శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 25, 2020 , 02:52:06

నిత్యావసర వస్తువులను.. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

నిత్యావసర వస్తువులను.. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేడ్చల్‌ కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కలెక్టర్‌ తన చాంబర్‌లో లాక్‌డౌన్‌ సందర్భంగా నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ సందర్భంగా వ్యాపారులు, దుకాణ యజమానులు నిత్యావసర ధరలు పెంచకుండా జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. తరుచూ వాణిజ్య దుకాణాలను, రైతు బజార్‌లను ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాల్స్‌, కిరాణ మెడికల్‌ దుకాణాల్లో ముద్రించిన ధర కంటే ఎక్కువ విక్రయించినప్పుడు, తూకాల్లో మోసాలు చేసే వ్యాపారులపై అత్యంత కఠినంగా ఉండాలన్నారు. ముఖ్యంగా శానిటైజర్లు, మాస్కులు అధిక ధరలకు అమ్మకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో కూరగాయల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బోయినపల్లి రైతుబజారులో ప్రభుత్వ నిర్ణయించిన ధరల ప్రకారమే కూరగాయలను విక్రయించాలని మార్కెట్‌ ఎస్టేట్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రైతులు కూరగాయలు తీసుకొచ్చే సమయంలో వాహనాలను ఆపితే రాష్ట్ర స్థాయిలో టోల్‌ఫ్రీ నంబర్‌ 040-2345 0624, 040- 23450735, జిల్లా స్థాయిలో 9492409781కి ఫోన్‌ చేయాలని రైతులకు  సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌, డీఆర్‌వో మధుకర్‌ రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఛాయా దేవి, డీసీవో శ్రీనివాస్‌ రావు, పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మేరి రేఖా, రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారులు పాల్గొన్నారు.logo