మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 25, 2020 , 02:54:32

హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారిపై నిరంతరం నిఘా

హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారిపై నిరంతరం నిఘా

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  విదేశీయులు, విదేశాలనుంచి వచ్చి హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారిపై నిరంతరం నిఘాను ఏర్పాటుచేయాలని మున్సిపల్‌ శాఖ జీహెచ్‌ఎంసీకి స్పష్టంచేసింది. అంతేకాదు, పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని, ఈనెల 31వ తేదీవరకు కార్యాలయాల్లోకి సందర్శకులను అనుమతించరాదని కోరింది. అయితే ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వాటిపై వెంటనే స్పందించాలని కోరింది. దీనికోసం సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలని సూచించింది. కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేసి కాంటాక్ట్‌ నంబర్‌ను అందుబాటులోకి తేవాలని కోరింది. ఈ మేరకు లాక్‌డౌన్‌, కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల నేపథ్యంలో మంగళవారం మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ జీహెచ్‌ఎంసీకి పలు మార్గదర్శకాలు జారీచేశారు. 


క్వారంటైన్‌ అమలు కోసం

క్వారంటైన్‌లపై పర్యవేక్షణకు జోన్లు, సర్కిళ్లు, వార్డులవారీగా  బృందాలు ఏర్పాటుచేయాలి

విదేశీ వ్యవహారాలు, పోలీసు, కస్టమ్స్‌ తదితర శాఖలు అందించిన వివరాల ఆధారంగా విదేశీయులు, విదేశాలనుంచి వచ్చినవారి వివరాలు, చిరునామా, క్వారంటైన్‌ చిరునామా తదితర డేటాబేస్‌ను రూపొందించాలి.

హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారిపై వారు వచ్చినప్పటినుంచి 14రోజులపాటు నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటుచేయాలి.

క్వారంటైన్‌లో ఉన్నవారిని వాకబుచేసినట్లు రోజువారీగా రికార్డు నిర్వహించాలి.

ఎవరైనా క్వారంటైన్‌ నిబంధన ఉల్లంఘించి బయట తిరిగితే వెంటనే వారిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించాలి.

క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేయాలి.


కంట్రోల్‌ రూమ్‌, సమస్యల పరిష్కారం కోసం

పోలీసు, రెవెన్యూ, ఫైర్‌, విద్యుత్‌, నీటి సరఫరా, లీగల్‌ మెట్రాలజీ, ఎక్సైజ్‌ తదితర లైన్‌ డిపార్ట్‌మెంట్లతో జీహెచ్‌ఎంసీలో ఓ కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేయాలి. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేశారు

కంట్రోల్‌ రూమ్‌ కాంటాక్ట్‌ నంబర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ప్రచారం కల్పించాలి. దీనివల్ల ప్రజలు వెంటనే సంప్రదించే వీలు కలుగుతుంది.

కంట్రోల్‌ రూమ్‌ 24 X 7 గంటలు నడిచే విధంగా సిబ్బందిని షిఫ్టులవారీగా నియమించాలి.

ప్రజలతో సంబంధాల కోసం ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలి.

వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై రికార్డ్‌ నిర్వహించాలి. ప్రజా ఫిర్యాదులపై స్పందించడంలో ఎటువంటి జాప్యం చేయరాదు.


కార్యాలయం, ఉద్యోగుల విషయంలోచేపట్టాల్సిన చర్యలు

 కార్యాలయాల్లో తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌ సౌకర్యాలు కల్పించాలి.

కార్యాలయాల్లోకి సందర్శకులను అనుమతించరాదు. ఫోన్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ అడ్రస్‌లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఆన్‌లైన్‌ ద్వారానే ఫిర్యాదులను పరిష్కరించాలి.

ఈనెల 31వరకు సందర్శకుల రాకను నిషేధించినట్లు పేర్కొంటూ కార్యాలయం ముందు బ్యానర్‌ ఏర్పాటుచేయాలి. అలాగే, ప్రజలు కాంటాక్ట్‌ చేసేందుకు కార్యాలయ ఫోన్‌ నంబర్‌ అందుబాటులోకి తేవాలి.

అత్యవసర సర్వీసుల నిర్వహణ, నిర్ణీత కాలవ్యవధిలోగా పూర్తిచేయాల్సిన అత్యవసర పనులు ఏమైనా ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు వికేంద్రీకరించి జనాలు గుమిగూడకుండా చూడాలి.

ముఖ్యంగా కలక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల వద్ద ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు పాటించాలి.

ఉద్యోగుల మధ్య కూడా సోషల్‌ డిస్టెన్స్‌ను తప్పనిసరిగా పాటించాలి.

కలక్షన్‌ సెంటర్ల వద్ద జనాలు దూరదూరంగా నిల్చునే విధంగా ఐదు అడుగుల దూరాన్ని పాటించే విధంగా ఫుట్‌మార్క్‌లను ప్రింట్‌ చేయాలి.

క్షేత్రస్థాయి ఉద్యోగులకోసం ఈనెల 31వరకు వర్క్‌ షెడ్యూల్‌ను ప్రకటించాలి.

విధులు సాధ్యమైనంతమేరకు పరిమితం చేయాలి

ఎటువంటి జాప్యం లేకుండా ఏప్రిల్‌ ఒకటవ తేదీ వరకు అందరూ ఉద్యోగులకు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. 

లాక్‌డౌన్‌ కాలంలో పర్మినెంటు, ఔట్‌సోర్సింగ్‌ తదితర ఉద్యోగుల హాజరు విషయంలో బలవంతం చేయకుండా ఉదారంగా వ్యవహరించాలి. విధి నిర్వహణలో ఏమైనా ఫిర్యాదులుంటే వారిపై తగిన చర్యలు తీసుకోవాలి.


పారిశుధ్యం, ప్రజారోగ్యం కోసం..

పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్యానికి కమిషనర్‌ అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి.

 నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అదనపు వాహనాలను, మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలి.

ఇంటింటికీ వ్యర్థాల సేకరణ, వాటి రవాణాకు తగిన అత్యవసర కార్యప్రణాళికను సిద్ధంచేసుకొని దానిప్రకారం విధులు నిర్వహించాలి.

కూరగాయల మార్కెట్లు, వీక్లీ మార్కెట్లు, మాంసం దుకాణాలు, మిల్క్‌ బూత్‌లు తదితరవాటి వద్ద పరిశుభ్రతను పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి


పారిశుధ్య కార్యక్రమాలు ప్రత్యేకంగా చేపట్టాలి

పేదలు నివసించే ప్రాంతాలు, మురికివాడలు, వలస కూలీలు నివసించే ప్రాంతాల్లో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. అంతేకాకుండా ఆహార పదార్థాలు, అత్యవసర వస్తువులకు కొరత రాకుండా చూడాలి.

పార్కులు, జనాలు గుమిగూడే ఇతర ప్రదేశాలను పూర్తిగా మూసివేయాలి.logo
>>>>>>