చల్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులను గుర్తించి కలెక్టర్‌ ఆధ్వర్యంలో పునరావాసం కల్పించారు.  రెండు రోజులుగా వారికి ఉదయం టిఫిన్‌ (పూరీ, చపాతి, ఇడ్లీ, వడ), మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించడంతో పాటు ప్రతి పునరావాస కేంద్రంలో ప్రతిరోజూ వైద్య పరీక్షలను నిర్వహించడంతో పాటు సోషల్‌ డిస్టెన్స్‌ ప్రాముఖ్యతపై నిరాశ్రయులైన కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారు. రూ.500లతో పాటు ఒక్కో మనిషికి 12 కిలోల చొప్పున బియ్యాన్ని మంత్రి మల్లారెడ్డి ఘట్‌కేసర్‌, దుండిగల్‌, జవహార్‌నగర్‌, దమ్మాయిగూడ తదితర ప్రాంతాల్లో జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్‌లతో కలిసి పంపణీ చేశారు.

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందించిన డిప్యూటీ స్పీకర్‌ 

సికింద్రాబాద్‌ : మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా చేసిన సూచనపై డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ వెంటనే స్పందించి మంగళవారం మెట్టుగూడ డివిజన్‌ దూద్‌బావి ప్రాంతానికి చెందిన 250 మంది వలస కార్మికులకు తన సొంత ఖర్చులతో భోజనం ఏర్పాటు చేశారు.


logo