శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 25, 2020 , 02:57:14

కరోనాపై ముప్పేట దాడి

కరోనాపై ముప్పేట దాడి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  కరోనా వైరస్‌ కట్టడికి జీహెచ్‌ఎంసీ పటిష్ట చర్యలు చేపట్టింది. క్రిమిసంహారక చర్యలను మరింత ముమ్మరం చేసింది.   హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారిని మరింత పెంచింది. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని నియమించి మూడు వందల మంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) సిబ్బందితో పాటు మరో 2375మంది ఎంటమాలజీ సిబ్బంది ద్వారా పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రింబవళ్లూ ఈ బృందాలు క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు.

కరోనా కట్టిడి కోసం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ప్రకటించగా, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు నగరంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ముప్పేట దాడి చేపట్టారు. 125 ఎంటమాలజీ బృందాలను దీనికోసం ఉపయోగిస్తున్నారు. ఒక్కో బృందంలో 18 మంది సభ్యులు, ఒక పర్యవేక్షకుడు పనిచేస్తుండగా, ద్రావణాన్ని పిచికారి చేసేందుకు వీరు పవర్‌ స్ప్రేయర్లు, నాప్‌సాక్‌ స్ప్రేయర్లను ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా హోమ్‌ క్వారంటైన్‌లు ఉన్న పరిసర ప్రాంతాలు, పాజిటివ్‌ కేసులు, అనుమానిత కేసులు నమోదైన ప్రాంతాలు, దవాఖానలు ఉన్న ప్రాంతాల్లో 24 గంటలూ ఈ బృందాలు పనిచేస్తున్నాయి. జోనల్‌, సర్కిల్‌ స్థాయిలో కమిషనర్లు, వైద్యాధికారులు, అలాగే జోన్లవారీగా సీనియర్‌ ఎంటమాలజిస్టులు పర్యవేక్షిస్తున్నారు. నాలుగింట ఒక వంతు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని నీటిలో కలిపి పిచికారిచేస్తున్నారు. దీనివల్ల క్రిమికీటకాలు నాశనం అవుతాయని అధికారులు తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు విశ్వవ్యాప్తంగా ఇదే  పద్ధతిని అనుసరిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. చందానగర్‌, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి, బేగంపేట్‌, సికింద్రాబాద్‌, హిమాయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట్‌ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా స్ప్రే చేస్తున్నట్లు తెలిపారు. అన్ని జోన్లు, సర్కిళ్లవారీగా ఎంటమాలజీ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు, ఎక్కడ సమస్య వైద్యశాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆయా ప్రాంతాలకు బృందాలు వెళ్లి స్ప్రేయింగ్‌ పనులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అలాగే, కొన్నిచోట్ల బ్లీచింగ్‌ పౌడర్‌ను కూడా నీటిలో కలిపి పిచికారి చేస్తున్నారు. దీంతోపాటు గాలిలో ఉండే క్రిములను నాశనం చేసేందుకు ఫాగింగ్‌ చేస్తున్నారు. 

చెత్త పేరుకుపోకుండా..

 రోజువారీ పారిశుధ్య పనులు కూడా మరింత కట్టుదిట్టంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా రోడ్లు, వీధులను  స్వీపింగ్‌ చేయడంతోపాటు చెత్తకుప్పలు ఎక్కడా ఉండకుండా ఎప్పటికప్పుడు వాటిని ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు, అక్కడినుంచి డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. అలాగే, ఓపెన్‌ గార్బేజ్‌ ఉండే ప్రాంతాలను పూర్తిగా లేకుండా చేయడంతోపాటు, చెత్తకుండీలు, ఓపెన్‌ గార్బేజ్‌ పాయింట్లు ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లుతున్నారు. చెత్తకుప్పల కారణంగా దోమలు, ఈగలు, కుక్కల బెడదను నివారించేందుకు స్వీపింగ్‌ పనులపై పకడ్బందీ నిఘాను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.లాక్‌డౌన్‌ ద్వారా ప్రజలను బయటకు వెళ్లకుండా నియంత్రించిన విధంగానే వైరస్‌ను వ్యాప్తిచేయకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు చెప్పవచ్చు. 

జెట్టింగ్‌ యంత్రాలతో..

 మరోవైపు, ఈవీడీఎంకు చెందిన సుశిక్షితులైన 300మంది సభ్యులతో  19 బృందాలు, ఆరు జెట్టింగ్‌ యంత్రాలను కూడా సోడియం హైపోక్లోరైట్‌ పిచికారి చేయడానికి వాడుతున్నారు. వీరు కూడా సమస్యాత్మక ప్రాంతాల్లోని  ప్రధాన రోడ్లు, జనాలు ఎక్కువగా వచ్చిపోయే ప్రాంతాల్లో ఈ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. సోమవారం నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమాలు మంగళవారం మరిన్ని ప్రాంతాలకు విస్తరించారు. ముఖ్యంగా ప్రధాన రోడ్ల వెంట సోడియం హైపోక్లోరైట్‌ ద్వారా వీరు శుద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నాలుగు వందల లీటర్ల సామర్థ్యంగల ట్యాంకులుండే ఈ జట్టింగ్‌ యంత్రాల్లో మూడొంతుల నీరు, ఒక వంతు సోడియం హైపోక్లోరైట్‌ కలిపి పిచికారి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వైరస్‌ నిర్మూలనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.


logo