శనివారం 06 జూన్ 2020
Hyderabad - Mar 27, 2020 , 23:15:52

ఇంట్లోనే సేఫ్‌..!

ఇంట్లోనే సేఫ్‌..!

  • స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష
  • కరోనా వైరస్‌ నివారణకు
  •  ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది 
  • అన్ని శాఖల అధికారులు సమన్వయంతో
  •  పనిచేసి సమస్యలపై సకాలంలో స్పందించండి : మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ 

సిటీబ్యూరో/ అంబర్‌పేట/ చిక్కడపల్లి, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని పశు సంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు అవగాహన కల్పించడంపై శుక్రవారం నార్త్‌జోన్‌ పరిధిలోని అంబర్‌పేట, ముషీరాబాద్‌ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి వేర్వేరుగా సమీక్షాసమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయని, ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు కరోనా నిర్మూలన, వ్యాప్తిని అడ్డుకునేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారని, అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కూరగాయలు, పాలు తదితర నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడంపై చర్చించినట్లు తెలిపారు. నగరంలోని 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచిత భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇవే కాకుండా ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీతో పాటు 1500 రూపాయల నగదును నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం అందించనున్నట్లు వివరించారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించడం వల్లనే కరోనాను అరికట్టవచ్చని తెలిపారు. కార్పొరేటర్లు, అధికారులు కరోనాపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కార్పొరేటర్లు కృషి చేయాలని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలపై సకాలంలో స్పందించాలని కోరారు.


logo