శనివారం 30 మే 2020
Hyderabad - Mar 26, 2020 , 00:06:11

ప్రతి ఫోన్‌కూ.. స్పందిస్తున్నారు

ప్రతి ఫోన్‌కూ.. స్పందిస్తున్నారు

  •  కొందరు బాధ్యతగా... ఇంకొందరు నిర్లక్ష్యంగా.. 
  • డయల్‌ 100కు ఫోన్లు
  • మూడు రోజుల్లో 5 వేల ఫోన్‌ కాల్స్‌...
  •  ప్రతి ఫోన్‌కు సమాధానమిస్తున్న పోలీసులు

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌ను కొందరు బాధ్యతగా.. మరికొందరు బాధ్యతారాహితంగా ప్రవర్తిస్తూ పోలీసులను పరేషాన్‌ చేస్తున్నారు. కొందరు ఇష్టం వచ్చినట్లుగా పోలీసు సేవలు కావాలంటూ డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఇబ్బంది పెడుతున్నారు. మరికొందరు అదే డయల్‌ 100కు ఫోన్‌చేసి పోలీసులకు కీలక సమాచారా న్ని ఇస్తున్నారు. పోలీసులు ఈ ఫోన్‌లన్నింటినీ మర్యాదగా స్వీకరిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంలో సమాధానాలు ఇస్తూ.. వారిని సంతృప్తి పరుస్తున్నారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ తర్వాత రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ల పరిధిలో దాదాపు ప్రతి రోజు 600 నుంచి 750 వరకు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. వీటిలో అధికంగా అధిక ధరలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులను విక్రయిస్తున్నారని సమాచారం ఇస్తున్నారు. మరికొందరు తమ ఇండ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విధంగా తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు. అనవసరంగా రోడ్లపై బైక్‌లపై తిరుగుతున్నవారి మీద... పౌరులు గుర్తించి.. వారి సమాచారాన్ని పోలీసులకు ఇస్తున్నారు. ఇలా... చాలా మంది లాక్‌డౌన్‌కు మద్దతు ఇస్తున్నారు. 

ఇటీవల పోలీసులకు వచ్చిన ఫోన్‌ కాల్స్‌ ఇలా...

  1. సార్‌... మా కాలనీలో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సామాన్యులకు చాలా ఇబ్బందిగా ఉందంటూ ఆ దుకాణం, కాలనీ పేరు, ప్రాంతం వివరాలను తెలియజేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారు. 
  2. సార్‌... మమ్మల్ని మా సొంత ఊరికి పంపండి.. ఇక్కడ ఉండనివ్వడం లేదు.. సహా యం చేయండని విజ్ఞప్తి చేశారు. దీంతో  స్థానిక పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు సరైన ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలు చూపించి అనుమతి రశీదును పొందాలని సూచిస్తున్నారు. 
  3. సార్‌...వారం కిందట మా కాలనీకి విదేశాల నుంచి వచ్చారు. వారు క్వారంటైన్‌ పాటించకుండా ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నారు. కరోనా వస్తుందని మాకు భ యం ఉంది. వెంటనే స్పందించిన పోలీసులు.. సంబంధిత కాలనీకి వెళ్లి విదేశాల నుంచి వచ్చినవారి వివరాలను తీసుకుని.. వారిని క్వారంటైన్‌లో ఉండాలని సూచించడంతో పాటు వారికి జ్వరం, దగ్గు ఉంటే వెంటనే సమీప ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తున్నా రు. దీనికోసం పోలీసులు తమ వెంట వైద్యాధికారులను కూడా తీసుకువెళ్తున్నారు. 
  4. సార్‌.. నేను ప్యూర్‌ వెజిటేరియన్‌....నేను బయటికి వెళ్లి సామాన్లు కొందామంటే చాలా రష్‌గా ఉంది. కొద్దిగా ఓ డజను అరటి పండ్లు....12 అపిల్‌ పండ్లు...పొప్పాయా తదితర పండ్లు తీసుకువస్తారా అంటూ డయల్‌ 100తో పాటు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. దీనికి పోలీసులు మర్యాదగా అలాంటి సేవలు అందించలేం.. మీ రక్షణ కోసం ఉన్నామని చెప్పి వారిని సంతృప్తి పరుస్తున్నారు. ఈ విధంగా రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు డయల్‌ 100 ద్వారా వచ్చిన దాదాపు 5 వేల కాల్స్‌ను అటెండ్‌ చేసి ... పౌరులు అందించిన సమాచారం ఆధారంగా విధులు నిర్వహించి.. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంతో పాటు నిత్యావసర సరకుల ధరలను కంట్రోల్‌లో పెట్టారు. 


logo