ఆదివారం 24 మే 2020
Hyderabad - Mar 27, 2020 , 00:17:16

కరోనా కట్టడికి కలిసికట్టుగా ..

కరోనా కట్టడికి కలిసికట్టుగా ..

 • సామాజిక దూరం పాటించి నిత్యావసర సరుకులు, కూరగాయలు
 • కొనుగోలు చేసేలా ఏర్పాట్లు
 • విస్తృతంగా చెక్‌పోస్టుల ఏర్పాటు 
 • ప్రజలకు మాస్కులు, సబ్బుల పంపిణీ
 • రోడ్లపైకి వచ్చిన వారికి కౌన్సెలింగ్‌.. వెనక్కి వెళ్లిపోవాలంటూ పోలీసుల సూచన 
 • ఇంటినుంచి బయటకురావద్దంటూ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల పిలుపు

కరోనా కట్టడికి కలిసికట్టుగా పోరాడుతున్నారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండగా.. అత్యవసరంగా బయటికి వచ్చిన వారిని వదిలేస్తూ అనవసరంగా బయటివచ్చిన వారికి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించి వెనక్కి పంపిస్తున్నారు. మాట వినని వాహనాదారులపై కేసులు నమోదు చేస్తూ ఆయా వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.  నిత్యావసర సరుకులు, కూరగాయల కోనుగోళ్లకు వచ్చేవారు సామాజిక దూరం పాటించేలా మీటర్‌ దూరంలో బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు   ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పలు పార్టీల నాయకులు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసరముంటే తప్పా బయటిరావద్దని, సామాజిక దూరంతోనే కరోనాను కట్టడి చేయొచ్చని ప్రజలకు సూచిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటూ వారి నివాసిత ప్రాంతాలతో నగరంలోని నియోజకవర్గాల్లో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య పనులు చేపడుతున్నది.  ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 

- నమస్తేతెలంగాణ, జోన్‌ బృందం

ఖైరతాబాద్‌..

 • ప్రభుత్వం తరఫున రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా జరిగేలా చూడాలని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పౌర సరఫరాల శాఖ సర్కిల్‌ 7 అధికారులతో గురువారం  సమీక్ష సమావేశం నిర్వహించారు.
 • సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం సీఐ సైదిరెడ్డి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.  ప్రతి ఒక్కరూ చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించాలని, వినియోగదారులకు ఒక మీటరు దూరంగా ఉండి సరుకులు అందజేయాలన్నారు. 
 • సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏసీ గార్డ్స్‌లో సాయంత్రం 7 దాటిన తర్వాత కూడా ఎఫ్‌బీఎం కిరణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ తెరిచి ఉంచాడు. పోలీసులు షాపు యజమాని ఇబ్రహీం బిన్‌ ప్రజుల్లాను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.  ఇదే తరహాలో లక్డీకాపూల్‌లో పెషావర్‌ రెస్టారెంట్‌ తెరిచి ఉంచడంతో షాపు యజమాని అబ్దుల్‌ మోహిత్‌పై కేసు నమోదు చేశారు. 

జూబ్లీహిల్స్‌..

 • వెంగళరావునగర్‌ డివిజన్‌లో షాపింగ్‌ మాల్స్‌, కిరాణ షాపుల ఎదుట అధికారులు, కింగ్‌కోఠిలో నారాయణగూడ పీఎస్‌ ఎస్సై సైదులు సూచనల మేరకు సిబ్బంది కొనుగోళ్లకు వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయించారు. 
 • - యూసుఫ్‌గూడ డివిజన్‌లోని ఆయా బస్తీల్లో నిర్వహిస్తున్న సోడియం హైపో క్లోరైడ్‌ పిచికారి పనులను కార్పొరేటర్‌ గుర్రం సంజయ్‌గౌడ్‌, సర్కిల్‌-19 ఉప కమిషనర్‌ రమేశ్‌ పరిశీలించారు.
 • హిమాయత్‌నగర్‌లో పోలీసులకు, పేదలకు హిమాయత్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు మహ్మద్‌ సర్ఫరాజ్‌, అజ్జు, వసీక్‌లు పండ్లు పంపిణీ చేశారు. 

కంటోన్మెంట్‌..

 • బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డులో సంచార వాహనాలను చైర్మన్‌ టి.ఎన్‌.శ్రీనివాస్‌, ఎంపికశ్రేణి కార్యదర్శి శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ వాహనాల ద్వారా పలు ప్రాంతాల్లో కూరగాయలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 • ఆరో వార్డు పరిధిలోని నందమూరినగర్‌లో స్థానిక బోర్డు సభ్యుడు కె.పాండుయాదవ్‌,  ఏడో వార్డు పరిధిలో స్థానిక బోర్డు సభ్యురాలు ప్యారసాని భాగ్యశ్రీ, టీఆర్‌ఎస్‌ వార్డు అధ్యక్షుడు కేబీ శంకర్‌రావు మాస్కులను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రేషన్‌ డీలర్ల వద్ద  ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని ప్యారసాని భాగ్యశ్రీ తెలిపారు. 
 • రసూల్‌పూరలోని నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించి కొనుగోళ్లు చేసేలా బేగంపేట ఎస్సై ముత్యంరాజు సర్కిళ్లు ఏర్పాటు చేయించారు.
 • మోండా మార్కెట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆకుల రూప పలు ప్రాంతాల్లో పర్యటించి ఇండ్లను విడిచి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. 
 • సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, మారేడ్‌పల్లి పరిసర ప్రాంతాల్లో పోలీస్‌ సిబ్బందికి, అధికారులకు బటర్‌ మిల్క్‌, బిస్కెట్లు, పండ్లు, వాటర్‌ బాటిళ్లను అందజేశారు.
 • కంటోన్మెంట్‌ 5వ వార్డులోని ఓల్డ్‌ వాసవీనగర్‌ కాలనీలో బోర్డు ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ, బాలంరాయిలో కంటోన్మెంట్‌ బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్‌, రెజిమెంటల్‌బజార్‌లోని పలు బస్తీలు, కాలనీలలో  జీహెచ్‌ఎంసీ కో ఆప్షన్‌ సభ్యు డు నర్సింహముదిరాజ్‌  పర్యటించి జీహెచ్‌ఎంసీ సిబ్బందితో బ్లీచింగ్‌ పౌడర్‌, రసాయనిక మందులను పిచికారీ చేయించారు.
 • గోపాలపురం పోలీసు స్టేషన్‌లో కోవిడ్‌-19 హెల్ప్‌ డెస్క్‌ను బుధవారం ఏర్పాటు చేశారు. పోలీసు స్టేషన్‌ పరిధిలో బస్తీ, కాలనీల్లోకి  ఎవరైనా విదేశాల నుంచి వచ్చినా, కరోనా లక్షణాలు కలిగి ఉన్న, కోవిడ్‌ -19 సంబంధించిన ఎలాంటి సమాచారం అయిన ఈ హెల్ప్‌ డెస్క్‌కు అందించాలని ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ వెల్లడించారు. హెల్ప్‌ డెస్క్‌ నంబర్‌ 94914 91981, అడ్మిన్‌ ఎస్సై 7901107582, డీఐ 94906 16181, ఇన్‌స్పెక్టర్‌ 9490616447, డయల్‌ -100కు ఫోన్‌ చేసి సమాచారం అందించవచ్చని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజల కోసం పోలీసులు కాళ్లు, చేతులు కడుక్కొని లోపలికి వచ్చే విధంగా శానిటైజర్స్‌ ఏర్పాటు చేశారు. 

సికింద్రాబాద్‌..

 • తార్నాక చౌరస్తా వద్దగల బస్‌స్టాప్‌లలో ఫైర్‌ సర్వీస్‌ సిబ్బంది రసాయనాలను పిచికారీ చేయించారు.
 • లాలాపేట్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో లాలాపేట్‌లో అన్నదానం చేశారు.
 • చిలకలగూడలో అనవసరంగా రోడ్లమీదికి వచ్చిన వారిని కార్పొరేటర్‌ సామల హేమ  మందలించి  పంపించారు. 
 • వారాసిగూడ, సీతాఫల్‌మండిలలో రోడ్లపైకి వచ్చిన యువకులకు ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి  కౌన్సెలించి ఇచ్చి వెనక్కి పంపించారు. 

సనత్‌నగర్‌..

 • లాక్‌డౌన్‌ నేపథ్యంలో వైద్యులు, ఇతర ఉద్యోగులు, సిబ్బందికి  గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.శ్రావణ్‌ కుమార్‌ గుర్తింపు కార్డులను జారీ చేశారు.
 • గాంధీ దవాఖానలోని కరోనా హెల్ప్‌ డెస్క్‌ వద్ద వైరస్‌ నిర్ధారణ కోసం వచ్చిన అనుమానితుల ఆరోగ్య సమస్యలు, లక్షణాల వివరాలు నమోదు చేశారు.

ముషీరాబాద్‌..

 • రాంనగర్‌లో స్థానిక కార్పొరేటర్‌  శ్రీనివాస్‌రెడ్డి గురువారం పారిశుధ్య కార్మికులకు కరోనాపై అవగాహన కల్పించి, మాస్కులు, డెటాల్‌, సబ్బులు పంపిణీ చేశారు. 
 • గురువారం చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌తో కలిసి  ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ గాంధీనగర్‌, చిక్కడపల్లి ప్రాంతాల్లో పర్యటించి నియోజకవర్గంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  
 • విదేశాల నుంచి వచ్చిన వారు తప్పకుండా సమాచారం అందించాలని హిమాయత్‌నగర్‌ తహసీల్దార్‌ లలిత అన్నారు. కరోనా వైరస్‌ను అరికట్టడానికి, సమాచారం, సహాయం అందించడానికి తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంలో నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. సమస్యలు ఉంటే  4408 158278 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
 • హాస్టళ్లలో ఉంటున్న  విద్యార్థులకు ఇబ్బందులు కల్గించరాదని, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గాంధీనగర్‌ కార్పొరేటర్‌ ముఠా పద్మానరేశ్‌, డీఎంసీ ఉమా ప్రకాశ్‌ కోరారు. 

అంబర్‌పేట..

 • నల్లకుంట డివిజన్‌లోని గోల్నాక కూరగాయల మార్కెట్‌, చర్చిగల్లీ, కార్ఖానా గల్లీ, అంబేద్కర్‌నగర్‌, వినాయకనగర్‌, వెంకటేశ్వరనగర్‌ తదితర ప్రాంతాల్లో  డివిజన్‌ కార్పొరేటర్‌ గరిగంటి శ్రీదేవి రమేశ్‌ పర్యటించారు. 
 • గురువారం  మార్కెట్లను తనిఖీలు చేసి కూరగాయలు అధిక ధరలకు అమ్మవద్దని స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు ఎక్కాల చైతన్యకన్నా స్పష్టం చేశారు.
 • కాచిగూడ కార్పొరేటర్‌ ఎక్కాల చైతన్యకన్నా ఆదేశాల మేరకు బర్కత్‌పుర వార్డు సభ్యురాలు నిమ్మల స్వప్నకల్యాణ్‌ గురువారం బర్కత్‌పురలో ‘అగోర పశుపతి హోమం’ నిర్వహించారు.  

కార్వాన్‌..

 • కరోనాను ఎదుర్కొవడానికి అందరూ కలిసికట్టుగా సిద్ధం కావాలని, ప్రజలు  అప్రమత్తతతో తగిన ఆరోగ్య సూచనలు పాటించాలని కార్వాన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌసర్‌మొయినుద్దీన్‌ అన్నారు. గురువారం టోలిచౌకిలో పర్యటించి పేదల కోసం తన సొంత నిధులతో రేషన్‌ సరుకుల పంపిణీ ఏర్పాట్లు చేశారు.
 • జియాగూడ డివిజన్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులతో కలిసి డివిజన్‌ కార్పొరేటర్‌ మిత్రకృష్ణ, జీహెచ్‌ఎంసీ వార్డు సభ్యుడు ముత్యాల భాస్కర్‌  హైడ్రోక్లోరిన్‌ రసాయనాలతో  పిచికారీ చేపట్టారు. 

గురువారం భోజగుట్టలోని గుడిసెవాసులకు గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ బంగారి ప్రకాశ్‌  ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు.

డివిజన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెల్లరేషన్‌ కార్డుదారులకు రేషన్‌ బియ్యం అందిస్తామని కార్పొరేటర్‌ తెలిపారు. సివిల్‌ సైప్లె అధికారులు శంకర్‌, లోకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.


logo