ఆదివారం 29 మార్చి 2020
Hyderabad - Mar 25, 2020 , 02:58:46

కూరగాయలకు లాక్‌డౌన్‌ లేదు

కూరగాయలకు లాక్‌డౌన్‌ లేదు

-నగరానికి భారీగా చేరిన కూరగాయలు

బోయిన్‌పల్లి పరిధిలోని అన్ని మార్కెట్లలో జనతా కర్ఫ్యూకు ముందురోజు 18వేల క్వింటాళ్ల కూరగాయలు రాగా మంగళవారం ఒక్కరోజే 22 వేల క్వింటాళ్లు చేరుకున్నాయి. సరూర్‌నగర్‌ రైతుబజార్‌లో గతంలో సగటున 650 క్వింటాళ్లకు గాను అదనంగా 200 క్వింటాళ్లు, వనస్థలిపురం రైతుబజార్‌లో అదనంగా 100 క్వింటాళ్ల వరకు దిగుమతయ్యాయి. ఎల్బీనగర్‌లో గతంలో రికార్డు స్థాయిలోనే 1200 క్వింటాళ్ల వరకు కూరగాయలు వచ్చేవి. కానీ మంగళవారం ఏకంగా 2392 క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అయ్యాయి. హైదరాబాద్‌ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలోని మార్కెట్లలో దాదాపు 20 శాతం మేర దిగుమతి పెరిగినట్లు అధికారులు తెలిపారు.

ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు 

కూరగాయల లభ్యతకు ఎలాంటి కొరత లేదని మార్కెటింగ్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే రైతు బజార్లకు వచ్చేవారు మాస్కులు ధరించి రావాలని సూచిస్తున్నారు. రైతుబజార్లలో ఎప్పటిలాగానే ప్రతిరోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు కూరగాయల అమ్మకాలు కొనసాగుతున్నాయని వివరించారు. సుల్తాన్‌బజార్‌ పోలీసు స్టేషన్‌కు ముందు ఉన్న ఓ రిటైల్‌ మార్కెట్‌లో కూరగాయల కోసం ఒకేసారి వందలాది మంది ఎగబడ్డారు. కార్ఖానాలోని ఓ రోడ్డు పక్కన ఉన్న మార్కెట్‌ షెడ్డులో కూడా ఇదే పరిస్థితి. పదిరోజులకు సరిపడా కూరగాయలు తెచ్చిపెట్టుకోవాలనే ఆత్రుతతో జనం గుంపులుగా వస్తుండడం వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో ఉన్న దాదాపు 13 రైతుబజార్లలో ధరలు తగ్గుముఖం పట్టాయి.

రైతు బజార్లలో రసాయనాల పిచికారి 

మలక్‌పేట, గుడిమల్కాపూర్‌ వంటి కొన్ని మార్కెట్లలో వైరస్‌ ప్రమాదం లేకుండా సెలవు ప్రకటించి శక్తివంతమైన రసాయనాలను స్ప్రే చేయించారు మార్కెటింగ్‌ శాఖ అధికారులు. అయితే ఈ మార్కెట్‌ సాధారణంగానే అమావాస్య రోజు సెలవును పాటిస్తుంది. అందులో భాగంగా మార్కెట్‌ను మంగళవారం మూసివేశారు. అలాగే బుధవారం ఉగాది పండుగ కారణంగా సెలవు ప్రకటించారు. తిరిగి ఈ మార్కెట్లు గురువారం తెరుచుకుంటాయి. కొన్ని మార్కెట్లు మంగళవారం అందుబాటులోకి వచ్చాయి. logo