శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 27, 2020 , 00:09:53

ఆకలి తీర్చుతున్న ‘అన్నపూర్ణ’

ఆకలి తీర్చుతున్న ‘అన్నపూర్ణ’

  • నిరుపేదలకు ఉచిత భోజనం
  • అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 11 వేల మందికి అన్నం సరఫరా
  • నేడు మొత్తం 150 కేంద్రాలు తెరిచేందుకు ఏర్పాట్లు
  • సాయంత్రం కూడా భోజనం పంపిణీకి చర్యలు
  • నిరాశ్రయులను సమీప హాస్టళ్లకు తరలించే యోచన
  • వారికీ ఉచితంగా భోజనం అందించేందుకు సన్నాహాలు

నగరంలోని అన్నపూర్ణ కేంద్రాలు.. అన్నార్థుల ఆకలి తీర్చుతున్నాయి. ఆపత్కాలంలో ఉచితంగా కడుపునిండా అన్నం పెడుతున్నాయి. గురువారం 78 కేంద్రాల్లో సుమారు 11 వేల మందికి ఉచితంగా భోజనం అందించారు.  శుక్రవారం నుంచి మొత్తం 150 కేంద్రాల ద్వారా భోజనాన్ని అందించాలని నిర్ణయించారు. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలు పస్తులు ఉండకూడదనే మంత్రి కేటీఆర్‌ ఆకాంక్ష మేరకు గురువారం నగరంలో అన్నపూర్ణ కేంద్రాల్లో ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని అందించారు. వేడివేడి అన్నంతో పాటు ఒక కూర, పప్పు, సాంబారు, పెరుగుతో పాటు మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉదయం పదకొండు గంటలకే భోజనం పంపిణీ మొదలు కాగా, రోజువారీ కూలీలు, వివిధ పనుల నిమిత్తం ఇతర రాష్ర్టాలనుంచి వచ్చి నగరంలో చిక్కుకుపోయిన వారు, లారీ డ్రైవర్లు,  క్లీనర్లు, దవాఖానలకు వచ్చినవారు, విద్యార్థులు ఆకలి తీర్చుకున్నారు. 

 లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు మంత్రి కేటీఆర్‌ బుధవారం నగరంలో పర్యటించిన విషయం విధితమే. ఈ సందర్భంగా ఫుట్‌పాత్‌లపై అనేక మంది ఆకలితో ఉంటున్నట్లు, ప్రైవేట్‌ హాస్టళ్లలో విద్యార్థులు, దవాఖానలకు వచ్చిన రోగులు, వారివెంట వచ్చిన వారు, హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగాలు చేసుకునే వర్కింగ్‌ పర్సన్స్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, నైట్‌ షెల్టర్లలో ఉన్నవారూ సరిగా భోజనం లభించక బాధపడుతున్నట్లు గుర్తించిన మంత్రి వెంటనే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచితంగా భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ను ఆదేశించారు. దీంతో అక్షయపాత్ర ఫౌండేషన్‌ నిర్వాహకులను కలిసిన మేయర్‌ గురువారం నుంచి అన్నపూర్ణ కేంద్రాలు యథావిధిగా పనిచేసేలాఏర్పాట్లు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 78 అన్నపూర్ణ క్యాంటిన్లు గురువారం తెరుచుకున్నాయి. ఈ క్యాంటిన్ల ద్వారా 11 వేలకు పైగా ప్రజలు భోజనం చేయగా, శుక్రవారం నుంచి మొత్తం 150 కేంద్రాల ద్వారా భోజనాన్ని అందించాలని నిర్ణయించారు. అంతేకాకుండా సాయంత్రం వేళల్లో కూడా భోజనం అందించాలని నిశ్చయించారు. ముఖ్యంగా హాస్టళ్లు ఉన్నచోట ఉచితంగా భోజనం అందించాలని, నిరాశ్రయులు ఉంటే వారిని కూడా సమీపంలోని హాస్టళ్లకు తరలించాలని నిశ్చయించారు. మామూలుగా రూ. ఐదుకు భోజనం అందించే ఈ క్యాంటిన్లలో గురువారం నుంచి పూర్తిగా ఉచితంగా భోజనం అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకూ ఉచితంగానే భోజనం అందించాలని నిర్ణయించారు. ఉచిత భోజన పంపిణీపై లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ కార్యక్రమం భేష్‌

లాక్‌డౌన్‌ కారణంగా హోటళ్లు పూర్తిగా మూసివేయగా, ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో రోజువారీ పనులు చేసుకొని జీవించే కొందరు ఆకలితో ఇబ్బంది పడుతుండగా, మరికొందరు భోజనం చేయడానికి హోటళ్లు లేకపోవడంతో ఇబ్బందిపడే పరిస్థితి నెలకొంది.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉచితంగా అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నాణ్యమైన భోజనాన్ని పంపిణీ చేయడంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  తమ ఆకలి బాధను అర్థం చేసుకున్న మంత్రి కేటీఆర్‌ను వారు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. 


logo