మంగళవారం 02 జూన్ 2020
Hyderabad - Mar 28, 2020 , 22:56:06

177 సంచార రైతు బజార్లు

177 సంచార రైతు బజార్లు

  • ఇంటి ముంగిటకే కూరగాయలు
  • ఆందోళన చెందొద్దు
  • అన్ని ప్రాంతాల్లో  విక్రయాలు
  • సామాజిక దూరం పాటించాలి
  • మేయర్‌ బొంతు రామ్మోహన్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కూరగాయలు ప్రజల ముంగిటే తెచ్చేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా మొబైల్‌ రైతు బజార్లను అందుబాటులోకి తెచ్చారు. 177 ఈ తరహా వాహనాల ద్వారా శనివారం నగరంలోని 331 ప్రాంతాల్లో కూరగాయలు విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే రైతు బజార్లు, కూరగాయల మార్కెట్ల వద్ద ఒకేసారి జనం గుమిగూడకుండా సామాజిక దూరం పాటించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రజలు మార్కెట్ల వద్ద గుమిగూడకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇళ్ల వద్దకే కూరగాయలు విక్రయించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం చంద్రశేఖర్‌రావు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ సహకారంతో శనివారం మొబైల్‌ రైతు బజార్లను రంగంలోకి దింపారు. అంతేకాదు, ఎక్కువ ధరలకు విక్రయించకుండా ఉండేలా ఆయా కూరగాయలకు ధరలను నిర్ధారించడంతోపాటు ఏఏ సమయాల్లో ఎక్కడ విక్రయించాలో కూడా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఏ ఒక్క ప్రాంతం తప్పిపోకుండా అన్ని ప్రాంతాల్లో విక్రయాలు సాగే విధంగా తగిన చర్యలు తీసుకున్నారు. ఉదయం పది గంటలనుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విక్రయించేలా తగిన ప్రణాళికను రూపొందించారు. కాగా శనివారం వనస్థలిపురం, సరూర్‌నగర్‌, ఫలక్‌నుమా, మెహిదీపట్నం, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, ఎల్లమ్మబండ, అల్వాల్‌, మీర్‌పేట్‌, మేడిపల్లి, గుడిమల్కాపూర్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో మొబైల్‌ రైతు బజార్ల ద్వారా కూరగాయలను విక్రయించారు. 

 దూరం పాటిస్తూ కొనుగోళ్లు..

ప్రజలు గుమిగూడకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీకి చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది ముందుగానే ఆయా మార్కెట్లు, మొబైల్‌ రైతుబజార్ల వద్ద మార్కింగ్‌ చేశారు. వినియోగదారులు వరుస క్రమంలో తగిన దూరం పాటిస్తూ కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా పలు మార్కెట్ల వద్ద సిబ్బంది స్వయంగా వరుస క్రమాన్ని పర్యవేక్షించారు. అన్ని ప్రాంతాల్లోనూ మొబైల్‌ రైతు బజార్ల ద్వారా కూరగాయల విక్రయాలు సాగుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. సామాజిక దూరం  తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.


logo