సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Mar 27, 2020 , 23:07:10

నగరమంతా స్ప్రే

నగరమంతా స్ప్రే

  • సగం రోడ్లపై పిచికారి పూర్తి 
  • మిగిలిన దారుల్లో నెలాఖరు వరకు
  • ఆ తర్వాత రెండో దశ స్ప్రేయింగ్‌
  • నగరంలో 50శాతం స్ప్రేయింగ్‌ పూర్తి
  • సమస్యాత్మక ప్రాంతాలే లక్ష్యంగా..  జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రసాయనాలు పిచికారి
  • 31లోగా మొదటి దశ పూర్తి.. ఆ తరువాత రెండోదశ మొదలు
  • జలమండలి ఆధ్వర్యంలో.. రిజర్వాయర్ల చుట్టూ.. 
  • ఉద్యోగులు, సిబ్బందికి మాస్కులు పంపిణీ 
  • కరోనా కట్టడికి తగిన జాగ్రత్త చర్యలు 

కరోనా కట్టడిలో భాగంగా నగరంలోని సగం మేర రోడ్లపై హైపో క్లోరైట్‌ ద్రావణం పిచికారి చేశారు. ఈ నెలాఖరు వరకు మిగిలిన సగం కూడా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత రెండో దశ పిచికారి చేపట్టాలని నిర్ణయించారు. కరోనా కేసులు గుర్తించిన ప్రాంతాలు, అనుమానితుల నివాస ప్రాంతాల్లో రసాయనాలు విస్తృతంగా స్ప్రే చేస్తున్నారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా క్రిమి కీటకాలను, ప్రమాదకర వైరస్‌ను నాశనం చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా వీధులను సోడియం హైపోక్లోరైడ్‌ రసాయనాలతో శుభ్రంచేస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా కరోనా కేసులు గుర్తించిన ప్రాంతాలు, అనుమానితులు నివసించిన ప్రాంతాలే లక్ష్యంగా చేసుకొని వీధులు, వారున్న సమీప ప్రాంతాల్లో విస్తృతంగా రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీకి చెందిన ఎంటమాలజీ విభాగంతోపాటు విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) విభాగం ఆధ్వర్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో వివిధ పద్ధతుల ద్వారా సోడియం హైపోక్లోరైడ్‌ను స్ప్రే చేస్తున్నారు. మ్యాన్యువల్‌ స్ప్రేలు, పవర్‌ స్ప్రేలు, జెట్టింగ్‌ యంత్రాలు, ఫైర్‌ ఇంజన్లు, నీటి ట్యాంకర్ల ద్వారా విస్తృతంగా పిచికారీ చేస్తున్నారు. దాదాపు 50శాతం ప్రధాన రోడ్లపై ఈ రసాయనాల పిచికారి పూర్తయినట్లు, వచ్చే నాలుగు రోజుల్లో మిగిలిన ప్రాంతాలన్నీ పూర్తిచేస్తామని అధికారులు ధీమా వ్యక్తంచేశారు. అనంతరం రెండో దశ పిచికారి మొదలుపెట్టి సమస్య తీరేవరకు కొనసాగిస్తామని వారు వివరించారు. 

జలమండలి ఆధ్వర్యంలో...

కరోనా వ్యాధి నివారణ నేపథ్యంలో జలమండలి జాగ్రత్త చర్యలు ముమ్మరం చేసింది. ఖైరతాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు డివిజన్‌ కార్యాలయాల చుట్టూ సోడియం హైపోక్లోరైడ్‌ రసాయనాలను పిచికారి చేయనున్నారు. రిజర్వాయర్‌ గోడలతో పాటు కార్యాలయ గదులు, రెయిలింగ్‌, మూత్రశాలలు, వాహనాలు, క్యాష్‌ కౌంటర్లపైన పిచికారి చేయడం ద్వారా క్రిమికీటకాలను నిర్మూలించనున్నారు. నెలకు గానూ 7వేల లీటర్ల హైపోక్లోరైడ్‌ను సిద్ధం చేశారు. ఇందులో 5వేల లీటర్లు సివర్‌ క్లీనింగ్‌ మిషిన్లకు, 2వేల లీటర్లు కార్యాలయాలకు కేటాయించనున్నారు. ప్రతి డివిజన్‌ పరిధిలో రెండు బృందాలు ఈ రసాయనాలను స్ప్రే చేస్తాయి. పారిశుధ్య పనులు చేపట్టిన చోట తప్పనిసరిగా ఈ పిచికారి చేయనున్నారు. ప్రతి ఎయిర్‌టెక్‌ యంత్రంతో పాటు ఒకరూ రసాయనాలను పిచికారి చేయడానికి అందుబాటులో ఉంటారు. సిబ్బంది ఆరోగ్యం దృష్ట్యా వారికి రక్షణ కవచాలు అందుబాటులో ఉంచనున్నారు. వీటితో పాటు కార్యాలయాల ప్రాంగణంలో శానిటైజర్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇక  క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, లైన్‌మెన్లు, సీవరేజీ సిబ్బంది, ఎయిర్‌టెక్‌ మిషన్‌ సిబ్బంది, ట్యాంకర్‌ సిబ్బంది అందరికీ తాత్కాలిక పాసులు, వ్యక్తిగత పాసులు, వెహికిల్‌ పాసులు అందజేసి సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కార్మికులు, అధికారులకు మాస్కులు, గ్లౌజులు వంటి భద్రతా పరికరాలను అందజేయనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మూడొంతుల నీటిలో ఒక వంతు సోడియం హైపోక్లోరైట్‌ను కలిపి పిచికారి చేయనున్నామని అధికారులు పేర్కొన్నారు.. ఇది క్రిమిసంహారక గుణం కలిగి ఉంటుందని, ఉపరితలంపై 12నుంచి 14గంటల వరకు ప్రభావం చూపుతుందని, ఎటువంటి బ్యాక్టీరియానైనా నిర్మూలిస్తుందని అధికారులు తెలిపారు. ఇది ఎంతో సురక్షితమైనదని, క్రిమిసంహారణకోసం క్లోరిన్‌ వాయువు వలె పనిచేస్తుందని చెప్పారు. కాగా నగర వ్యాప్తంగా వైరస్‌ ప్రబలకుండా జీహెచ్‌ఎంసీ ప్రత్యేకమైన రసాయనాన్ని స్ప్రే చేసేందుకు జలమండలి పరిధిలోకి 20 ఎయిర్‌టెక్‌ యంత్రాలను జీహెచ్‌ఎంసీ డిజార్టర్‌ రిలీఫ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి అందించనున్నామని తెలిపారు.


logo