శనివారం 30 మే 2020
Hyderabad - Mar 26, 2020 , 00:26:52

రేపటి నుంచి బియ్యం పంపిణీ

రేపటి నుంచి బియ్యం పంపిణీ

  • రేషన్‌ దుకాణాలు,  కమ్యూనిటీ హాళ్లలో అందజేత
  • తెల్లరేషన్‌ కార్డుపై ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా 12 కిలోల బియ్యం
  • పంపిణీలో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రేషన్‌ దుకాణాలతోపాటు కమ్యూనిటీ హాళ్లలో శుక్రవారం నుంచి బియ్యం అందజేయడానికి సన్నాహాలు చేశారు. రద్దీ ఎక్కువగా ఉన్నా లబ్ధిదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లాలో ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కార్డుపై ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో నగర పౌరసరఫరాలశాఖ దీనికి సంబంధించిన బియ్యంతో పూర్తిస్థాయిలో సిద్ధమైంది. దీనిని 27వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి పౌరసరఫరాలశాఖ గిడ్డంగులకు బియ్యం తరలింపు పూర్తికావడంతో పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే రద్దీ పెరిగే అవకాశముండటంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోషల్‌ డిస్టెన్స్‌ పాటించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న రేషన్‌ దుకాణాలతోపాటు హైదరాబాద్‌ జిల్లాలోని కమ్యూనిటీ హాల్స్‌లో కూడా పంపిణీ చేపట్టనున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రెవెన్యూ సిబ్బందితోపాటు , జీహెచ్‌ఎంసీ, పోలీసుల సహాయ సహకారాలు కూడా తీసుకోనున్నారు. సహకారం అందించాలని పోలీసుశాఖతోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఇప్పటికే పౌరసరఫరాలశాఖ సంప్రదించింది. సర్కిల్‌కు రెండు చొప్పున కమ్యూనిటీ హాళ్లను గుర్తించి అందులో బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీనికోసం పౌరసరఫరాలశాఖకు చెందిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల సేవలను వినియోగించుకోనున్నారు. మిగతా సిబ్బంది కోసం బిల్‌కలెక్టర్లను ఇచ్చే విధంగా జీహెచ్‌ఎంసీని కోరారు.



సరిపడా బియ్యం: సీఆర్వో బాలమాయాదేవి

నగరానికి సరిపడినంతగా బియ్యాన్ని స్టాకుగా ఉంచుకున్నట్లు హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ అధికారి బాలమాయాదేవి తెలిపారు. ప్రజలు ఓకేసారి రద్దీగా తీసుకోకుండా ఓపికగా బియ్యం తీసుకోవాలని కోరారు. కార్డుపై ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఉచితంగా అందిచేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించడం ద్వారా కరోనాను నివారించేందుకు లబ్ధిదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పోర్టబిలిటీ పనిచేస్తుందని, ఈ పాస్‌ విధానంలోనే పంపిణీ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. రూ.1500 నగదును బ్యాంకు అకౌంట్‌లో నేరుగా జమచేస్తారని అన్నారు. బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా నిఘా ఏర్పాటు చేశామన్నారు.


logo