గురువారం 28 మే 2020
Hyderabad - Mar 28, 2020 , 23:00:04

ఫీవరాస్పత్రిలో మరో ఐసొలేషన్‌ వార్డు

ఫీవరాస్పత్రిలో మరో ఐసొలేషన్‌ వార్డు

అంబర్‌పేట :  నల్లకుంటలోని ఫీవరాస్పత్రిలో మరో ఐసొలేషన్‌ వార్డు సిద్ధమైంది. 32 పడకలతో దీనిని అందుబాటులోకి తెచ్చారు.  ఇటీవల స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చిన దంపతులు ఫీవర్‌ ఆస్పత్రికి రాగా, భార్యకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమెను ఎర్రగడ్డలోని ఛాతి వైద్యశాలకు పంపించేందుకు ప్రయత్నించగా, అక్కడ బెడ్లు ఖాళీ లేకపోవడంతో ఇక్కడే ఉంచారు.  కొవిడ్‌-19 అనుమానితులు ఆమెను తాముండే వార్డులో ఉంచేందుకు అంగీకరించకపోవడంతో చేసేది లేక అప్పటికే ఐసొలేషన్‌ వార్డుగా సిద్ధమవుతున్న నంబర్‌ 8కు తరలించారు. అక్కడ వసతులు ఉన్నా..బెడ్లు మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో సదరు మహిళ తాను ఉన్న చోట  ఎలాంటి సౌకర్యాలు లేవంటూ.. వీడియో చిత్రీకరించి వైరల్‌ చేయడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.  ఇదే విషయమై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ వివరణ ఇస్తూ... పాజిటివ్‌ వచ్చిన ఆ మహిళకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశామని, మరుసటి రోజు ఉదయాన్నే ఛాతి వైద్యశాలకు పంపించినట్లు చెప్పారు. పక్క వార్డులో ఆమె భర్త కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందించిన వార్డును పూర్తిస్థాయిలో ఐసొలేషన్‌గా సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 


logo