ఆదివారం 24 మే 2020
Hyderabad - Mar 26, 2020 , 23:55:45

ఏ ఒక్కరినీ ఆకలితో ఉంచం

ఏ ఒక్కరినీ ఆకలితో ఉంచం

అందరికీ అన్నం పెడతాం

  • అనాథలు, కూలీలను ఆదుకుంటాం 
  • వారున్నచోటే వసతి ఏర్పాటు చేస్తాం 
  • ఇతర రాష్ర్టాలవారికీ బస కల్పిస్తాం
  • ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే వైద్యసాయమందిస్తాం 
  • అన్నపూర్ణ కేంద్రాల వద్ద అందరికీ భోజనం అందిస్తాం 
  • మంత్రి కేటీఆర్‌ సూచనల ప్రకారం ఎవ్వరికీ ఇబ్బంది రానీయం
  • నమస్తే తెలంగాణతో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరంలో ఆహార కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. అనాథలు, అన్నార్థులు, కూలీలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు నగరంలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే వెంటనే వైద్య సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అన్నపూర్ణ కేంద్రాలు, దుకాణాల వద్ద కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ద్వారా తీసుకుంటున్న చర్యలను మేయర్‌  బొంతు రామ్మోహన్‌ ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ


నిర్మాణ రంగంలో వేలాదిమంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌డ్రూం గృహాల నిర్మాణంలో వేలాదిమంది పనిచేస్తున్నారు. వారిలో ఇతర జిల్లాలు, ఇతర రాష్ర్టాలకు చెందినవారున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు నిలిచిపోవడంతో చాలామంది సొంత ఊళ్లకు వెళ్లలేక, తినడానికి తిండి దొరక్క ఇబ్బంది పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారందరికీ ఉచితంగా భోజనం, బస సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ బిల్డర్స్‌ అసోసియేషన్‌, కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్ల సహకారంతో వారు ఎక్కడ ఉంటున్నారో అక్కడే వారికి తగిన వసతి, ఉచిత భోజన సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సమీపంలోని అన్నపూర్ణ కేంద్రాల ద్వారా వారికి భోజనం సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 

అనాథలు, నిరాశ్రయులు, విద్యార్థులకు తగిన ఏర్పాట్లు

 తనకంటూ ఎవ్వరూ లేక దాతల దయాదాక్షిణ్యాలపై జీవించే అనాథలు, ఫుట్‌పాత్‌లే ఆవాసాలుగా కాలం వెళ్లదీస్తున్నవారు, వివిధ శిక్షణలకోసం వచ్చి నగరంలో ఉంటున్న విద్యార్థులు, షెల్టర్‌ హోమ్‌లలో ఉంటున్న ఒంటరి మహిళలు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. వారిని సమీపంలోని షెల్టర్‌హోమ్‌లు, హాస్టళ్లకు తరలించి ఉచిత భోజనం సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సమీపంలో అన్నపూర్ణ క్యాంటిన్‌ ఉంటే అక్కడినుంచి భోజనం అందిస్తాం. లేనిపక్షంలో ప్రత్యేకంగా తాత్కాలిక అన్నపూర్ణ క్యాంటిన్‌ను అక్కడ ఏర్పాటుచేసి వారికి భోజనం అందిస్తాం. రెండు పూటలా భోజనం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

సోషల్‌ డిస్టెన్సింగ్‌ అత్యంత ప్రధానం

 అన్నపూర్ణ కేంద్రాలు, చౌకదుకాణాలు, మార్కెట్లు, షాపులు తదితర చోట్ల సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించడం తప్పనిసరి. లేకుంటే లాక్‌డౌన్‌ ఉద్దేశం నెరవేరదు. అందుకే పోలీసు శాఖ సహకారంతో సోషల్‌ డిస్టెన్సింగ్‌ నూటికి నూరు శాతం అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. దుకాణాలు, మార్కెట్ల వద్ద వాటి నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మనిషికి మనిషికి కనీసం ఒక మీటరు దూరం ఉండేలా దుకాణాల ముందు రోడ్డుపై మార్కింగ్‌ చేయాలి. ఈ క్రమశిక్షణ ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ పగటిపూట మినహాయింపు ఇచ్చారు. దయచేసి అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. లేనిపక్షంలో కఠిన ఆంక్షలు విధించాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. అప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా పౌరులు బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తిచేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి వ్యాప్తిచేందకుండా చూడడమే మన లక్ష్యం కావాలి. 

ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ 

పేదలకు అందుతున్న సేవలపై స్థానిక ప్రజాప్రతినిధుల నిఘా ఉంటుంది. ఎవరైనా తిండి, గూడు లేకుండా ఇబ్బంది పడుతుంటే వెంటనే అక్కడి కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు వారిని సమీపంలోని షెల్టర్‌హోమ్‌కు చేరవేసేందుకు చర్యలు చేపడతారు. అంతేకాకుండా, తమ-తమ ప్రాంతాల్లో కూలీపనిచేసే పేదలకు తగిన భోజన, వసతి సౌకర్యం కల్పించేందుకు వారు కూడా తమవంతు కృషిచేస్తారు. అన్నపూర్ణ కేంద్రాల వద్ద అందరికీ భోజనం లభించేలా పర్యవేక్షణ ఉంటుంది. ఐదు రూపాయలు కూడా తీసుకోకుండా గురువారం నుంచి అన్ని ప్రాంతాల్లో ఉచితంగా భోజనం అందిస్తున్నాం. ప్రస్తుతం 78 ప్రాంతాల్లో కేంద్రాలు కొనసాగుతుండగా, అవసరాలకు తగ్గట్టు అన్ని ప్రాంతాల్లోనూ వీటిని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

ఆరోగ్య సమస్యలపై వెంటనే తగిన చర్యలు

అనాథలు, కూలీలు, వృద్ధులు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారిని సమీపంలోని వైద్యులు, దవాఖానల ద్వారా వైద్యం చేయించేందుకు స్వచ్ఛంద సంస్థలు చర్యలు తీసుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేశాం. నగరంలోని 12 షెల్టర్‌ హోమ్‌ల నిర్వాహకులు, ఐదు ప్రధాన దవాఖానల్ల్లో షెల్టర్‌ హోమ్‌లను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఈ మేరకు బాధ్యతలు అప్పగించాం. అంతేకాదు, జీహెచ్‌ఎంసీకి చెందిన అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌(యూసీడీ) విభాగం ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలను పర్యవేక్షిస్తున్నది. ఏ ఒక్కరికీ ఇబ్బంది రాకూడదని మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సైతం ఆ దిశగా అప్రమత్తతతో వ్యవహరిస్తున్నది. 


logo