బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 25, 2020 , 02:53:32

ప్రజలు బయటకు రావద్దు..

 ప్రజలు బయటకు రావద్దు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ మన్సూరాబాద్‌/ఆర్కేపురం: కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.. రోజు రోజు కరో నా కేసులు పెరుగుతున్నాయి.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దు.. లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రేషన్‌ బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కోసం రూ.1500 సీఎం కేసీఆర్‌ అందజేస్తున్నారని అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిస్థితులను తెలుసుకునేందుకు హోంమంత్రి  మంగళవారం రాచకొండ సీపీ మహే శ్‌ భగవత్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వివరాలను అ డిగి తెలుసుకున్నారు. అనంతరం ఎల్బీనగర్‌లోని రాచకొండ కమిషనరేట్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు..

కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను రాచకొండ పోలీసులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవడమే కాకుండా.. ఎవరైనా రోడ్లపైకి వస్తే వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి నచ్చజెప్పి ఇంటికి పంపుతున్నారన్నారు. కరోనా చాలా ప్రమాదకరమైందని.. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయని.. ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బ యటకు రావద్దని ఆయన సూచించారు. నిత్యావసర సరుకులను ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనుగోలు చేయాలి, ఒకరికి ఒకరు మీటరు దూరంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి బయటకు రావద్దన్నా రు. ఎప్పటికప్పుడు చేతులను సబ్బులు, శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్‌ కఠోరంగా శ్రమిస్తున్నారని.. నిత్యం ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతూ వైరస్‌ను నివారించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందిస్తున్నారని తెలిపారు. భిక్షాటన చేసేవారికి భోజన సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆయన ఆదేశించారు. 

మీడియాపై దాడులు జరగకుండా చర్యలు ..

కరోనా వైరస్‌ కట్టడి కోసం మీడియా చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. మీడియాపై దాడుల విషయంపై కొందరు జర్నలిస్టులు ప్రశ్నించగా.. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని,   ఈ విషయంపై డీజీపీతో మా ట్లాడానని.. జర్నలిస్టులకు పాస్‌లు ఇవ్వాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కాలనీలు, గ్రామాల్లో స్వచ్ఛందంగా గ్రామస్తులు రహదారులను మూసివేస్తున్న విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఈ విషయంలో ఎక్కువగా చేయవద్దని సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అమ్మే వారిపై నిఘాపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌, ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

 కరోనా మహమ్మారిని తరిమికొడతాం : రాచకొండ సీపీ

 ప్రతి ఒక్కరం స్వీయ నియంత్రణ పాటించి కరోనా మ హమ్మారిని తరిమికొడుతామని రాచకొండ సీపీ  మహేశ్‌భగవత్‌ అన్నారు. ప్రజలు గుమిగూడవద్దని తెలిపారు.  కొంత మంది.. ప్రజలను అంబులెన్స్‌లో తరలిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, దానిపై నిఘా పెట్టి బంద్‌ చేయించామని, అలాంటివి ఎమైనా ఉంటే డయల్‌ 100కి, వాట్సాప్‌ కంట్రోల్‌ నం.9490617111 కు సమాచారం ఇవ్వాలని సీపీ తెలిపారు.


logo
>>>>>>