శనివారం 30 మే 2020
Hyderabad - Mar 27, 2020 , 23:23:09

అన్నార్థుల ఆకలి తీర్చి..

అన్నార్థుల ఆకలి తీర్చి..

  • పేదల కడుపునింపుతున్న అన్నపూర్ణ కేంద్రాలు
  • ఆపత్కాలంలో ఉచితంగా భోజనం
  • హర్షం వ్యక్తం చేస్తున్న నిరాశ్రయులు

ఆపత్కాలంలో అన్నార్థుల ఆకలి తీర్చుతున్నాయి అన్నపూర్ణ కేంద్రాలు. పేదలకు రూ. 5 కే  మధ్నాహ్న భోజనం అందించే కేంద్రాలు.. లాక్‌డౌన్‌ నేపథ్యం ఉచితంగా అన్నం పెడుతూ కడుపునింపుతున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, కూలీలు, యాచకులకు ఉచితంగా భోజనం అందిస్తున్నాయి. కాగా  రాత్రి  పూట కూడా 50 కేంద్రాలను కొనసాగించి ఆకలితో అలమటించే వారికి ఊరట కల్పించాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. 2014 మార్చి 2న నాంపల్లిలో అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌ చేతుల మీదుగా ప్రారంభమైన పథకం నగరంలో 150 కేంద్రాలుగా విస్తరించి విజయవంతంగా కొనసాగుతూ పథకం  ఆరేండ్లు పూర్తి చేసుకున్నది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎందరికో అన్నం పెడుతూ ఆకలి తీర్చుతున్నాయి. 

ఉచిత భోజనం..

అరటి పండ్ల వ్యాపారం చేస్తున్నాను. పండ్ల వ్యాపారులు తెరిచిపెట్టుకోవచ్చని చెప్పడంతో వ్యాపా రం చేస్తున్నాను. ఇంటి నుంచి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వెళ్లేవాడిని. కానీ ఇప్పుడు ఇక్కడే భోజనం చేశా. అన్నపూర్ణ కేంద్రంలో ఉచితంగా మధ్యాహ్నం భోజనం పెట్టిస్తున్న ప్రభుత్వ పనితీరు బాగుంది.

-ఫిరోజ్‌, కొంపల్లి, అరటి పండ్ల వ్యాపారి 

పేదల కోసం..

కరోనా వైరస్‌ ప్రభలకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ సందర్భంగా ఆహారం అందని పేదలకు అన్నపూర్ణ పథకంలో ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయం. గత వారం రోజులుగా ఆహారం అందకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేయడం అభినందనీయం. 

-మందుల మల్లేశ్‌ 

రుణపడి ఉంటాం..

పేదల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం. కరోనా వైరస్‌ సందర్భంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు సరైన ఆహారం అందించేందుకు సీఎం కేసీఆర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ చర్యలు తీసుకోవడం హర్షణీయం. పేదలను గుర్తించి వారికి ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోవడంతో వారికి రుణపడి ఉంటాం. 

-లక్ష్మయ్య, సెంట్రింగ్‌ కార్మికుడు 

దవాఖానకు వచ్చిన..

గాంధీ దవాఖానకు వచ్చి మూడు నెలలు అవుతున్నది. నా కొడుకు అడ్మిట్‌ అయ్యి చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 22 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దవాఖానలో నా భార్యకు, కొడుక్కి భోజనం పెడుతున్నారు. బయట ఉండే మాలాంటి వారికి అన్నం దొరకడం కష్టమైంది. హోటళ్లు బంద్‌ అయ్యాయి.   

-ప్రభుదాస్‌, తాండూరు 

అన్నం విలువ తెలిసింది

అన్నం విలువ ఏమిటో మాకు ఇప్పుడు తెలిసింది. రెండు రోజులు పస్తులుంటే మమ్మల్ని పట్టించుకున్నవారే లేరు. కరోనా భయంతో ఎవరి ఇండ్లలో వారే ఉండిపోయారు.  గాంధీ దవాఖాన వద్ద ఎందరో నిరాశ్రయులు ఉంటున్నారు. వారి ఆకలి తీర్చేదెవరు. మా బాధలను గుర్తించి, ప్రభుత్వం ఉచిత భోజనం అందించడం అభినందనీయం.

-ఆశీర్వాదం, మేడ్చల్‌

భోజనం బాగుంది

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ పథకంలో భాగంగా అందిస్తున్న భోజనం చాలా బాగుంది. ఈ పరిస్థితుల్లో రోజువారీ పనిచేసుకునే మాలాంటి వారికి జీవనం సాగించడం చాలా కష్టంగా మారింది. ఈ తరుణంలో ప్రభుత్వం అన్నపూర్ణ భోజనం ఉచితంగా అందించడం శుభపరిణామం.

-రాజు, చిరువ్యాపారి, కవాడిగూడ

కడుపునింపుకుంటున్నాం..

లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు అన్నం దొరకడం చాలా కష్టం అయ్యింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అన్నదానం చేయడం చాలా మంచి పని. ఇక్కడ దొరికే భోజనంతో కడుపు నింపుకుంటున్నాం. ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు పేదల కడుపునింపుతాయి.

 -జాహెద్‌, హోటల్‌ కార్మికుడు

బువ్వపెడుతున్న పుణ్యాత్ముడు కేసీఆర్‌

కర్ఫ్యూ ఉండటంతో పని ఎక్కడ దొరకడం లేదు. ప్రతి రోజూ అడ్డమీద ఉండి వెళ్తున్నాను. సాయంత్రం వరకు అడ్డ మీదనే ఉన్నప్పటికీ ఎవ్వరూ పనికి తీసుకెళ్లడం లేదు. పనిలేక, డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న కష్ట కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉచితంగా బువ్వ పెట్టి పుణ్యం కట్టకున్నాడు.

-నిరంజన్‌, కూలీ

ఉచితంగా భోజనం 

దుకాణాల్లో పని చేసే మాలాంటి వాళ్లకు పొట్ట గడవడం కష్టంగా ఉంది. పేద ప్రజల ఇబ్బందులు చూసి ప్రభుత్వం ఉచితంగా భోజనం పెట్టడం మంచిగా ఉంది. మాలాంటి వారందరూ బంద్‌ సమయంలో ఉచితంగా భోజనాలు పెడుతుండటంతో ఇక్కడికే వచ్చి రోజు తింటున్నాం. 

-ఆనంద్‌

ఆకలి తీర్చుతున్నారు.

నేను ఇక్కడే  గుడిసెలో ఉంటా. కూలీ చేసుకొని బతుకుతున్నం. పైసలు లేకుండా ఇక్కడ గవర్నమెంట్‌ మధ్యాహ్నం అన్నం పెడుతున్నది. ఇప్పుడు అన్ని బంద్‌ ఉన్నయి. ఈ టైమ్‌లో ఉచితంగా అన్నం పెట్టడంతో రోజు ఇక్కడకు వచ్చి తింటున్న. ఆకలి తీర్చుకుంటున్నాను. 

-లక్ష్మమ్మ, బతుకమ్మకుంట

అన్నం బాగుంది 

కేసీఆర్‌ సారు ప్రభుత్వం మా లాంటి వారి కోసం ఉచితంగా బువ్వ పెట్టిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ కేసీఆర్‌ పేదల పెద్దన్నగా మారిండు. తమకు పుణ్యానికి భోజనం దొరుకుతుందని అనుకోలేదు. ప్రభుత్వం పెడుతున్న బువ్వ బాగుంది. ఇలాంటి ఇబ్బందికర సమయంలో సర్కారు పేదలను ఆదుకోవడం అభినందనీయం.

-ఎల్లవ్వ

 నాలుగు రోజులుగా..

మూడు నాలుగు రోజుల నుంచి  తిండి దొరుకడం లేదు. ఎవరన్న పుణ్యాత్ములు భోజనం అందిస్తుంటేనే నా కడుపు నింపుకుంటున్న. సర్కారు అన్నం నిన్నటి నుంచే పెడుతున్నారు. నాలాంటి చాలా మంది ఆకలి తీరుస్తున్నారు.  ఈ వైరస్‌ గురించి అంతగా తెల్వదు గానీ..రోడ్లన్ని ఖాళీ అయినయ్‌. సర్కారు అన్నం బంద్‌ కాకుండా చూడాలి.

- వెంకటయ్య

వలస వచ్చాం..

మహారాష్ట్ర నుంచి బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి మార్బుల్‌ పని చేస్తున్నాను. లాక్‌డౌన్‌ కారణంగా గుత్తేదారు పని బంద్‌ పెట్టాడు. దీంతో ఇబ్బంది పడుతున్న నాకు ప్రభుత్వం అందించే భోజనంతో కడుపు నింపుకుంటున్నాం. మధ్యాహ్న బోజన పథకం నా ఆకలి తీర్చి ఎంతో ఆసరా అయింది. 

-కృష్ణ, కార్మికుడు 

ఇబ్బంది లేకుండా..

గత కొన్ని రోజులుగా హోటళ్లు బంద్‌ అయ్యాయి. సీఎం క్వాటర్స్‌లో డ్యూటీలో ఉంటున్నాను. ఇంటి నుంచి భోజనం తెచ్చుకోలేక, హోటళ్లు బంద్‌ కావడంతో అనేక ఇబ్బందులు పడ్డాం. అన్నపూర్ణ భోజనం ప్రారంభించడంతో ఇబ్బందులు తప్పాయి.

-ఎలమంచయ్య

కొంపల్లికి రాగానే..

 లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మాకు పని లేకపోయింది.  రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇంటికి కాలి నడకన బయలుదేరాం. ఉదయం 8 గంటలకు బయలుదేరగా మధ్యాహ్నం 12:30 గంటలకు కొంపల్లి వరకే చేరాం. కొంపల్లికి రాగానే మార్గ మధ్యలో అన్నపూర్ణ కేంద్రం ఉండగా అందరం కలిసి భోజనం చేశాం. ఉచితంగా అన్నం పెడుతున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. 

-సాయిలు

క్లిష్ట పరిస్థితుల్లోనూ.. 

దేశమే లాక్‌డౌన్‌లో ఉంది.  ఇలాంటి పరిస్థితుల్లో బయట మంచినీళ్లు దొరుకుతాయనుకోవడమే అత్యాశనుకుంటున్న సమయంలో ప్రభుత్వం కడుపునిండా అన్నం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. నిత్యావసర సరుకుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఆకలితో ఉన్నవారి కోసం అన్నపూర్ణ కేంద్రాల్లో అన్నం పెట్టడం సంతోషకరం.

-రాజేశ్‌, ఫుడ్‌ డెలివరీ బాయ్‌

రుణపడి ఉంటాం

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో  ప్రభు త్వం మాలాంటి పేద వారి ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ కేంద్రాలను కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది. కరోనా భయంతో ప్రజలు రోడెక్కేందుకు భయపడుతున్నా సమయంలో ఇండ్లకు చేరుకోలేని వారి కోసం అన్నపూర్ణ కేంద్రాలను తెరచి ఉంచే ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. 

-సలీం, కూలీ

అలమటిస్తున్నాం..

 కరోనా వైరస్‌ కారణంగా హోటల్స్‌ అన్నీ మూతపడ్డాయి. రోడ్లపై నివసించే పేదవారు ఇంట్లో వండుకోవడానికి వసతులు లేనివారు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచితంగా భోజనం పెట్టడం సంతోషంగా ఉంది.

- సూర్యనారాయణరాజు, కేపీహెచ్‌బీ కాలనీ 


logo