సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Mar 30, 2020 , 00:03:09

నిరాటంకంగా నిత్యావసరాలు

నిరాటంకంగా నిత్యావసరాలు

సైదాబాద్‌/ మాదన్నపేట: లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందిపడకుండా మొబైల్‌ కూరగాయల వాహనాన్ని ప్రభుత్వం ప్రజల వద్దకే తీసుకురావటంతో బస్తీలు, కాలనీల్లో ఉన్న స్థానికులు తమకు అవసరమైన కూరగాయలను సామాజిక దూరం పాటించి కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ఒవైసీ ఆదేశాలతో సైదాబాద్‌ డివిజన్‌ పరిధిలోని పలు బస్తీల్లో ఆదివారం మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల పేదలకు కావాల్సిన బియ్యం, కందిపప్పు అందజేశారు. 

ఉప్పల్‌.. 

కరోనా వైరస్‌ను నివారణ చర్యల్లో భాగంగా ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి ఉప్పల్‌లోని ఎన్‌జీఆర్‌ఐ ప్రాంతంలో పలువురికి శానిటైజర్స్‌, మాస్కులను అందజేశారు.ఐఐసీటీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ పలువురు శానిటేషన్‌ సిబ్బంది, సీవరేజీ సిబ్బందికి శానిటైజర్స్‌ అందజేశారు. మల్లాపూర్‌ డివిజన్‌ నెహ్రూనగర్‌లో 1500 కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేపట్టారు. సీఎంరిలీఫ్‌ఫండ్‌కు విరాళంగా పూర్ణచందర్‌ రూ.5 వేలు, కేశవరం యాదగిరి రూ.2500 వార్డు కార్యాలయంలో కార్పొరేటర్‌కు అందజేశారు. రామంతాపూర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ గంధం జ్యోత్స్న,ఏఎస్‌రావునగర్‌లో డివిజన్‌కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డి  పలు కాలనీల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. 

సికింద్రాబాద్‌  ..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తార్నాక చౌరస్తాలో పోలీసులకు ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు.పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డగుట్ట పరిధిలో ఇంటింటికీ తిరుగుతూ దండంపెట్టి బయటికి రావద్దంటూ ప్రచారం అవగాహన కల్పిస్తున్నారు.  

అంబర్‌పేట..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నల్లకుంట టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు శ్రీనివాస్‌గౌడ్‌ పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.టీఆర్‌ఎస్‌ నగర నాయకుడు ఎక్కాల కన్నా ఆధ్వర్యంలో కాచిగూడ రైల్వేస్టేషన్‌ సమీపంలో పేదలకు ఆహార ప్యాకెట్లు, వాటర్‌ బాటిల్స్‌, బ్రెడ్‌ ప్యాకెట్లను ఉచితంగా అంద జేశారు. అంబర్‌పేట డివిజన్‌ పటేల్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్ధార్థ ముదిరాజ్‌ గోల్నాక డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్కే బాబు, సంతోష్‌, భీష్మ, వినోద్‌లు ముస్లింలకు నిత్యావసర వస్తువులు పంపిణీ  చేశారు.  

కుత్బుల్లాపూర్‌..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి 12 వార్డులోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్‌-1,2లల్లో సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు కొలన్‌గోపాల్‌ రెడ్డి పర్యటించారు. మున్సిపల్‌ సిబ్బందికి మాస్కులు, గ్లౌజ్‌లు అందజేయడంతో పాటు బస్తీ మొత్తం బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. 18వ వార్డు బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో అనాథలను సీఐ జగ దీశ్వర్‌, మాజీ సర్పంచ్‌, కార్పొరేటర్‌ చేరదీసి భోజనం ఏర్పాటు చేశారు. పేట్‌బషీరాబాద్‌ బాలాజీ వైద్యశాల సమీపంలో సుమారు 20మందికి నెలకు సరిపడే నిత్యావసర సరుకలను సీఐ మహేశ్‌ అందజేశారు. జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌లో పరిసరాల్లో, స్టేషన్‌ లోపల ప్రతీ వార్డు లో హైడ్రోక్లోరైడ్‌ రసాయనాలను పిచికారి చేశారు. 

ఎల్బీనగర్‌..

సరూర్‌నగర్‌ రైతుబజార్‌ను విక్టోరియా మెమోరియల్‌ హోం మైదానంలో, ఎల్బీనగర్‌ కూరగాయల మార్కెట్‌ యార్డును సరూర్‌నగర్‌ ఇండోర్‌స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న పనులను ఆదివారం ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పరిశీలించారు. వనస్థలిపురం రైతుబజార్‌ను ట్రీ పార్కులో ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరానగర్‌ కాలనీ ప్రజలకు చైతన్యపురి పోలీసులు ఆహార పొట్లాలను అందజేయగా, మన్సూరాబాద్‌ డివిజన్‌ వీకర్‌సెక్షన్‌కాలనీలో నివాసముంటున్న బీహార్‌ రాష్ర్టానికి చెందిన పేదలకు కేబీఆర్‌ కన్వెన్షన్‌హాల్‌ తరపున ఎండీ కొప్పుల జనార్దన్‌ రెడ్డి, కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి రూ. 10 వేల నిత్యావసర సరుకులను అందజేశారు. ఎల్బీనగర్‌ పోలీసుల కోసం సీఐ అశోక్‌రెడ్డికి సోషల్‌ మీడియా సెల్‌ కోఆర్డినేటర్‌ ఆధ్వర్యంలో 500 శానిటైజర్ల బాటిళ్లను అందజేశారు. దినసరి కూలీలకు మెగాసిటీ పాఠశాల డైరెక్టర్‌ సుబ్బారెడ్డి సహకారంతో కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డి 5 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు.  

 మహేశ్వరం..

మహేశ్వరం, కందుకూరు, తుక్కుగూడ, జల్‌పల్లి మున్సిపాలిటీ, మీర్‌పేట, బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కరోనా నివారణకు బ్లీచింగ్‌ పౌడర్‌ను పిచికారి చేయిస్తున్నారు. ఆదివారం మేయర్‌ పారిజాత బడంగ్‌పేటలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.  

ముషీరాబాద్‌ ..

టీఆర్‌ఎస్‌ నాయకుడు ముఠా నరేశ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ప్రజలకు  ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ ముఠా పద్మనరేశ్‌ మాస్కులు పంపిణి చేశారు. కార్యక్రమంలో యువ నాయకుడు జైసింహ, శ్రీనివాస్‌ గుప్తా ఉన్నారు. ఇంటింటి సర్వే చేసి కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకటి స్థానిక వైద్యాధికారులకు సూచించారు. భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీలను సందర్శించి అధికారులతో మాట్లాడారు.కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్‌ కృష్ణమోహన్‌రావు డాక్టర్‌ దీప్తి, ఎస్‌పీహెచ్‌ఓ బాలాజీ సిబ్బంది పాల్గొన్నారు.తెలంగాణ రజక దోబీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బొమ్మరాజు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని రజక కాలనీలో నిరుపేదలకు బియ్యం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.  

 నాంపల్లి..

 కరోనా నిర్మూలనకు సర్కిల్‌ - 12 డిప్యూటీ కమిషనర్‌ ఇన్కెషాఫ్‌ అలీ, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్లు వాసిఫుద్దీన్‌,శ్రీనివాస్‌ విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించారు.  నియోజకవర్గంలోని మల్లేపల్లి అఫ్జల్‌సాగర్‌లోఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్‌ హుస్సేన్‌,నగర మాజీ మేయర్‌ ,మెహిదీపట్నం కార్పొరేటర్‌ మాజీద్‌ హుస్సేన్‌తో కలిసి  పేదలకు సరుకులు అందచేశారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఇబ్బంది లేకుండా హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోఉచిత కూరగాయల పంపిణీ చేశారు. వీ ఆర్‌ ది ఏంజిల్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ‘అక్షయ పాత్ర అన్నపూర్ణ సేవ’లో భాగంగా అన్నదానం చేశారు. మాసబ్‌ట్యాంక్‌ , విజయనగర్‌ కాలనీ , నాంపల్లి ఏరియా దవాఖాన ప్రాంతాలలో నిరాశ్రయులకు , రోగి సహాయకులకు భోజనం ప్యాకెట్లు , తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. 

 గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో క్రయవిక్రయాలకు అనుమతి

ఎల్బీనగర్‌ జోన్‌ బృందం: గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డుకు ఆదివారం వాటర్‌మిలన్‌ 50 వాహనాలు, సంత్రా 15 డీసీఎంలు, గ్రేప్‌ బాక్సులు 12వేలు, దానిమ్మ 100 బాక్సులు, మామిడి 30 టన్నులు వచ్చాయి. మార్కెట్‌ యార్డులో పండ్ల క్రయవిక్రయాలకు అనుమ తులు ఉన్నాయని అధికారులు కమీషన్‌ ఏజెంట్లతో పాటు రైతులకు సమాచారం అందిస్తున్నా రు.పండ్ల వాహనాలను ఆపకుండా ఉండేందుకు అత్యవసర సేవలు అందించే వారు ఫోన్‌ నంబర్లు 040-23450624, 04023450735 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు.

అవాస్తవాలు ప్రచారం చేస్తున్నవారిపై  కేసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సోషల్‌ మీడియాలో కరోనాపై ప్రజలను భయభ్రాంతులను గురిచేసే విధంగా పుకార్లను సృష్టిస్తూ వాటిని ప్రచారం చేస్తున్నవారిపై సైబర్‌ క్రైం పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు తాజాగా ఆదివారం రెండు సుమోటో కేసులను నమోదు చేశారు. ఆర్మీ వస్తున్నారు జాగ్రత్త ఇక కరోనా విషయంలో తీవ్రంగా ఉంటుందనే ఫేక్‌ న్యూస్‌ తయారుచేసి, కరోనా విషయంలో రెడ్‌జోన్లను ప్రకటించారంటూ కొన్ని ప్రాంతాల పేరుతో నకిలీ వార్తలు సృష్టించి వాటిని వివిధ మాధ్యమాలు, సోషల్‌ మీడియా ద్వారా ప్రచార వ్యాప్తి కల్పిస్తున్నారు.  ఈ రెండు విషయాలపై తాజాగా సుమోటో కేసులు నమోదయ్యాయి.


logo