గురువారం 28 మే 2020
Hyderabad - Mar 27, 2020 , 23:07:11

ఎందుకీ నిర్లక్ష్యం..?

ఎందుకీ నిర్లక్ష్యం..?

  • కేసులు పెట్టినా.. పాస్‌పోర్టు రద్దుచేసినా.. మారరా..?
  • వినకపోతే అంతే సంగతులు
  • హోం క్వారంటైన్‌లో 6200 మంది..
  • ప్రభుత్వ క్వారంటైన్‌లో 13వేల పైచిలుకు
  • నిబంధనలు ఉల్లంఘించిన17మంది ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలింపు
  • ప్రతిరోజు ఇండ్లను తనిఖీ చేస్తున్న జీహెచ్‌ఎంసీ
  • సమీప జనం అప్రమత్తంగా ఉండాలని సూచన
  • బయట కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలుచేస్తుంటే కొందరు హోం క్వారంటైన్‌లో ఉండాల్సినవారు బయట తిరుగుతున్నారు. నగరంలోని వివిధ జోన్లలో ఇప్పటివరకు 17మందిని అధికారులు పట్టుకొని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించడమే ఇందుకు నిదర్శనం. కొందరు ఇలా చేయడంవల్ల ఇతరుల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉండడమే కాకుండా కరోనా వ్యాప్తిని అదుపుచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషికి ఆశించినస్థాయిలో ప్రయోజనం ఉండడంలేదు.

 సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విదేశాలనుంచి వచ్చినవారికి చేతిపై హోం క్వారంటైన్‌ ముద్రవేస్తూ వారిని ఇదివరకే ఇండ్లకు పంపిన అధికారులు గడిచిన పదిరోజులుగా వారిపై నిఘా ఉంచిన విషయం విధితమే. ఇలా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 6200 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మొత్తం 20వేలమందివరకూ విదేశాలనుంచి వచ్చినవారు ఉండగా, అందులో 13వేలమందికిపైగా ప్రభుత్వ క్వారంటైన్‌లలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్నవారికి బయటకు వెళ్లే ఆస్కారం లేదు. కాగా, హోం క్వారంటైన్‌లో ఉన్నవారు మాత్రం బయటకు రాకుండా 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. వారి ఆరోగ్యంతోపాటు వారి కుటుంబ సభ్యులు, ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ విధమైన నిబంధనలు విధించారు. అంతేకాదు, వీరు నిబంధనలు పాటిస్తున్నారా, లేదా అనేది తెలుసుకునేందుకు వార్డులవారీగా జీహెచ్‌ఎంసీ, వైద్యశాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రతిరోజు వారి ఇండ్లను తనిఖీచేస్తున్నారు. కాగా, ఇలా క్రమశిక్షణతో హోం క్వారంటైన్‌ నిబంధనలు పాటించాల్సి ఉన్నప్పటికీ కొందరు ఉల్లంఘిస్తున్నారు. 

14రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి

ఒంట్లో కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ అవి వెంటనే బయటపడకపోగా, వారు ఎవరెవరిని కలిస్తే వారికి కూడా వ్యాధి సోకే అవకాశముందని వైద్య నిపుణులు పేర్కొనడంతో విదేశాలనుంచి వచ్చినవారు తప్పనిసరిగా 14రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతరులకు వ్యాధి సోకకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్వారంటైన్‌ నిబంధనను కఠినంగా అమలుచేస్తున్నది. నిబంధనలను పాటించకపోతే ముప్పు తప్పదని, అటువంటివారిని బలవంతంగా ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించడంతోపాటు కేసులు కూడా నమోదుచేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవడమే కాకుండా అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తామని వారు స్పష్టంచేస్తున్నారు.

17 మంది ఉల్లంఘనులు

 విదేశాలనుంచి నగరానికి వచ్చి హోం క్వారంటైన్‌ నిబంధనలను పాటించని 17మందిని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. ఇందులో కూకట్‌పల్లి జోన్‌ పరిధి నుంచి ఆరుగురు ఉండగా, చార్మినార్‌ జోన్‌ నుంచి ఆరుగురు, శేరిలింగంపల్లి జోన్‌ నుంచి నలుగురు, ఖైరతాబాద్‌ జోన్‌ నుంచి ఒకరు ఉన్నారు. విదేశాలనుంచి వచ్చాక 14రోజులపాటు ఖచ్చితంగా హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తూ చేతిపై ముద్ర వేసి పంపినప్పటికీ వీరు ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారు. సదరు వ్యక్తులపై నిఘా ఉంచడంతో పాటు అధికారులు ప్రతిరోజు వారి ఇండ్లను రెండుదఫాలు తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా ఇరుగు-పొరుగు వారినుంచి కూడా సమాచారం రాబడుతున్నారు. హోం క్వారంటైన్‌ ఉన్నట్లు పేర్కొనే నోటీసులు కూడా వారి ఇండ్ల తలుపులకు అంటించారు. ఈ నేపథ్యంలో వివిధ జోన్ల పరిధిలో 17మంది నిబంధనలు పాటించకుండా బయటకు వస్తున్నట్లు సమాచారం అందడంతో వారిని ప్రభుత్వం గచ్చిబౌలీ, రాజేంద్రనగర్‌తోపాటు జోన్లవారీగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌లకు తరలించారు.


logo