శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 27, 2020 , 00:07:38

కూరగాయలు కాలనీల్లోకే

కూరగాయలు కాలనీల్లోకే

  • 79 విక్రయ వాహనాలు 
  • నేటి నుంచి వీధుల్లోకి.. 
  • రైతుబజార్లకు అదనంగా సేవలు 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ, కేపీహెచ్‌బీ కాలనీ :  నగరవాసులకు శుభవార్త. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏ ఇబ్బందులూ తలెత్తకుండా మార్కెటింగ్‌ శాఖ చర్యలు చేపట్టింది. సంచార వాహనాలను వీధుల్లోకి పంపి రైతుబజారు ధరలకే కూరగాయలను అమ్మే ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచే ఆ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఉన్న 12 సంచార విక్రయ కేంద్రాల సంఖ్యను 79కి పెంచింది. వీటి సహకారంతో నగర వ్యాప్తంగా ఎక్కడ కావాలంటే అక్కడ కూరగాయలు అందుబాటులో ఉంచనుంది. 

వాహన నిర్వహణకు.. కిలోకు 2 రూపాయలు అదనం 

కూరగాయల విక్రయదారులకు చెందిన వాహనాల్లోనే సంచార రైతుబజార్లు నిర్వహించుకునేందుకు మార్కెటింగ్‌శాఖ అధికారులు వెసులుబాటు కల్పించారు. వాహనాలు అందుబాటులో లేని వారికి ప్రభుత్వం తరపున వాటిని ఏర్పాటు చేసి వీధుల్లో కూరగాయలు విక్రయించనుంది. అయితే వాహన నిర్వహణ ఖర్చుల కోసం కిలో కూరగాయలకు 2 చొప్పున అధికంగా వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. కాగా కరోనా వ్యాప్తి చెందకుండా వినియోగదారులు ఒకేసారి గుమిగూడకుండా పాటించాల్సిన పద్ధతులపై కూడా పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించనున్నారు. కాగా, కూకట్‌పల్లి రైతుబజార్‌ ఆధ్వర్యంలో 6 ప్రాంతాలలో సంచార రైతుబజార్‌లను ఏర్పాటు చేసి కూరగాయలను విక్రయించారు. 

బస్తీలు.. కాలనీలలో...

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలలో ఆరుచోట్ల సంచార రైతుబజార్‌లను ఏర్పాటు చేశాం. ప్రజలకు కావాల్సిన అన్ని కూరగాయలను ఇండ్ల వద్దకే తీసుకెళ్తున్నాం. పేదలు నివసించే బస్తీలు, రైతు బజార్‌కు దూరంగా ఉన్న కాలనీలలో సంచార రైతుబజార్‌ ద్వారా కూరగాయలను విక్రయిస్తాం. సంచార రైతుబజార్‌లలో... రైతుబజార్‌లో నిర్ధేశించిన ధరలకు అదనంగా కేజీకి రూ.2 చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో సంచార రైతుబజార్‌లు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. 

- సుధాకర్‌, ఎస్టేట్‌ ఆఫీసర్‌, కూకట్‌పల్లి రైతుబజార్‌


logo