ఆదివారం 24 మే 2020
Hyderabad - Mar 27, 2020 , 00:23:11

మానవత్వం పరిమళించె..!

మానవత్వం పరిమళించె..!

ఆదుకునేందుకు ముందుకువస్తున్న దాతలు

సీఎం సహాయనిధికి లక్ష విరాళం

  • మంత్రి హరీశ్‌రావుకు అందజేత

సీఎం సహాయ నిధికి సిద్దిపేటకు చెందిన ప్రముఖ వ్యాపారి, చక్రపాణి ఆగ్రో ఇండస్ట్రిస్‌ చైర్మన్‌ పంతం రవీందర్‌ తరఫున లక్ష రూపాయల చెక్కును ఆయన కుమారుడు రామానుజం గురువారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. 

కరోనా నివారణ చర్యలకోసం రూ.లక్ష విరాళం 

కోరుట్ల : కరోనా నివారణ చర్యల కోసం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన వల్లకొండ లక్ష్మీనారాయణ రూ.లక్ష విరాళాన్ని గురువారం అందజేసి గ్రామస్తులు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. లక్ష్మీనారాయణ ఉపాధి రీత్యా దుబాయిలో కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. గ్రామస్తులకు మాస్కులు, శానిటైజర్లు, రహదారి శుభ్రత, బ్లీచింగ్‌ పౌడర్‌, ఇతర పారిశుధ్య కార్యక్రమాలకు ఈ విరాళాన్ని వాడనున్నట్లు సర్పంచ్‌ చొప్పాల నర్సయ్య తెలిపారు.  

కరోనా బాధితుల కోసం బ్యాంక్‌ మేనేజర్‌ విరాళం 

మల్లాపూర్‌ : జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ముత్యంపేట నివాసి, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిండికేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న గోడిసెల తిరుపతి కరోనా బాధితుల సంక్షేమం కోసం సీఎం సహాయనిధికి రూ.20వేల నగదును 25వతేదీన ఆన్‌లైన్‌లో జమచేశారు. 

మంత్రి కేటీఆర్‌కు విరాళం అందజేత

తెలంగాణ డైరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌  లోకభూమారెడ్డి రూ.5 లక్షలు విరాళంగా మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ యజమాని విజయ్‌ మద్దూరి రూ.25 లక్షలు విరాళంగా అందజేశారు. 

‘నో రెంట్‌' అంతా హ్యాపీ

కరోనా వైరస్‌ నేపథ్యంలో మీరెంత బాధ పడుతున్నారో నాకు తెలుసు. కుదుటపడే వరకు రెండు.. మూడు నెలలైనా సరే. కిరాయి తీసుకోనని కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ సుభాష్‌నగర్‌కు చెందిన వినోద్‌ అనే ఇంటి యజమాని రెంటర్స్‌కి చెప్పారు. ఆ విషయాన్ని వాళ్ల ఇంటికే వెళ్లి చెప్పడంతో ఆ కిరాయిదార్ల ఆనందానికి హద్దుల్లేవు. తనకు ఉన్న జి+2 ఇంట్లో ఐదు కుటుంబాలు ఉంటున్నాయి. వారందరికీ నో రెంట్‌ అని స్పష్టం చేశారు. దాంతో మా యజమాని నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నామని కిరాయిదారులు అరవింద్‌, ఇర్ఫాన్‌, ప్రసాద్‌లు చెప్పారు. 

పాదచారులకు అండగా నిలిచిన అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ 

ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ హైదరాబాద్‌ నుంచి అందోల్‌ వెళ్తుండగా పుల్కల్‌ మండలం చౌటకూర్‌ వద్ద దాదాపు 20 మంది నడుచుకుంటూ వెళ్తుండగా వారిని గమనించి వాహనం ఆపి మాట్లాడారు. జోగిపేటలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వారికి భోజనాన్ని అందించి, వాహనంలో నారాయణఖేడ్‌ ప్రాంతానికి పంపించారు.  

విరాళంగా పెన్షన్‌ ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఒక నెల పెన్షన్‌ రూ.35వేలను సీఎం సహాయ నిధికి విరాళంగా అందించారు. ఇదే జిల్లా హాజీపూర్‌ మండలంలోని 17 గ్రామాల సర్పంచ్‌లు ఒక నెల వేతనాన్ని కలెక్టర్‌ సహాయనిధికి ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. 

భోజనం పెట్టి సొంతూళ్లకు పంపిన డిప్యూటీ స్పీకర్‌

సికింద్రాబాద్‌ : తిరుపతి, బెంగుళూరు, మణుగూరు, కొత్తగూడెం, వరంగల్‌, కరీంనగర్‌ ప్రాంతాలకు చెందినవారు దాదాపు 60 మంది లాక్‌డౌన్‌ కారణంగా సికింద్రాబాద్‌లో చిక్కుకుపోయారు. వారు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ను కలువగా  భోజనం పెట్టించి, సొంత ఖర్చులతో సొంతూర్లకు పంపించారు. 

పనితీరు భేష్‌.. : మంత్రి వేముల

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి నిరంతరం పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌, ఆశవర్కర్‌, పారిశుధ్య కార్మికుల ఇంటికి రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెళ్లి అభినందించారు. పండ్లు, బిస్కెట్లు, వాటర్‌ బాటిళ్లను అందజేశారు.

మాజీ సర్పంచ్‌ అండగా నిలిచాడు

చేవెళ్ల : చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామంలో లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు తన వంతు సాయంగా గ్రామ మాజీ సర్పంచ్‌ పట్లోళ్ల హన్మంత్‌ రెడ్డి రూ.50వేలు ఆర్థిక సాయంగా అందజేశారు.  

దారిలో ఆకలి తీర్చారు..!

లాక్‌డౌన్‌ కారణంగా నగరం నుంచి కొడంగల్‌, కోస్కి, పరిగి, కర్ణాటక ప్రాంతాల్లో స్వగ్రామాలకు చిన్న పిల్లలతో కలినడకన వెళ్తున్న వారికి చేవెళ్ల మండల పరిధిలోని ఇబ్రహీంపల్లి వద్ద మహమూద్‌ హోటల్‌ యాజమాన్యం భోజనాలు పెట్టించారు. 


logo