శనివారం 30 మే 2020
Hyderabad - Mar 28, 2020 , 22:53:31

ఆశ్రయమిచ్చి.. ఆకలి తీర్చి...

ఆశ్రయమిచ్చి..  ఆకలి తీర్చి...

  • ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన బిల్డర్లు 
  • బల్దియా సమన్వయంతో 168 ప్రాంతాల్లోలేబర్‌  క్యాంపుల ఏర్పాటు 
  • కష్టజీవులకు కడుపు నిండా భోజనం, వసతి 
  • 25వేలమందికిపైగా కార్మికులకు ఆహారం, సౌకర్యాల కల్పన

రెక్కాడితే గానీ.. డొక్కాడని బడుగు జీవులు వారు..పని ఉంటేనే.. పూటగడిచేది. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ రం గంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. ఇం దులో అనేక మంది ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారే . లాక్‌డౌన్‌తో కొన్ని  నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడడమే కాకుండా రాకపోకలు నిలిచిపోవడంతో  కార్మికులంతా ఇక్కడే ఉండిపోయారు. దీంతో వారిని ఆదుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన బిల్డర్లు..బల్దియా సమన్వయంతో ఆయా నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో 168 లేబర్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఏ కార్మికుడూ  పస్తులుండకుండా వసతి కల్పించి.. కడుపునిండా భోజనం పెడుతున్నారు. శిబిరాల్లో 25వేలకుపైగా మేస్త్రీలు, కూలీలు ఆశ్రయం పొందుతుండగా, వారికి కల్పిస్తున్న సౌకర్యాలను టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  భవన నిర్మాణ రంగంలో వివిధ రకాల విధులు నిర్వహించే మేస్త్రీలు, కూలీల సంక్షేమం కోసం బిల్డర్లు, వివిధ ఏజెన్సీల ఆధ్వర్యంలో నగరంలోని 168 ప్రాంతాల్లో లేబర్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఆయా ఏజెన్సీలు నిర్మాణం చేస్తున్న భవనాలు, సైట్ల వద్దే వీటిని ఏర్పాటు చేసి భోజనం, ఇతర కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. 25వేలకుపైగా మేస్త్రీలు, కూలీలు వీటిల్లో ఉండగా, వీరికి కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులను పర్యవేక్షకులుగా నియమించారు.నగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం అత్యంత ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అత్యంత వేగంగా, భారీ స్థాయిలో విస్తరిస్తున్న ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు. తాపీ మేస్త్రీల దగ్గర్నుంచి మార్బుల్స్‌, టైల్స్‌ పనులు, కార్పెంటర్స్‌, ఫ్యాబ్రికేషన్‌ వర్క్స్‌, ప్లంబర్స్‌, పెయింటింగ్‌, మట్టి పని చేసే వారు ఇలా అనేక మంది ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఒడిశా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ర్టాల వారు ప్రముఖంగా ఉన్నారు. వీరిలో కొందరు నిర్మాణాలు జరిగే పరిసర ప్రాంతాల్లోనే ఇండ్లను అద్దెకు తీసుకొని జీవిస్తుండగా, ఎక్కువ శాతం మంది నిర్మాణ సైట్లలోనే గుడిసెలు నిర్మించుకొని ఉంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రాకపోకలు నిలిచిపోవడం, కొన్ని రకాల నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడడంతో వీరు తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేక ఇక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలోని కూలీలను ఆదుకోవాలని ఇటీవల మంత్రి కేటీఆర్‌ అటు నిర్మాణదారులకు, ఇటు అధికారులకు విజ్ఞపి ్తచేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు బిల్డర్లందరినీ సమన్వయం చేసి వారి సైట్ల వద్దే లేబర్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కార్మికులకు ఉచితంగా భోజనం, ఇతర కనీస సౌకర్యాలను సమకూర్చే విధంగా తగిన ఏర్పాట్లు చేశారు. ఇవి సక్రమంగా అమలు జరుగుతున్నాయో, లేదా అనేది పర్యవేక్షించేందుకు టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో క్యాంపులో కనిష్ఠంగా ఎనిమిది మంది నుంచి 2000 మంది వరకూ ఉండడం విశేషం.

కొన్ని ముఖ్యమైన లేబర్‌ క్యాంపులు 

  అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నల్లగండ్లలోని అపర్ణ జెనిత్‌లో 2000 మంది. అదే సంస్థ ఆధ్వర్యంలో షేక్‌పేట్‌ అపర్ణ వన్‌లో 1200 మంది. కొండాపూర్‌లోని అపర్ణ సెరేన్‌ పార్క్‌లో 500 మంది. బీఎస్‌ఆర్‌ బిల్డర్స్‌ ఎల్‌ఎల్‌పీ ఆధ్వర్యంలో నానక్‌రామ్‌గూడలోని బీఎస్‌ఆర్‌ టెక్‌ పార్క్‌లో 1100 మంది. మూసాపేట్‌ ప్రాజెక్ట్స్‌లో 800 మంది. టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మెయిన్‌రోడ్డులో మలేషియన్‌ టౌన్‌షిప్‌ పక్కన ఉన్న వన్‌ సిటీ ప్రాజెక్ట్‌లో 710 మంది. జేఎంసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో బొల్లారం-తుర్కపల్లి రోడ్డులో బొల్లారం రైల్వే స్టేషన్‌ వద్ద వీబీ సిటీ ప్రాజెక్ట్స్‌లో 600 మంది. శ్రీకాంత్‌ బిల్డర్స్‌ ఆధ్వర్యంలో రాయదుర్గంలో పల్లేడియమ్‌ ప్రాజెక్టులో 500మంది. రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నల్లగండ్లలోని రాంకీ వన్‌ గెలాక్సియాలో 500 మంది. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని హిల్‌ క్రెస్ట్‌లో పసిఫికా కంపెనీస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేబర్‌ క్యాంపులో 484 మంది. షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఎవెన్యూ బిజినెస్‌ హబ్‌లో 450 మంది. ఎస్‌వీఎస్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఉప్పల్‌లోని ఎన్‌ఎస్‌ఎల్‌ ఈస్ట్‌ కౌంటీలో 400 మంది. వాసవీ రియల్టర్స్‌ ఎల్‌ఎల్‌పీ ఆధ్వర్యంలో హఫీజ్‌పేట్‌లోని వాసవీ లేక్‌ సిటీలో 400 మంది. వాసవీ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌లోని వాసవి శ్రీనిలయంలో మరో 400 మందికి లేబర్‌ క్యాంపును ఏర్పాటు చేశారు. 


logo