గురువారం 28 మే 2020
Hyderabad - Mar 31, 2020 , 23:05:07

క్వారంటైన్‌కు 389 మంది

క్వారంటైన్‌కు 389 మంది

సిటీబ్యూరో : ఇటీవల ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమాలకు హాజరై వచ్చిన వారిలో 74 మందికి ఆరోగ్య సమస్యలు, కరోనా లక్షణాలను గుర్తించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ వెల్లడించారు. వీరందరినీ గాంధీ, ఫిరాస్పత్రికి తరలించినట్లు చెప్పారు.  ఢిల్లీకి వెళ్లి నగరానికి వచ్చిన 603 మంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మంగళవారం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన 200 బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాయన్నారు. 463 ఇండ్లలో పరిశీలించి..348 మంది అనుమానితులను హోమ్‌ క్వారంటైన్‌, మరో 41 మందిని ప్రభుత్వ క్వారంటైన్‌లకు తరలించినట్లు తెలిపారు. కరోనా లక్షణాలున్న వారిని వైద్యశాలలకు పంపించామన్నారు. మిగిలిన వారి చిరునామాలు లభ్యం కాలేదని,  తనిఖీలు కొనసాగుతాయని, జోనల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్‌ చెప్పారు. 

ఆ రెండు కమిషరేట్ల పరిధిలో... 

ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లిన వారి కోసం రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ పరిధిలో 70 మంది, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 93 మంది వెళ్లినట్లు స్పెషల్‌ బ్రాంచి అధికారులకు సమాచారం అందింది.  ప్రత్యేక బృందాలు వారిని గుర్తించి.. నేరుగా క్వారంటైన్‌లకు తరలిస్తున్నాయి. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారి వివరాలు అక్కడ నమోదు చేయడంతో వాటి ద్వారా రెండు కమిషరేట్ల పరిధిలో ఎవరెవరూ ఎక్కడెక్కడ నివసిస్తున్నారో తెలుసుకోగలిగారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా మిగతా వారి ఆచూకీ  సేకరిస్తున్నారు.  మత ప్రార్థనలకు వెళ్లిన వారు స్వచ్ఛందంగా వచ్చి క్వారంటైన్‌కు వెళ్లవచ్చని  సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు సజ్జనార్‌, మహేశ్‌భగవత్‌ చెప్పారు.

 పాస్‌పోర్టులు సీజ్‌...

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వరకు మొత్తం 2316 మందికి కరోనా ఉన్నట్లు అనుమానించారు. వీరిలో 2019 మందిని పరిశీలించగా ముగ్గురికి మాత్రమే కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించగా మిగతా 1897 మందిని హోం క్వారంటైన్‌కు పరిమితం చేశారు. విదేశాలకు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా వచ్చి సమాచారం ఇవ్వకుండా తిరుగుతుండడంతో వారిని గుర్తించి 1065 మంది పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని వాటిని కలెక్టర్‌కు అప్పగించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 47కేసులను నమోదు చేయగా, 109 ఈ-పెట్టీ కేసులు, ఈ మొత్తం 156 కేసుల్లో 145మంది నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్నారని పోలీసులు అభియోగాలను మోపారు.

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో...

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 3,635 మంది కరోనా బాధితులుగా అనుమానించారు. వీరిలో 2417 మందిని పరిశీలించారు. అందులో 15 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 2,402 మందిని హోం క్వారంటైన్‌ను విధించారు.విదేశీ ప్రయాణాన్ని దాచిపెట్టినందుకు 828  పాస్‌పోర్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా మొత్తం 47 నిబంధనల ఉల్లంఘన కేసులు 119పై  నమోదు చేయగా, అత్యధిక ధరలకు అమ్ముతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న 43 మంది దుకాణాదారులపై బ్లాక్‌ మార్కెటింగ్‌ కేసులను నమోదు చేశారు. 185 ద్విచక్రవాహనాలు, 63 ఆటోలు, 35 కార్లను స్వాధీనం చేసుకున్నారు.  


logo