ఆదివారం 07 జూన్ 2020
Hyderabad - Mar 29, 2020 , 23:57:26

నగరంలో నిత్యాన్న భోజనం

నగరంలో నిత్యాన్న భోజనం

సిటీబ్యూరో, ఖైరతాబాద్‌: రాష్ట్రంలో ఏ ఒక్కరూ పస్తులుండకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారని, ప్రతి రోజూ నగరంలో 45వేల మందికి భోజనం అందిస్తున్నామని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వెల్లడించారు. ప్రజలు బయటికి వెళ్లకుండా ఇళ్ల వద్దే  150 మొబైల్‌ వాహనాలతో కూరగాయలు విక్రయిస్తున్నామన్నారు. ఆదివారం ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్‌ పి. విజయారెడ్డి, జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, సర్కిల్‌-17 ఉప కమిషనర్‌ గీతారాధిక, ఏఎంవోహెచ్‌ డాక్టర్‌ భార్గవ నారాయణ తదితర అధికారులతో కలిసి ఖైరతాబాద్‌లో విస్తృతంగా పర్యటించారు. కరోనాతో వృద్ధుడు మరణించిన ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లో ఇంటింటికీ తిరుగుతూ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లో వంద ఇండ్లు, పక్కనే ఉన్న ఇందిరానగర్‌కాలనీలో మరో వంద మందిని నుంచి రక్తనమూనాలు సేకరించినట్లు తెలిపారు.  ప్రస్తుతం నగరంలో 18 ఎయిర్‌టెక్‌ మిషన్లు, పది జెట్టింగ్‌ మిషన్లుతో ప్రతి డివిజన్‌లో రసాయన ద్రావకాన్ని స్ప్రే చేయిస్తున్నామని, ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లోనూ ఇంటింటికీ వెళ్లి యాంటమాలజీ విభాగం వారు హ్యాండ్‌ స్ప్రే చేస్తున్నారన్నారు. 

హోం క్వారంటైన్‌లో....

నగరంలో సుమారు 18వేల మంది వివిధ దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారని, ఖైరతాబాద్‌ జోన్‌లోనే 2,500 మంది ఉన్నారన్నారు. వారిని హోం క్వారంటైన్‌లో పెట్టామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి  చొరవతో స్థానిక నివాసి నిరంజన్‌రావు బల్దియా పారిశుధ్య కార్మికులకు శానిటైజర్లు, మాస్కుల కోసం ఐదు లక్షల రూపాయల చెక్కును బొంతు రామ్మోహన్‌కు అందజేశారు.

మాగంటి ఆధ్వర్యంలో ప్రతిరోజూ 3 వేల మందికి...

బంజరాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తన క్యాంపు కార్యాలయంలో భోజనం తయారు చేయించి అవసరమైన వారికి పంపిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 3వేల మందికి సరిపడే భోజనం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని, పోలీసుశాఖ, జీహెచ్‌ఎంసీ, వైద్యశాఖతోపాటు అన్ని విభాగాలకు చెందిన సిబ్బందికి వీటిని పంపిస్తున్నామన్నారు. మధ్యాహ్నం, రాత్రిపూట ఎవరికైనా భోజనం కావాలంటే 9100677222, 9100877111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

రాజాసింగ్‌ ఆధ్వర్యంలో వెయ్యి మందికి...

అబిడ్స్‌: గోషామహల్‌ నియోజకవర్గంలో నిత్యం వెయ్యి మందికి భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేర్కొన్నారు. అన్నదానం కోసం చేస్తున్న వంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. 

శ్రామికులకు అండగా అధికారులు

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరాశ్రయులైన కార్మికులకు మేడ్చల్‌ జిల్లా అధికారులు అండగా నిలిచారు. జిల్లాలో సుమారు 5లక్షల వరకు కార్మికులుండగా, వారిలో సుమారు 14,411మంది ఇతర రాష్ర్టాలకు చెందినవారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నిరాశ్రయులైన 6,300 మందికి కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భోజనాలు, సుమారు 1700 మందికి బియ్యంతోపాటు నిత్యావసర సరుకులను ఉచితంగా అందించారు. అలాగే 300 మందికి షెల్టర్‌, 201మందికి వైద్య సౌకర్యాలను కల్పించారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న సుమారు 2700 మంది కార్మికులకు షెల్టర్‌తోపాటు భోజన వసతి కల్పిస్తున్నామని జిల్లాలోని కీసర, మల్కాజిగిరి ఆర్డీవోలు తెలిపారు. 

నిరాశ్రయులైన కార్మికులకు, నిరుపేదలకు ప్రతిరోజూ 500మందికి భోజనాలను ఉచితంగా అందించనున్నట్లు కూకట్‌పల్లిలోని డీఆర్‌ఎస్‌ స్కూల్‌ నిర్వాహకుడు అంజనీకుమార్‌ తెలిపారు. 

  • హైదరాబాద్‌  పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌,దానం నాగేందర్‌,ముఠా గోపాల్‌, ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, ప్రజలకు శానిటైజర్లు పంపిణీ చేశారు.  
  • లాక్‌డౌన్‌తో ఉపాధి లేక పస్తులుంటున్న కుటుంబాలకు టీఎన్జీఓ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎం ముజీబ్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో క్యాన్సర్‌ దవఖానాలో రోగుల వద్ద ఉండే అటెండెంట్లకు ప్రతిరోజూ అన్నదానం చేస్తున్నారు. 
  • రామంతాపూర్‌, హబ్సిగూడలోఉన్న నిరుపేదలైన వెయ్యి కుటుంబాలకు  మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ 15 క్వింటాళ్ల బియ్యం, 4 క్వింటాళ్ల గోధుమలు, 6 క్వింటాళ్ల కందిపప్పు, 100 లీటర్ల మంచినూనెను పంపిణీ చేశారు.  


logo